Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా ఇప్పుడప్పుడే మనల్ని వదిలేలా లేదు. కాబట్టి మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ని నెలల కాలం బయటికి వెళ్ళకుండా పనులు సాగవు. అవసరమైన వస్తువులు తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళితీరవలసిందే. అలాగని మాస్క్ లేకుండా వెళ్ళవద్దు. ఇంకో ముఖ్య విషయం మాస్క్ లేకుండా ఎవరూ బయట కనపించట్లేదు. ఇప్పుడు మాస్క్‌లు సహజ కవచకుండలాల్లాగా ముక్కుకు అంటి పెట్టుకునే ఉంటున్నాయి. అయితే ఎవరైనా కనబడగానే మాస్క్ తీసి మాట్లాడుతున్నారు. అది తెలియకుండా జరిగే పొరపాటు. మనిషి ఎదురుగా ఉన్నప్పుడే కదా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మాట్లాడేటప్పుడు పడే తుంపర్లే వ్యాధి వ్యాప్తికి కారణం. బజారుకు వెళ్ళినపుడే వీలైనన్ని సరుకులు, కూరగాయలు తెచ్చుకుంటే ఎక్కువసార్లు బయటకు వెళ్ళకుండా నిరోధించవచ్చు. బలమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. 'సి' విటమిన్ ఉండే ఆహారం రోజూ తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది వ్యాయామం. క్రమం తప్పకుండా వ్యాయామం చేసి శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇవన్నీ చేస్తూ ఇంట్లోనే ఉండి ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా గడుపుదాం...
ఐస్‌క్రీం పుల్లలతో
ఐస్‌క్రీం పుల్లల్లో పొడుగువి తీసు కోవాలి. నేను ఇలాం టివే హాస్పిటల్‌కు వచ్చే 'టంగ్ డిప్రిసార్స్'ను వాడాను. మామూలు గా వీటితో పూల కుండీలు, ఫొటోఫ్రేములు ఎన్నో చేస్తారు. నేనూ చేశాను. కానీ ఇప్పుడు గాంధీ జయంతి వస్తున్నది కదా! అందువల్ల దానికోసం ఏమైనా వెరైటీగా చెయ్యాలనుకున్నారు. అందుకే నేను ఈ పుల్లలతో 'చరఖా'ను తయారు చేశాను. గాంధీజీ చరఖాతో నూలు వడికి, విదేశీ వస్త్రాలను బహిష్కరించారు. అలా ఈ చరఖా స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించింది. మొదటగా తయారైన జాతీయ జెండాలో చరఖాను చిత్రించారట. తర్వాత అనేక మార్పులకులోనై అశోక చక్రం వచ్చి చేరింది. ముందురు రంగు వేసిన ఒక కార్డుబోర్డు మీద నేను ఐస్‌క్రీం పుల్లలను పద్మం లాగా అమర్చాను. ఇంకా దాన్ని నిలిపి ఉంచే కొయ్యలాగా పెట్టాను. దారం వడుకుతున్నట్టుగా రావాలి కదా! దారాన్ని చరఖా చక్రానికి పెట్టాను. ఇప్పుడు స్వతంత్ర సమయంలో చక్రం తిప్పిన చరఖా తయారయింది.
కుంకుమతో గాంధీ
గాంధీ జయంతికి చరఖా తయారైతే సరిపోయిందా! గాంధీ తాత రావాలి కదా! అందుకే గాంధీ తాతను చిత్రించాను. మామూలుగా గాంధీ తాతను పేపర్ మీద చిత్రిస్తే ఏం బాగుంటుంది. ఏదో ప్రత్యేకత ఉండాలి కదా! అందుకే కుంకుమతో గాంధీ చిత్రాన్ని వెయ్యాలనుకున్నాను. ఒక పళ్ళెంలో కుంకుమను పోసి దానిలో గాంధీని గీయాలి. కుంకుమను పళ్ళెమంతా సమానంగా పరవాలి. ఒక పుల్లతో చక్కగా గీతలు గీయాలి. గాంధీ చిత్రం తయారయింది. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేటపుడు బియ్యంలో అక్షరాలు దిద్దిస్తారు. ఇప్పుడు కుంకుమ లో దిద్దు తున్నాం. దాంట్లోంచి వచ్చిందే ఈ ఐడియా!
