Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ, హింస, సాన్నిహిత్యం, స్నేహం ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై ఉంటాయి. ప్రస్తుతం మనందరిపై ప్రస్తుత సాంకేతిక యుగం తీవ్ర ప్రభావం చూపుతుంది. మానవ సంబంధాలపై మరింత ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్త్రీల భావోద్వేగాలు ఎలా ఉన్నాయో అన్వేషించారు జర్నలిస్టు నిషా సుసాన్. తన తొలి కథల సంకలనాన్ని 'ది ఉమెన్ హూ ఫర్గాట్ టు ఫేస్బుక్ అండ్ అధర్ స్టోరీస్' (ఫేస్బుక్ 'కని'పెట్టడం మర్చిపోయిన మహిళలు, ఇతర కథలు) పేరుతో తీసుకొచ్చి ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు. తన కథా సంకలనం గురించి ఆమె ఏమంటున్నారో తెలుసుకుందాం...
చిన్న చిన్న కథలను ఎప్పటి నుండో రాస్తున్నాను. వాటిలో కొన్ని వివిధ సాహిత్య పత్రికల్లో, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పత్రికల్లో ప్రచురించబడ్డాయి. 2017లో కార్తీకా వి.కె వెస్ట్‌ల్యాండ్ అనే ఓ సరికొత్త పత్రికకు బాధ్యతలు తీసుకున్నారు. దానికోసం నాన్ ఫిక్షన్ కథలను సేకరించే పని ఆమె నాకు అప్పగించారు. అందులో భాగంగానే ఈ పనికి పూనుకున్నాను. ఇందులో కొన్ని పాత కథలు కూడా ఉన్నాయి. కొన్ని కథలు మాత్రం ఇటీవల రాసినవి. వీటిలో కొన్ని ఇంటర్నెట్ ప్రారంభించిన కొత్తలో అందులో పొందుపరచబడ్డాయి.
కథల మత్తులో మునిగిపోయాను
నేను కర్ణాటకు చెందిన మూడోతరం మలయాళీని. ఈ రెండు రాష్ట్రాల భాషలు, సంస్కృతులు లేకుండా నేను లేను. ఈ రెండూ రాష్ట్రాలు నా జీవితంలో భాగమే. బెంగళూరులోని ప్రకృతి సోయగాలంటే అమితమైన ఇష్టం. అలాగే కేరళ సంస్కృతి, నదులు, సముద్రాలు, పడవలు, వంతెనల జీవితం, రాజకీయలు ఇవన్నీ నాకు ముఖ్యమైనవే. ఇవన్నీ నా కథలకు సహకరించాయి. మాటల్లో ఏదైతే చెప్పాలనుకున్నానో వాటినే కాగితాలపై పెట్టాను. కథలు రాసేటప్పుడు పూర్తిగా వాటిలో లీనమైపోయానని, ఆ కథల మత్తులో మునిగిపోయానని నా స్నేహితులు సరదాగా అనేవారు. అలా రాసినప్పుడు మాత్రమే ఆ కథల్లో జీవం కనిపిస్తుంది. అప్పుడే ఆ కథలు పాఠకుల గుండెలకు హత్తుకుంటాయి. నేను జాషువా ఫెర్రిస్ రాసిన నవలలు మొత్తం చదివాను. వాటిని చదవడం వల్లనే నేను రాసిన కథలకు ఎంతో కొంత న్యాయం చేశానని చెప్పగలను.
స్నేహం కూడా ఉపయోగపడింది
నా స్కూల్ వయసు నుండి ఎంతో మంది స్నేహితులు నా జీవితంలో ఉన్నారు. వారందరికీ ఇప్పటికీ సన్నిహితంగా ఉంటాను. వారితో అవకాశం దొరికితే రోజూ మాట్లాడుతూనే ఉంటాను. లేదంటే కనీసం వారానికి ఓ సారైనా వాళ్ళను పలకరిస్తాను. నా స్నేహితుల్లో మస్కట్‌లోని ఉన్నత పాఠశాల నుండి బెంగుళూరు కాలేజీ స్నేహితుల వరకు ఉన్నారు. వారిని కలుసుకోలేకపోతే జీవితం భిన్నంగా ఉండేదేమో అనిపిస్తుంది. అందుకే నా స్నేహితులు కూడా నా కథల్లో ముఖ్య పాత్ర పోషించారని చెప్పాలి.
బలమైన పాత్రలే ఉన్నాయి
ఈ కథలు రాసేటప్పుడు చాలా పాత్రలు నా నిత్యజీవితంలోనూ భాగంలా అనిపించాయి. అలా అనుకొని రాయకపోతే కథ వేరే దిశలోకి వెళుతుంది. రాసే కథకు మనం న్యాయం చయలేము. ఒక నవల, నాన్ఫిక్షన్, చిన్న కథల సమాహారం ఏదైనా సరరే సాధారణంగా మన జీవితంలోని వివిధ అంశాల నుండే పుట్టుకువస్తుంది. దీన్ని నేను కచ్చితంగా నమ్ముతాను. వీటిని రాయడానికి నేను పడిన శ్రమ, ఎడిట్ చేసిన విధానం, ఆలోచించిన తీరు చదివిన వారికి కచ్చితంగా అర్థమవుతుంది. కొన్ని పాత కథలను ఎడిట్ చేసి పెట్టాను. ఇందులో ఏవీ అంత బలహీనమైన పాత్రలు లేవని చదివిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది.
