Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సన్నబడాలి. కానీ కష్టపడకూడదు. బద్దకమేసి కాదు. టైమ్ లేక. ఇప్పుడు ఇదే చాలామందికి ఉన్న సమస్య. బరువు పెరుగుతున్నామని తెలిసినా తగ్గడానికి సమయం వెచ్చించలేని పరిస్థితి. అలాంటివారి కోసమే ఇది. సన్నబడటానికి ఒక సింపుల్ పద్ధతి... తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడమే. మీరు సహజంగా తినే కొన్ని రకాల ఆహార పదార్థాలను వేరే వాటితో రీప్లేస్ చేస్తే చాలు పనైపోతుంది.
- రోజూ ఉదయం కాఫీ, టీలలో వేసుకునే పాల నుంచి డెబ్భైకి పైగా క్యాలరీలు వస్తాయి. కాబట్టి పాలు కలిపిన కాఫీ, టీల బదులు లెమన్ టీ, గ్రీన్ టీ వంటివి తాగండి.
- ఇప్పటి నుండి గారెలు, మైసూర్ బజ్జీలను తినడం మానేసి ఇడ్లీ, దోశలు బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోండి. దోశలు నూనె లేకుండా కాల్చాలి.
ట పాలతో ఏదైనా పదార్థం చేస్తుంటే కనుక మామూలు పాలను స్కిమ్డ్ మిల్క్‌తో రీప్లేస్ చేయండి. దానివల్ల ఓ కప్పుకు దాదాపు డెబ్భై రెండు క్యాలరీల చొప్పున తగ్గుతాయి.
- చికెన్, ఫిష్ లాంటి వాటిని ఫ్రై చేసే బదులు గ్రిల్ చేయండి. కూరలు కూడా వండొద్దు. ఎందుకంటే ఓ కప్పు చికెన్ కర్రీలో 250 క్యాలరీలు ఉంటే గ్రిల్డ్ చికెన్‌లో 114 క్యాలరీలు మాత్రమే ఉంటాయి.
- మామూలు రైస్ తీసుకుంటుంటే బ్రౌన్ రైస్‌కు మారిపోండి.
- సమోసాలు, పకోడీలు, చిప్స్ లాంటి స్నాక్స్‌కి బదులు పండ్లు తీసుకోండి. ఫ్రూట్ చాట్, ఫ్రూట్ సలాడ్స్ లాంటివి తినడం వల్ల కడుపూ నిండుతుంది, బరువూ పెరగరు.
- ఫ్రైడ్ ఎగ్ కంటే ఉడికించిన గుడ్డు ఎంతో మంచిది. ఉడికించిన గుడ్డులో 78 క్యాలరీలు ఉంటే ఫ్రై చేసిన దానిలో 100 క్యాలరీలు ఉంటాయి. మీరు బరువు పెరగకుండా వుండాలంటే ఏది మంచిదో మీరే నిర్ణయించుకోండి.
- కూల్ డ్రింక్స్ తాగే బదులు మంచినీరు తీసుకోండి. మంచినీరు చేసినంత సాయం ఏ పానీయమూ చేయదు. నీటి వల్ల క్యాలరీలు పెరగవు కానీ ఒక్క డ్రింక్ తాగినా నూట యాభైకి పైగా క్యాలరీలు పెరుగుతాయి. అందుకే దాహం వేసినప్పుడల్లా మంచినీరు తాగండి తప్ప కూల్ డ్రింక్స్ వైపు చూడకండి.
ఈ చిట్కాలు పాటిస్తే బరువు పెరగరు. పైగా ఉన్న బరువు తగ్గుతారు. ఎప్పుడూ తినే వాటిలో మార్పులు చేయ డమే కాబట్టి పెద్ద కష్ట పడాల్సిన అవసరం కూడా లేదు.