Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ ఖండాంతరాలు దాటి దేశాల మీదుగా పల్లెల్లో జొరబడి ఎదురింట్లోకి, పక్కింట్లోకి వచ్చి కూర్చుంది. మన వాకిట కూడా ఆశగా ఎదురు చూస్తోంది. రాపిడ్ టెస్ట్ సెంటర్లు పెరిగాయి. టెస్ట్‌లు లక్షల్లో చేస్తున్నారు. పాజిటివ్‌లు వస్తూనే ఉన్నాయి. మామూలుగా ఈ వర్షాకాలంలో రావల్సిన డయేరియా లాంటి వాంతులు, విరోచనాల బాధితులు లేనేలేరు. డెంగూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల ఊసే లేదు. కరోనా విలయతాండవానికి అన్ని జబ్బులూ పారిపోయాయి. అంటే కరోనా భయంతో మనం తీసుకుంటున్న జాగ్రత్తలకు ఆయా జబ్బులు రాకుండా తప్పించుకుంటున్నాం. అంతేకాక వీధులు శుభ్రం చేయడం, మురిక్కాలువలు నిల్వ లేకుండా పారేలా చూడడం, బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైటు ద్రావణాలు చల్లడం వంటి కార్యక్రమాల ద్వారా ఆయా బాక్టీరియా, వైరస్లు మాయమయ్యాయి. వీటికి లొంగని కరోనా వైరస్ ఒక్కటే దాని ప్రతాపం చూపించుకుంటున్నది. ఏమాత్రం జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఉన్నా మొదటగా కరోనా టెస్ట్ చేయించుకోవాలి. నెగెటివ్ వస్తే ప్రశాంతంగా జ్వరం మందులు వేసుకోవచ్చు. అలాగే ముక్కుకు వాసన తెలియకపోయినా, నోటికి రుచి తెలియకపోయినా అనుమా నించాలి. మరి ముందు జాగ్రత్తగా ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే ఉందాం. కళాత్మకంగా గడుపుదాం.
ఉల్లిపాయ సంచులతో
బిగ్‌బాస్కెట్ వాళ్ళకి ఉల్లిపాయలు ఆర్టర్ చేసినపుడు రంధ్రాలున్న సంచుల్లో వస్తాయి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రకరకాల రంగుల్లో ఉంటాయా సంచులు. ఇవి మామూలు ఉల్లిపాయ సంచులంత గట్టిగా ఉండవు. చాలా పలుచగా ఉంటాయి. అందుకే వీటిని పువ్వులు చేయడానికి వాడాను. చిల్లులున్న ప్లాస్టిక్ కాగితాలను దగ్గరగా మడిచి దారంతో కట్టేస్తే పువ్వులా తయారయింది. చాలా అందంగా కూడా ఉంది. ఇలా కొన్ని పువ్వులు తయారు చేసి పెట్టాను. ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎరుపు, టొమాటో రంగుల్లో పూలు తయారయ్యాయి. ఈ పూలను ఏ కాడలకు గుచ్చుదామా అని ఆలోచించగా కాగితంతో చేద్దామనిపించింది. మామూలు న్యూస్ పేపర్‌తో చేస్తే పలుచగా ఉండి వంగిపోతాయని అడ్వర్టైజ్మెంట్ పేపర్లతో చేద్దామనుకున్నాను. రోజూ న్యూస్ పేపర్స్‌లో యాడ్ల బ్రోచర్లు ఆర్ట్ పేపర్‌తో వస్తాయి. అందుకే వాటిని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ పేపర్లను గుండ్రంగా ఒక పుల్ల పెట్టి చుట్టి గొట్టాలుగా తయారుచేయాలి. చాలా చేశాను. సహజంగా టీవీలు వంటి షాపుల బ్రోచర్లో, స్కూళ్లు, కాలేజీల బ్రోచర్లో ఉంటాయి కాబట్టి మల్టీ కలర్ బొమ్మలతో ఉంటాయి. వీటిని చుట్టినపుడు ఆ రంగులు కూడా అందంగా కనిపిస్తాయి. ఆ కాగితపు కాడలకు పువ్వులు చుట్టేశాను. మొత్తం పూల బొకే తయారయింది. మీరూ ప్రయత్నించి చూడండి. పోయిన వారం చెపుతానన్న పవ్వులివే.
