Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతా బావుంది అనిపించినంతసేపూ మనం కొత్తగా ఏమీ ఆలోచించలేం. కాబట్టి లైఫ్‌లో కొత్తగా ఏ మార్పూ రాదు. కానీ ఉన్నదాన్ని ఉన్నట్టు అంతా ఇష్టపడటం ఎంతోకాలం చేయలేం. ఏదో ఓ రోజున బోర్ అనిపిస్తుంది. ఇంకేదో కావాలనిపిస్తుంది. ఓ బ్రేక్, ఓ మార్పు కావాలని అనిపిస్తుంది. అదిగో అలా అనిపించింది అంటే అది లైఫ్‌లో సరికొత్త మార్పుకి శ్రీకారమే కదా అంటున్నారు నిపుణులు. మరి అలా బ్రేక్ కావాలి, మార్పు కావాలి అనిపిస్తే అందుకు ఏం చేయాలి...
- మనం గడిపే జీవితంలో కొత్తగా ఇంకేమన్నా మార్పులు జరిగితే బావుండును అనిపించగానే చాలామంది ఏముంది- ఇంతే, ఈ లైఫ్ ఇలా గడవాల్సిందే వంటి నైరాశ్యంలో పడిపోతారు ముందు. ఆ తర్వాత నెమ్మదిగా ఏం చేయొచ్చు అన్న విషయం కోసం ఆలోచిస్తారు. నిజానికి అందులో కొద్దిమంది మాత్రమే అనుకున్న దిశగా అడుగులు వేస్తారు. తాము కోరుకున్న మార్పుని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తారు. దానినుంచి లభించే ఆనందాన్ని రుచి చూస్తారు. ఆ కొద్దిమందిలో మీరూ వున్నారా.. లేరా? అయితే ఆ లిస్ట్‌లో చేరాలంటే మనమేం చేయాలనేది నిపుణులు చెబుతున్నారు.
- లైఫ్‌లో మార్పు కావాలని అనిపిస్తే ఆ మార్పు బయట ఎక్కడినుంచో రాదు. అది మనలో రావాలి అంటున్నారు నిపుణులు. ముందుగా మన పరిధులు, పరిమితులు, పరిస్థితులు, వయసు వంటి వాటి గురించి ఆలోచించడం, భయపడటం, సందేహపడటం మానేయాలి. వీటన్నిటినీ పక్కన పెట్టి ఏ మార్పు అయితో మీకు ఆనందాన్నిస్తుందని మీరు గాఢంగా నమ్ముతున్నారో ఆ మార్పు గురించి ఆలోచించండి. ఆ తరువాత దానిని అమలు చేయడమెలాగో చూడండి. ప్రయత్నించండి. గట్టి సంకల్పం వుంటే ఏదీ అసాధ్యం కాదని గుర్తుంచుకోండి.
- మీకు నచ్చిన ఓ కోర్స్ చేయడం, సగంలో ఆపేసిన హాబీని తిరిగి నేర్చుకోవడం, కొత్తగా ఓ హాబీని అలవర్చుకోవడం, ఈవినింగ్ కాలేజీలో చేరడం లేదా ఓ కొత్త భాషను నేర్చుకోవడం, సమాజసేవ, ఓ వ్యాపారం.. ఇలా ఏదైనా కావచ్చు. తప్పకుండా ఓ మంచి ప్రయత్నే అవుతుంది. జీవితాన్ని ఇప్పటికంటే అందంగా మారుస్తుంది. నచ్చడం లేదంటూ పరిస్థితులను, జీవితాన్ని తిట్టుకుంటూ గడపటం, ఆ అసంతప్తిని ఇంట్లోవారిపై చూపించడం, మనల్ని మనం బాధపెట్టుకోవడం కంటే జీవితాన్ని నచ్చినట్టు మార్చుకోవడం ఎంతో సులువు.