వివిధ ప్రాంతాల ప్రభావం
స్వతహాయ జర్నలిస్టును కాబట్టి ఆ ట్రైనింగ్ కూడా నా కథల ప్రక్రియలకు బాగా ఉపయోగడపిందని చెప్పాలి. ఏ సమయానికి ఏ పని పూర్తి కావాలో ముందే నిర్ణయించుకుంటాను. దాన్ని బట్టి కథను పూర్తి చేశాను. ముందు రఫ్‌గా రాసుకుంటాను. తర్వాత సమయాన్ని బట్టి వాటికి మెరుగులు దిద్దుకున్నాను. నా తల్లిదండ్రులు నైజీరియా, ఒమన్లలో పని చేశారు. కాబట్టి మేము అక్కడ కూడా కొంత కాలం ఉన్నాము. అయితే చాలా వరకు నేను బెంగుళూరులో నివసించాను. నేను నివసించిన ప్రాంతాల ప్రభావం, కలిసిన వ్యక్తుల ప్రభావం నాపై చాలా వుందని చెప్పాలి. ఆ ప్రభావాలు కూడా ఈ కథల్లో కనిపిస్తాయి.
ఉపాధ్యాయుల ప్రభావం
మస్కట్, బెంగు ళూరులోని పాఠశాలల్లో, తర్వాత కళాశాలలో (కార్మెల్ పర్వతం వద్ద) నేను కలిసిన అమ్మాయిలు... వీరంతా నా కథలో భాగమైపోయారు. మరీ ముఖ్యంగా నన్ను ఎంతో ప్రభావితం చేసిన ఉపాధ్యాయులు నా జీవితంలో ఉన్నారు. వారు కూడా నా రచనలకు ఎంతో సహకరించిందని చెప్పాలి. ఇటీవల నా ఉపాధ్యాయురాలిని కలిశాను. ఆమె నా జీవితంలో లేకపోతే ఈ కథలను రాసివుండేదాన్ని కాదని కచ్చితంగా చెప్పగలను. అసలు నేను రచయిత అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. వివిధ ప్రాంతాల్లో ఉండడం వల్ల బహుభాషలు నేర్చుకునే అవకాశం కూడా దొరికింది. ఇవన్నీ నా రచనలకు జీవం పోశాయని చెప్పాలి.
రాయడం కోసమే జీవిస్తున్నా
ఈ కథల పుస్తకం తీసుకురావడానికి గత ఐదేండ్లుగా కృషి చేస్తున్నాం. ఇప్పటికి ఇది పాఠకుల ముందుకు వచ్చింది. దీనికోసం అనేక ప్రపంచ దేశాల రచయితలతో కలిసి మాట్లాడాను. వారితో నా భావాలు పంచుకోవడం చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను రాయడం కోసమే జీవిస్తాను. భవిష్యత్‌లో దీన్ని ఇలాగే కొనసాగిస్తాను. అలాగే వెస్ట్‌ల్యాండ్ కోసం నాన్ఫిక్షన్ పుస్తకాల సేకరణ చేస్తున్నా. ఇది కూడా కొనసాగుతూనే ఉంటుంది. అలాగే కొన్ని అనువాదాలు చేయాల్సిన పుస్తకాలు కూడా ఉన్నాయి. వాటిని త్వరలోనే ప్రారంభిస్తాను.
ది లేడిస్ ఫింగర్
2013, డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. స్త్రీలపై జరుగుతున్న లైంగిక హింస గురించి అందరూ తీవ్రంగా స్పందించారు. అప్పుడే మేము స్త్రీవాదానికి సంబంధించిన ఓ వెబ్సైట్ ప్రారంభించడం గురించి చర్చించుకున్నాం. ఇది విస్తృతమైన మహిళల అనుభవాలను ప్రతిబింబించేలా ఉండాలని భావించాము. ఓ స్త్రీవాద వెబ్సైట్ అవసరం చాలా ఉందనే నిర్ణయానికి వచ్చాం. అలా నేను నా స్నేహితులతో కలిసి 2013 వేసవిలో 'ది లేడిస్ ఫింగర్'ను ప్రారంభించాం. సినిమాలు, టీవీ కార్యక్రమాలు మహిళలను ఏ విధంగా చూపిస్తున్నాయి, స్త్రీవాదాన్ని ఏ కోణం నుండి చూడాలి, పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపుల గురించి, మన ఆలోచనలు, ఫ్యాషన్, మహిళల జీవితాల్లో తమకంటూ ఎంత స్థానం వుంటుంది ఇవన్నీ ఈ బ్లాగులో ఉండేలా చూసుకున్నాం.
వెంట తీసుకెళతాయి
'ది ఉమెన్ హూ ఫర్గాట్ టు ఫేస్బుక్ అండ్ అధర్ స్టోరీస్' (ఫేస్బుక్ కనిపెట్టడం మర్చిపోయిన మహిళలు, ఇతర కథలు) కథలు కూడా మనిషిలోని భావోవ్వేగాల వలె వైవిధ్యంగా ఉంటాయి. ఓ శాస్త్రీయ సంగీత విధ్వాంసుడుతన చాట్ రూమ్‌లో ప్రేమను పుట్టిస్తాడు.. ఓ సోషల్ మీడియా సంస్థ కోసం ఉద్యోగ పర్యవేక్షణ కంటెంట్‌ను కనుగొన్న యువతల్లి.. తన కుమార్తె ఫోన్ సంభాషణ గురించి ఆందోళనచెందే ఓ కుక్... అలాంటి ఎన్నో వైవిధ్య భరితమైన జీవితాలను తన కథా వస్తువులుగా తీసుకున్నారు నిషా సుసాన్. మనల్ని కూడా ఆ జీవితాల వెంట తీసుకెళుతారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆమె కథల్లో మహిళల నిస్సాహాయత, వేదన, ప్రేమ దాని తాలూక భావోద్వేగాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ పాత్రల్లోని బాధను, ఆనందాన్ని మనమూ అనుభవించక తప్పదు.