Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త రుచులు కావాలి. లేదంటే ఓ పట్టాన తినరు. చూడటానికి కూడా కలర్ఫుల్గా వుండాలి. అప్పుడే ఇష్టంగా తింటారు. అన్నం తింటానికి సాధారణంగా పిల్లలు మారాం చేస్తారు. అలాంటి పిల్లలకు అన్నంతో కాస్త వెరైటీగా, కలర్ఫుల్గా చేసిపెడితే ఇష్టంగా తింటారు. అలాంటి వాటిలో కొన్ని అన్నం వెరైటీలు ఈరోజు మీకోసం...
మీల్మేకర్ పులావ్
కావలసిన పదార్థాలు : మీల్మేకర్ - 250 గ్రాములు, బియ్యం - 300 గ్రాములు, నెయ్యి - 100 గ్రాములు, ఉప్పు - ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క - ఒక ముక్క, అల్లం - 25 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు - 25 గ్రాములు, యాలకులు - 3, లవంగాలు -12, బిర్యానీ ఆకులు -2, పుదీనా- 1 కట్ట, కొత్తిమీర - 1 కట్ట, పచ్చిమిర్చీ -5, పచ్చి బఠాణీ - ఒక కప్, ఆలు - 1, ఉల్లిగడ్డ - ఒకటి.
తయారు చేసే విధానం : ముందుగా కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చి బఠాణీ, మీల్మేకర విడిగా ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని చిన్న కుక్కర్ పెట్టి నెయ్యి వేసి కొద్దిగా వేడి చేయాలి. దాల్చిన చెక్క, ఇలాచి, సగం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత ఉల్లితరుగు, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠాణీ, ఆలు ముక్కలు, మీల్ మేకర్ వేసి వేయించి సరిపడా నీళ్ళుపోసి ఉప్పు వేసి కడిగిన బియ్యం వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి.
కుబాలి రైస్
కావలిసిన పదార్థాలు : బియ్యం - ఆరకేజీ, శెనగపప్పు - రెండు కప్పులు, ఉల్లిగడ్డలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు స్పూన్లు, గరంమసాలా - కొద్దిగా, పుదీన - రెండు కట్టలు, నిమ్మకాయ - ఒకటి, నెయ్యి - చిన్న కప్పు, మిటాయిరంగు - చిటికేడి, పెరుగు - రెండు కప్పులు, పసుపు, ఉప్పు, కారం, నూనె - తగినంత.
తయారు చేసే విధానం : ముందుగా బియ్యం కడిగి నానబెట్టాలి. అలాగే శెనగపప్పును కూడా శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి ఉడకపెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె వేడి అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలను వేయించి, అవి ఎర్రగా వేగిన తర్వాత కారం, పసుపు, గరంమసాలా, ఉడికించిన శెనగపప్పును కూడా కలిపి కాసేపు స్టౌ మీద ఉంచి దింపాలి. ఈ మిశ్రమంలో పెరుగు, పుదీనతో పాటు ఉప్పును కూడా చేర్చి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో ఎసరుపెట్టి, నానబెట్టిన బియ్యాన్ని ఎసరులో పోసి ముడోంతులు ఉడకగానే అన్నాన్ని వార్చేసి, అదే గిన్నెలో కాస్తా నెయ్యి వేసి అది వేడి అయిన తర్వాత సగం అన్నాన్ని ఒక పొరగా వేసి, దానిపై శెనగపప్పు కూరను వేసి దానిపై మిగిలిన అన్నాన్ని మరో పొరలా వేసి ఆ పైన నెయ్యిను వెయ్యాలి. చివరిగా నిమ్మరసం చిటికెడు మిఠాయిరంగును అన్నంపై చల్లి ముతపెట్టి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
స్వీట్ పులావ్
కావలసిన పదార్థాలు : బియ్యం - ఒక కప్పు, చక్కెర - ముప్పావు కప్పు, డ్రై ఫ్రూట్స్ - పావుకప్పు, నెయ్యి - నాలుగు చెంచాలు, లవంగాలు - రెండు, యాలకులు - మూడు, సోంపు - ఒక చెంచా, పాలు - మూడు చెంచాలు, కుంకుమపువ్వు - చిటికెడు, ఎండుకొబ్బరి పొడి - మూడు చెంచాలు, దాల్చినచెక్క - చిన్న ముక్క, నీళ్లు - రెండు కప్పులు
తయారు చేసే విధానం : బియ్యాన్ని అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. పాలలో కుంకుమపువ్వు కలిపి పక్కన పెట్టాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెను స్టౌ మీద పెట్టి, నెయ్యి వేయాలి. వేడెక్కాక డ్రై ఫ్రూట్స్‌ను వేయించి తీసేయాలి. తర్వాత అదే నేతితో యాలకులు, లవంగాలు, సోంపు, దాల్చిన చెక్క వేయాలి. ఓ నిమిషం పాటు వేయించాక నానబెట్టిన బియ్యాన్ని వేయాలి. రెండు నిమిషాలు వేయించిన తరువాత నీళ్లు, పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి. నీళ్లు మరిగి బుడగలు వస్తున్నప్పుడు మూత పెట్టేసి మరో పది నిమిషాలు ఉడికించాలి. బియ్యం సగం ఉడికిన తరువాత చక్కెర వేసి బాగా కలపాలి. మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. అన్నం ఉడికిపోయిన తరువాత డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి దించేసుకోవాలి. కావాలంటే ఇంకాస్త నెయ్యి వేసుకోవచ్చు.
కొబ్బరి అన్నం
కావలసినవి పదార్థాలు : కొబ్బరికాయ - ఒకటి, బియ్యం - నాలుగు కప్పులు, ఆవాలు - కొద్దిగా, జీలకర్ర - ఒక స్పూను, ఎండుమిర్చి - ఐదు, కరివేపాకు - నాలుగు రెబ్బలు, శెనగపప్పు - ఒక కప్పు, మినపపప్పు - చిన్న కప్పు, ఉప్పు, నూనె - తగినంత, జీడిపప్పు - 4.
తయారుచేసే విధానం : ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, మరుగుతున్న ఎసట్లో వెయ్యాలి. ఉడికిన తరువాత వార్చి మూతపెట్టాలి. తర్వాత ఒక బాణలిలో కొంచెం నూనె పోసి స్టౌమీద పెట్టి వేడి అయిన తరువాత దాంట్లో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, మినపపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. ఇలా వేయించిన పోపును ఉడికిన అన్నం మీద పోసి ఉంచాలి. తరువాత పచ్చికొబ్బరి తురిమి, పోవు ఉడికిన అన్నంలో కలిపి తగినంత ఉప్పు వేసుకోవాలి. పైన జీడిపప్పు చల్లుకోవాలి. అంతే కొబ్బరి అన్నం రెడీ.