చాక్లెట్ బాక్సులు- స్పాంజి ముక్కలతో
చాక్లెట్ బాక్సుల్లో ప్యాకింగులు చాలా అందంగా ఉంటాయి. కొన్ని బంగారు వర్ణంలోనూ, కొన్ని చాక్లెట్ రంగుల్లోనూ ఉంటాయి. ప్లాస్టిక్ ప్యాకింగులు మధ్యమధ్య చాక్లెట్లు పెట్టడానికి అవసరమైన గుంటలతో చాలా బాగుంటాయి. పనికిరాని వస్తువులతో నేను బొమ్మలు చేస్తాను. కాబట్టి ఏ చెత్త అయినా నా కళ్ళకి అందంగానే కనబడుతుంది. లాప్టాప్ అంత సైజులో ఉన్న చాక్లెట్ బాక్స్‌ను గుండ్రంగా చుట్టి ఫ్లవర్‌వేజ్‌గా మార్చాను. బంగారు వర్ణంలో మెరుస్తోంది. ఎన్ని డబ్బులు పోసి కొన్నా ఇంత అందం వస్తుందా! ఇందులో పూల కోసం స్పాంజి ముక్కల్ని ఎన్నుకున్నాను. స్పాంజి ముక్కలు ఎక్కడ దొరుకుతాయూ అంటే కొత్త షర్టులు కొన్నప్పుడు ప్యాకింగులో పలుచటి స్పాంజి షీటు వస్తుంది. దాన్ని సేకరించి పెట్టాను. ఈ పలుచని స్పాంజిని తీసుకొని ముక్కలుగా కత్తిరించి పువ్వులు తయారుచేశాను. పువ్వులు వచ్చేశాయి గానీ కాడలు కావాలి గదా! మొన్నొక రోజు ఫైవ్‌స్టార్ హౌటల్‌కు వెళ్ళినపుడు మిల్క్‌షేక్ తాగడానికి 'స్ట్రా'లు చాలా అందమైనవి ఇచ్చారు. వివిధ వర్ణాలతో ఎటు అంటే అటు వంగే స్పైరల్ స్ట్రాలను ఇచ్చారు. వాటి అందానికి ఫిదా అయి పోయి వాళ్ళను అడిగి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. వాటిని ఈ పూలకు కాడలుగా వాడాను. ఎంత అద్భుతంగా ఉన్నాయో. వీటిని వ్యర్థ పదార్థాలతో తయారుచేశారంటే ఎవరూ నమ్మరు. అంత రిచ్‌గా ఉన్నాయి. స్పెషల్ ఆర్డర్లో తెప్పించినట్టున్నారు.
గ్లోవ్స్, కాగితాలతో
డెయిరీమిల్క్లాంటి పెద్ద చాక్లెట్లు తినేశాక మిగిలిన కవర్లు తీసుకొని పూలగా మార్చాను. ఎర్రటి రంగులో రక్తాన్ని తలపిస్తున్నాయి చాక్లెట్ కవర్లు. చాక్లెట్లు ఎప్పుడో తిన్నాం గానీ కవర్లతో ఏం చేయాలో తోచలేదు. ఆ కవర్లను తీసుకొని పొడుగ్గా పీలికలుగా కత్తిరించాలి. ఈ చీలికల్ని కొన్నింటిని మడిచి అతికించాను. కొత్త డిజైన్ వచ్చేసింది. వీటిని పుల్లలకు చుడితే రక్తవర్ణ పుష్పాల్లా చాలా అందంగా వచ్చాయి. పువ్వులు తయారయ్యాయి గానీ వీటిని పెట్టే వేజ్ను కొత్తగా ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. అప్పుడే ఇంట్లో పాతవైపోయిన గ్లోవ్స్ కనిపించాయి. ఇవి మామూలు గ్లోవ్స్ కాదు. విపరీతమైన చలి నుండి కాపాడే మందపాటి వులెన్ గ్లోవ్స్. చలి ఎక్కువగా ఉండే విదేశాలకు వెళ్ళినపుడు వాటి నుంచి రక్షణకు కొనుక్కున్నవి. ఇవి రెండు తీసుకొని మధ్యలో రెండు అట్టముక్కలు పెట్టి వేజ్లాగా చేశాను. దానిలో ఈ పువ్వుల్ని అమర్చాను.
హెయిర్ బ్యాండ్లు, పాత సీసాతో
మంచినీళ్ళు, నూనె, కొబ్బరినీళ్ళు ఏవైనా ప్లాస్టిక్ సీసాల్లో లభ్యమవుతున్నాయి. కాబట్టి వాటితో ఎన్నో రకాల వస్తువులు తయారుచేస్తున్నాం. అలాగే ఫినాయిల్ వచ్చిన ఈ సీసాను కడిగి శుభ్రంగా రంగువేశాను. తర్వాత ఏం చేయాలో తోచక అలా వదిలేశాను. ఇప్పుడు దాని మీద స్పార్కిల్ కలర్స్‌ను వాడి చెట్టును చిత్రించాను. ఈ కలర్లు బంగారు, వెండి రంగులు కలగలసి మెరుస్తూ ఉంటాయి. చాలా రంగులు దొరుకుతాయి. మనది మామూలు బాటిల్ పెయింట్ అవుతుంది కదా! అందుకే జడలకు పెట్టుకొని వదులైపోయిన హెయిర్ బ్యాండ్లను తీసుకొని ఈ బాటిల్‌కు చుట్టాను. కింద కొన్ని పెట్టాను. మూతి దగ్గర ఒకటి చుట్టాను. ఇప్పుడు వెరైటీగా ఉంది. మరి దీనిలో పెట్టే పువ్వులు ప్రత్యేకంగా తయా రవ్యాలి కదా! ఇప్పుడు ఫొటో చూడండి. ఆ పూల వివరాలు మళ్ళీ ఒకసారి చెపుతాను. కానీ అవి వంటింటి వ్యర్థాలతోనే చేశాను. ఈలోపు ఆలోచి స్తుండండి. వచ్చే వారం చెప్పేస్తా...
- డా|| కందేపి రాణీప్రసాద్