Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగి ఆసుపత్రులు నిండిపోతున్నాయి. జిల్లాలలో కూడా కరోనా టెస్టు సెంటర్లు వచ్చేశాయి. ఇప్పుడు కరోనా కేసులు మహానగరాలను దాటి జిల్లాలు, గ్రామాలవైపు పెరుగు తున్నాయి. కరోనా రోగులు పెరుగుతున్నారు కానీ ఆసుపత్రుల్లో స్టాఫ్ పెరగడం లేదు. ఉన్న సిస్టర్ల మీదే డబుల్ డ్యూటీలు పడుతున్నాయి. క్వారంటైన్లలో కరోనా రోగులు నానా అవస్థలూ పడుతున్నారు. కరోనా ఎటాక్ చేసినందుకే వారు బాధితులు. బాధితుల్నే మరల బాధలకు గురి చేస్తున్నారు. ఇళ్ళ దగ్గర, ఊళ్ళలోనూ కరోనా రోగుల్ని అంటరానివారిగా చూస్తున్నారు. ఒక అపార్టుమెంటులో కరోనా సోకిన ఇంటికి మిగతా ఫ్లాటు వాళ్ళు రోజుకొకరు చొప్పున ఆహారం అందించి ధైర్యం చెప్పారట. వారు ఇంట్లోంటి బటయకు రాకుండా వారికి కావల్సిన అన్నీ సమకూర్చారట. ఇది చాలా అభినందనీయం. మనం పోరాడాల్సింది కరోనా వైరస్‌తో. అంతేగానీ కరోనా రోగితో కాదు అనే విషయం వందశాతం పాటించాల్సిన విషయం. కరోనాను నిరోధించేందుకు వేడినీళ్ళతో పుక్కిలించటం, పసుపు, జండూబామ్లతో వేడి నీటి ఆవిరి పట్టడం, నాలుగైదు సార్లు కషాయం తాగడం వంటివి చేస్తే బాగుంటుంది. ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉందాం! కొన్ని బొమ్మలు తయారీ చూద్దాం!
చెంచాలతో
ఇవి మామూలు ప్లాస్టిక్ చెంచాలు కావు. పిల్లలకు వాడే పాల డబ్బాలలో ఉండే చెంచాలివి. పాలు కలుపుకోవడానికి సరియైన కొలత కోసం డబ్బాలలో వెడల్పాటి చెంచాలుంటాయి. పాలసీసాలో నీళ్ళు పోసేందుకు ఒక గీత ఉంటుంది. ఒక గీత వరకు ఒక స్కూన్ పాలపొడి వెయ్యాలి. దాని కోసం వచ్చే పెద్ద చెంచాలివి. ఈ చెంచా లోతుగా చిన్న గ్లాసులా ఉంటుంది. దీని చుట్టూ పట్టుకోవడానికి చక్రం లాగా ఉంటుంది. నేను ప్రస్తుతం దీనిలో చిన్న చిన్న పూలను పెట్టి పూలకుండీగా మార్చాను. ఇంకా అందులో రెండు పావురాల ఈకల్ని కూడా పెట్టాను. మా ఇంట్లో పావురాలు గూళ్ళు పెట్టుకొని పిల్లల్ని పెడుతుంటాయి. అందుకే నాకీ ఈకలు దొరికాయి. వాటికి రంగులు వేసి ఇందులో పెట్టాను. మామూలుగా ఎక్కడైనా దొరికే కోడి ఈకల్ని కూడా వాడవచ్చు.
అట్టపెట్టెలతో
బ్రౌన్ రంగులో ఉండే అట్ట పెట్టెలతో చిన్న చిన్న బొమ్మలు చేసుకోవచ్చు. ఇళ్ళు కట్టుకోవచ్చు. బిస్కెట్ ప్యాకెట్లలో ఉండే ప్యాకింగ్ అట్టలు కూడా వాడుకోవచ్చు. పైన కింద రెండు పొరలుండి మధ్యలో వంపు తిరిగిన పొర ఉంటుంది వీటికి. అలాంటి అట్టలు తీసుకున్నపుడు మనకు కావాల్సినట్లు వంపడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నేనీ ఈ అట్టలతో ఓ చిన్న బొమ్మరిల్లు కట్టాను. ఆ ఇల్లుకు గిఫ్ట్ ప్యాకింగ్ పేపర్‌తో రంగులు వేశాను. మెరిసే రంగులతో అందంగా ఉంది ఇల్లు. ఇంకా మెరవడానికి రాఖీ రోజు కట్టుకొని తీసేసిన రాళ్ళ రాఖీలను ఈ ఇంటికి కట్టాను. నీకు నేను రక్ష నేను నీకు రక్ష మనిద్దరం ఇంటికి రక్ష అని రక్షా బంధనం కట్టుకున్న ఇల్లు అందంగా తయారయింది.
