Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బేబీకార్న్ ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతాయి. చినుకులు రాలుతున్నప్పుడు కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటుంటే భలే రుచిగా ఉంటాయి. మొక్కజొన్న ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అయితే పిల్లలు వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటప్పుడు బేబీకార్న్‌తో కొన్ని రకాల స్నాక్స్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. అలాంటి కొన్ని రకాల సాయంత్రపు స్నాక్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం...
మంచూరియా
కావల్సిన పదార్థాలు : బేబీ కార్న్‌లు - 12, మైదా - మూడు టేబుల్ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డ - ఒకటి, ఉల్లికాడల తరుగు - టేబుల్ స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద - రెంటు టీ స్పూన్లు, కారం - టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, చిల్లీ సాస్ - టీ స్పూను, సోయా సాస్, టమాటా సాస్ - రెండు టీ స్పూన్ల చొప్పున, నూనె - వేగించడానికి సరిపడా, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను.
తయారీ విధానం : ఒక గిన్నెలో బేబీ కార్న్‌లు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, మైదా, కార్న్‌ఫ్లోర్ వేసి, సరిపడా నీళ్ళు పోసి బాగా కలపాలి. తర్వాత బేబీ కార్న్‌లను నూనెలో పకోడీల మాదిరిగా వేసి దోరగా వేగించాలి. ఆ తరువాత ఒక ఫ్రెయింగ్ పాన్‌లో అర టేబుల్ స్పూను నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, వెల్లుల్లి తరుగులను వేగించాలి. తర్వాత చిల్లీ సాస్, సోయా సాస్, టమాటా సాస్, కొద్దిగా ఉప్పు కూడా వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత బేబీ కార్న్, ఉల్లికాడల తరుగు కూడా వేసి బాగా కలిపి దించేయాలి.
లాలీపాప్స్
కావల్సిన పదార్థాలు: పనీర్ - 200 గ్రాములు, క్యాప్సికం - ఒకటి, బేబీ కార్న్‌లు - 10, గరంమసాల, తేనె - అర టీ స్పూను చొప్పున, నిమ్మరసం - టీ స్పూను, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, చాట్ మసాల, కారం - పావు టీ స్పూను చొప్పున, ఉప్పు - రుచికి సరిపడా, టూత్‌పిక్‌లు - 20.
తయారు చేసే విధానం : బేబీ కార్న్‌లను అడ్డంగా సగానికి కోయాలి. తర్వాత పనీర్, క్యాప్సికంలను కూడా అంగుళం మేర ముక్కలుగా కోయాలి. ఆ తర్వాత ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసి ఉప్పు, కారం, నిమ్మరసం, గరంమసాల, తేనె వేసి బాగా కలిపి అరగంట నానబెట్టాలి. తర్వాత టూత్‌పిక్‌లకు క్యాప్సికం, పనీర్ ముక్కలను గుచ్చి, చివరిలో బేబీ కార్న్‌లను నిలువుగా గుచ్చాలి. ఆ తర్వాత వీటిని ఒక పెనం మీద ఉంచి కొద్దికొద్దిగా నూనె వేస్తూ దోరగా అన్ని వైపులా వేగించాలి. చివర్లో చాట్ మసాల చల్లి దించేయాలి.
స్పైసీ బేబీ కార్న్
కావల్సిన పదార్థాలు : బేబీ కార్న్‌లు - 10, పెరుగు - పావు కప్పు, కార్న్‌ఫ్లోర్, నూనె - టేబుల్ స్పూను చొప్పున, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - పావు టీ స్పూను చొప్పున, కారకం, చాట్ మసాల, గరం మసాలా - అర టీ స్పూను చొప్పున, ఉప్పు - రుచికి సరిపడా, నిమ్మరసం - టీ స్పూను.
తయారు చేసే విధానం : బేబీ కార్న్‌లను కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించి తీయాలి. తర్వాత ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్, పెరుగు, పసుపు, కారం ఉప్పు, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరంమసాల, బేబీ కార్న్‌లు వేసి బాగా కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి. తర్వాత ఒక పెనం మీద నూనె వేసి బేబీ కార్న్‌లను అన్ని వైపులా దోరగా వేగించాలి.
గోల్డ్ ఫింగర్స్
కావల్సిన పదార్థాలు: బేబీ కార్న్‌లు - పది, - శెనగపిండి, బియ్యప్పిండి - పావు కప్పు చొప్పున, కారం - అర టీ స్పూను, వంటసోడా - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేగించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: ఒక్కో బేబీ కార్న్‌ను నిలువుగా సగానికి కోసి రెండు ముక్కలు చేయాలి. తర్వాత ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యప్పిండి, కారం, ఉప్పు, వంట సోడా వేసి, సరిపడా నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసి అది వేగెక్కాక బేబీ కార్న్ ముక్కల్ని బజ్జీల పిండిలో ముంచి, పిండి బాగా పట్టాక, నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేగించాలి.