Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత రోజుల్లో వ్యాపార రంగంలోకి మహిళలు ఎక్కువగానే ప్రవేశిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని విజయాలను అందుకుంటున్నారు. ఆర్థికంగా నిలబడేందుకు కృషి చేస్తున్నారు. పచ్చళ్ల నుంచి స్టార్టప్‌ల వరకు తమదైన ముద్ర వేసుకుంటున్నారు. కాలానికి తగ్గట్టుగా వ్యాపార రంగంలో నూతన విధానాలతో అడుగు పెడుతున్నారు. అలాంటి కోవలోకే వస్తారు విజయ వల్లూరి. అరుదైన వ్యాపార రంగంలోకి ప్రవేశించి విజయాలు సాధిస్తున్న ఆమె గురించి నేటి మానవిలో...
విజయది హైదరాబాద్. గతంలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేవారు. జీతం బాగానే ఉన్నప్పటికీ తన ఆసక్తి ఎప్పుడూ వ్యాపారం పైనే ఉండేది. ఇద్దరు సోదరులు మోటార్ ఫీల్డ్‌లో వున్నారు. తను కూడా అదే వ్యాపార రంగంలోకి వెళ్లాలి అనుకున్నారు. దాని కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అంతకు మించి గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత ఆమెకు వచ్చిన ఆలోచన బైక్ లను కిరాయికి ఇచ్చే వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నారు. ఒకప్పుడు సైకిళ్లను కిరాయికి ఇచ్చేవారు. అదే కాన్సెప్ట్‌తో ఇప్పుడు టూ వీలర్లను కిరాయికి ఇవ్వాలి అనే ఆలోచనతో 'ఎరవాన్ బైక్స్' పేరుతో 2017 ఏప్రిల్ నెలలో సంస్థను ప్రారంభించారు. ఎరవాన్ అంటే థాయ్ భాషలో ఐరావతం.
తొలిమహిళగా...
సాధారణంగా బైక్ కిరాయిలు ఇవ్వడం కేవలం పురుషులకు సంబంధించిన రంగం. ఒక మహిళ ఈ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టినప్పుడు ఆమెను చూసి ఎందురో ఆశ్చర్యపోయారు. విమర్శించిన వారు కూడా ఉన్నారు. ఇంకేం వ్యాపారాలూ లేనట్టు ఓ మహిళ ఇలాంటి వ్యాపారం చేయడం ఏంటి అంటూ ఎగతాళి చేసిన వారూ ఉన్నారు. కానీ ఆమె ఏనాడు అధైర్య పడలేదు. అందరికంటే కాస్త వినూత్నంగా ఆలోచించాలనుకున్నారు. అందుకే ఎన్ని సమస్యలు ఎదురైనా పట్టించుకోలేదు. ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచారు. అలా అప్పుడు 10 బైకులతో ప్రారంభించిన వ్యాపారం నేడు 120 బైకులకు అభివద్ధి చెందింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో తొలి మహిళా బైక్ రెంటర్‌గా పేరు పొందారు.
నిబంధనలు తప్పక పాటిస్తారు
ఎరవాన్‌లో అన్ని రకాల బైక్‌లు ఉంటాయి. 100 సిసి నుంచి 500 సిసి సామర్థ్యం గల బైకులు ఇక్కడ లభిస్తాయి. నాలుగు గంటల కిరాయి 100 రూపాయాలు తీసుకుంటారు. మహిళా ఉద్యోగులు, గృహిణిలు, ఎరవాన్కు రెగ్యులర్ కస్టమర్లు. ఎక్కడికి కావాలంటే బైక్ అక్కడికి తీసుకువెళ్లి ఇస్తారు. విజయ నిబంధనలను కూడా కచ్చితంగా పాటిస్తారు. ఎరవాన్ బైక్ ఉపయోగించాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
సకాలంలో స్పందిస్తూ...