ఫోటోథెరపీ బల్బులతో
పిల్లలు పుట్టగానే జాండీస్ వస్తుంటాయి కొందరికి. కళ్ళు, ఒళ్ళు, పసుపు పచ్చగా మారిపోవడం మనకు పైకి కనిపించే సాధారణ లక్షణం. ఇలా జాండీస్ వచ్చిన పిల్లలను పిల్లల ఆసుపత్రిలోని ఫోటోథెరపీ యూనిట్లో ఉంచుతారు. అలాంటి ఫొటోథెరపీ యూనిట్లలో ఒక రకమైన బల్బులు ఉంటాయి. అవి మాడిపోయినప్పుడల్లా తీసివేస్తుంటారు. అలా మాడిపోయిన బల్బును తీసుకొని నేను దాని చుట్టూరా కుందన్లు అతికించాను. ప్లోరసెంట్ బల్బులా చాలా మెరుస్తూ ఉంటుందది. దాని మీద ఇవి అతికించే సరికి దాని అందం ద్విగుణీకృతమైంది. దీనిని తీసుకెళ్ళి ఒక పాత సీడీపై అతికించాను. చాలా అందంగా అనిపించింది. మీరూ చూడండి.
వెల్వేట్ షీీట్లతో
మార్కెట్లో రంగు రంగుల వెల్వేట్ కాగితాలు దొరుకుతాయి. వీటిని కత్తిరించి పువ్వులు చేసుకోవచ్చు. నేను అలా బొడ్డు మల్లెల్ని తయారుచేశాను. పొట్టికాడతో అనేక దళాలుగా విప్పారి మంచి వాసనతో ఉండే బొడ్డు మల్లెల ఆకారంలో తయారు చేయాల నుకున్నాను. దానికోసం కాగితాల్ని పొరలుగా కత్తిరించి పెట్టుకున్నాను. ఈ మల్లెలకు రెక్కలు చాలా ఉంటాయి. అదే విధంగా బహు రెక్కలతో ఈ పూలను తయారుచేశాను. అయితే కేవలం తెలుపురంగుతో కాకుండా అన్ని రంగుల మల్లెపూలనూ తయారు చేశాను. చాలా అందంగా తయారైనాయి. సరే వీటినొక ఫ్లవర్ బొకేలా చేద్దామనుకున్నాను. అంతలో చాక్లెట్లు తినేయగా మిగిలిన ప్లాస్టిక్ ట్రే ఖాళీగా కనిపించింది. డెయిరీ మిల్క్ చాక్లెట్లు ఈ ప్యాకింగ్‌లో వచ్చాయి. చాక్లెట్ కలర్‌తో ఉన్న ప్లాస్టిక్ ట్రేలో ఈ రంగురంగుల మల్లెల్ని అతికించాను. చక్కని పూల పళ్ళెంలా అమరింది.
ఇంజక్షన్ సీసాల వేస్ట్‌తో
ఇంజక్షన్ సీసాల మీద పలు చటి అల్యూమినియం రేకులుం టాయి. వాటిని తీసేసిన తర్వాతనే సీసాలోని మందును సిరంజిలోకి ఎక్కిస్తారు. అలా తీసేసిన రేకులు గుండ్రంగా ఉంటాయి. అవన్నీ తెల్లగా అల్యూ మినియం లాగానే ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన ఇంజక్షన్లకు రంగుల్లో ఉంటాయి. వాటిని ఎన్నో ఏళ్ళు సేకరించగా ఇలాంటి బొమ్మలు చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఈ రంగుల తళుకులతో నేనీరోజు పూలకుండీ ఎలా చేయాలో చెప్తాను. మొదటగా పెన్సిల్‌తో బొమ్మను గీసుకొని దాని మీద ఈ తళుకుల్ని అతికించుకుంటూ వెళ్ళాలి. పువ్వుల రంగుల్ని మారుస్తూ పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ప్రయత్నించండి.
తల్లిపాల వారోత్సవాల బొమ్మ
ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకూ గల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. ఈ ఆగస్ట్ తొలి వారం రోజులూ అన్నీ ఆసుపత్రులలోనూ తల్లిపాల విశిష్టత గురించిన అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పోతపాలు ఆలోచన చేయాలనీ, తల్లిపాలతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయనీ చెబుతారు. తల్లిపాలలో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటుంది. పిల్లలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. మాది పిల్లల హాస్పిటల్ కదా. మరి వచ్చే తల్లిదండ్రులకు తెలియజెప్పాలి కదా! అందుకే నేనీ చిత్రాన్ని తయారు చేశాను. తల్లిపాలకు సంబంధించిన ట్యాబ్లెట్ల మీదుండే కవర్‌ను కత్తిరించి వేరే ఒక రంగు వేసిన కార్డుబోర్డు మీద అతికించాను. దాని చుట్టూ ఒక లేస్‌ను అతికించి చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని డిజైన్ చేశాను. ఈ డిజైన్ కోసం ఇంజక్షన్లు మీదుండే తళుకుల్ని ఉపయోగించాను.