సాధారణంగా మోటార్ ఫీల్డ్ అంటేనే పురుషాధిపత్యం ఉంటుంది. నిజంగానే ఈ పని మహిళల వల్ల కాదేమో అనే సందేహం కచ్చితంగా వస్తుంది. ఊహించినట్టుగానే చాలా కష్టాలు చూసారు. విజయ వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. యాక్సిడెంట్లు, చలాన్లు ఉండేవి. కానీ వాటిని తెలివిగా డీల్ చేస్తూ ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా తమ సేవలకు ఆటంకం కలగకుండా రవాణాశాఖ చర్యలకు లోబడి నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ తమ సంస్థ తరపున ఉద్యోగుల్ని నియమించారు. 24 గంటల సేవలు కాబట్టి రెంటుకి ఇచ్చిన బైక్ ఎక్కడైన ఆగిపోయిన, ప్రమాదం జరిగినా విజయ సకాలంలో స్పందిస్తారు. ఈ విధంగా విజయ స్వంతంగా తన వ్యాపారాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం చూసి, అమీర్‌పేట చుట్టుపక్కల పదుల సంఖ్యలో బైక్ రెంటల్స్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. అవేమి తనకు పోటీగా భావించకుండా సేవా భావంతో కంపెనీని నడిపిస్తున్నారు.
మానవీయతను చాటుకుంటూ...
ఎరవాన్ బైక్స్ ప్రారంభం నుంచి అందులో పది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. బైక్ ఇచ్చి రావడం, తీసుకోవడం.. మరమ్మతులు చేయడం వీరి బాధ్యత. నిరుద్యోగ యువతకు ఎరవాన్ సంపాదన మార్గం చూపిస్తుంది. అది ఎలా అంటే.. చాలా మంది యువకులు ఎరవాన్‌లో బైకులు అద్దెకు తీసుకొని స్విగ్గి, మెడిసిన్ డెలివరీ, కొరియర్ డెలివరీ వంటి ఉద్యోగాలు చేస్తున్నారు. అమీర్‌పేట్‌లో దాదాపు 18 మంది ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎరవాన్కు పర్మినెంట్ కస్టమర్లు. వేరు వేరు వృత్తుల్లో ఉన్న వారందరినీ కలుపుకొని, ఒక్క అమీర్‌పేట్ ప్రాంతంలోనే 60 మంది ఎరవాన్ బైక్స్ ద్వారా తమ డ్యూటీలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఏరవాన్ యువతకు ఉపాధి చూపించడంలోనే కాదు మానవీయతను చాటుకోవడంలోనూ ముందు ఉంటుంది. ఉదాహరణకు ఫుడ్ డెలివరీ చేసే వారికి సరైన ఆర్డర్ దొరక లేదనుకోండి, లేదా ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ రోజు పనిలోకి రాలేదనుకోండి బైక్ కిరాయి తీసుకోకుండా సేవలందిస్తోంది.
అప్పటి వరకు ఏమీ తెలియదు
ఎరవాన్ ప్రారంభంలో బైక్‌ల గురించి విజయకు పెద్దగా అవగాహన లేదు. కానీ సంస్థ స్థాపించిన నాటి నుండి నిత్యం బైక్‌ల మధ్య గడపాల్సి రావడంతో వాటిపై పూర్తి పట్టు సాధించారు. బైక్ విడిభాగాలు, అవి పనిచేసే తీరు ఇలా అనేక విషయ పరిజ్ఞానాన్ని సంస్థ ఉద్యోగుల నుంచి నేర్చుకున్నారు. ప్రస్తుతం బైక్స్ వినియోగదారుల నాడి కూడా పట్టుకున్నారు. గతంలో ఆమెకు బండి నడపడం కూడా వచ్చేది కాదు. కానీ కంపెనీ ప్రారంభించిన తర్వాత అనేకసార్లు కస్టమర్లకు బైక్ ఇచ్చి రావాల్సి వచ్చింది. అందుకే నేర్చుకున్నారు. ఇప్పుడు ఆమె పెర్ఫెక్టుగా బండి నడిపిస్తున్నారు.
తమ సత్తా నిరూపించుకోవచ్చు
ఇప్పటివరకు 25 వేలకు పైగా కష్టమిర్స్కి సేవలు అందించారు. ఒక బైక్‌ని కిరాయికి ఇచ్చేటప్పుడు అన్ని వివరాలు నమోదు చేసుకుంటారు. ఆధారాలు తీసుకుంటారు. చేయాలనే ఆసక్తి, కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి వ్యాపార మైనా పురుషులే కాదు మహిళలు కూడా చేయగలరంటారు విజయ. ఏ వ్యాపారం లో అయిన మొదట్లో ఒడిదుడుకులు వుంటాయి. వాటిని అధిగమించడంలోనే తమ సత్తా ఏమిటో నిరూపంచు కోవచ్చు. ప్రతి మహిళా ఆర్ధికంగా స్వతంత్రురాలు కావాలి. తమకు ఇష్టమైన రంగంలోనే రాణించ టానికి కషి చేయాలంటున్నారు ఆమె.
- పాలపర్తి సంధ్యారాణి