ఫోమ్ షీట్లతో
బజార్లో ఫోమ్ షీట్లు చాలా రంగుల్లో దొరుకుతున్నాయి. వాటితో సేమ్ప్లేట్లు, పూలకుండీలు తయారు చేస్తు న్నారు. నేనూ చేశాను. ఇప్పుడయితే కార్టూన్ కారెక్టర్లను చేయాలనుకున్నాను. ఎందుకంటే మాది పిల్లల హాస్పిటల్ కదా! పిల్లలే వస్తారు కదా! వాళ్ళకి కనువిందు చేయడానికి ఇవే బాగుంటాయి. అసలు మా హాస్పిటల్ అంతా కూడా కార్టూన్ కారెక్టర్సే నిండి ఉంటాయి. సరే ఇప్పుడు ఛోటా భీమ్, మైటీరాజు అనే ఇద్దరి బొమ్మలు చెయ్యాలనుకున్నాను. ఛోటా భీమ్ సీరియల్ పిల్లలకు ఎంతో ఇష్టమైనది. మైటీ రాజుకు ఒక్క బ్లూ రంగు నిక్కరే ఉంటుంది. ఛోటా భీమ్ ఆరెంజ్ రంగు డ్రెస్ వేసుకుంటాడు. సులభంగానే చేయవచ్చు ఇవి. అయితే ఫోమ్ షీట్లతో ఊరికే కార్టూన్లను చేసేకన్నా ఇంకా ఏదన్నా చేద్దామా అని ఆలోచించాను. ఛోటాభీమ్కు ''మీరు ఫోన్‌ను సైలెంట్‌గా పెట్టండి'' అనే మెస్సేజ్‌ని, రాజు బొమ్మకు ''నిశ్శబ్దంగా ఉండండి'' అనే మెస్సేజిని రాశాను. వీటిని హాస్పిటల్లో బోర్డులుగా పెట్టాను. వచ్చే పిల్లలు చూసి ముచ్చట పడుతున్నారు.
టూత్ బ్రష్ ప్యాకింగుతో
టూత్‌బ్రష్‌లు కొత్తవి కొనుక్కున్నపుడు ప్లాస్టిక్ ప్యాకింగ్‌లో ఉంటాయి. నిన్న కొత్త బ్రష్ కొనుక్కున్నాక, బ్రష్ తీసేశాక ప్యాకింగ్ టీపారు మీద పడేశాను. రాత్రికి చూస్తే దీన్నేదో బొమ్మ చెయ్యవచ్చే అనుకున్నాను. చాలా సింపుల్‌గా నల్లరంగును తీసుకొని బ్రష్ ఉన్నంత మేరా పూశాను. లోపల బ్రష్ ఉన్నంత మేరా ప్యాకింగ్ ఉబ్బెత్తుగా ఉంటుంది కదా. ఆ భాగమంతా పూశాక మనిషి ఆకారం వచ్చేసింది. ఏదో ఆస్కార్ అవార్డ్ బొమ్మలాగా ఉంది. కాకపోతే చివరకు నేను ఒక స్త్రీ బొమ్మగా మార్చాను. శ్రమశక్తికి చిహ్నమైన స్త్రీని చిత్రించాలని అనిపించి అలా మార్చేశాను. ఎలా ఉంది.. సరదాగా చేశాను.
పట్టుచీర కొంగు ముక్కలతో
కొత్త చీర కొన్నప్పుడు రెండు చివర్లు సమానంగా కత్తిరించి కొంగులు కుట్టించుకుంటాము. అలాగే పట్టుచీరకు కొంగులు కుట్టబోయే ముందు సమానంగా కత్తిరించినపుడు చిన్నచిన్న పీసులు మిగిలాయి. వాటిని పారేయలేదు. సగం దారాలు ఊడిన పీసులే కానీ పట్టు పోగులు కదా అందంగా ఉన్నాయి. ఎరుపు నీలా రంగుల పోగులు కల వస్త్రాన్ని మడతలుగా మడిచి పువ్వులా చేశాను. అంటే పట్టు పువ్వున్న మాట. టాబ్లెట్ ప్యాకింగ్ తెచ్చి గుండ్రంగా మడిచి ఫ్లవర్ వేజ్ చేశాను. చిన్ని ఫ్లవర్‌వేజ్‌లో పట్టు పువ్వును పెట్టాను. బుల్లి పూల కుండీ తయారయింది.
పౌడరు డబ్బా మూతలతో
రోజూ ఇంట్లో క్రీములు, పౌడర్లు, కొబ్బరి నూనెలు ఎన్నో వాడు తుంటాం. మొన్నటిదాకా వేసవి కాలం కాబట్టి మామూలు పౌడర్‌తో పాటు హీట్ పౌడరు వాడాము. వీటన్నింటికీ మూతలుంటాయి కదా! ఆ మూతల్ని పక్కన పెట్టి వాటిని ఒకదానికొకటి అతికించాను. బయోటిక్ కంపెనీలు కొన్ని రకాల మందుల పౌడర్లకు వెడల్లుగా ఉండే మూతలుంటాయి. ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న మూతకు పైన తెల్లని చిన్న మూత పెట్టాలి. ఇప్పుడు ఇదే ఒక బాటిల్లాగా తయారయింది. నేను జంట బాటిల్స్‌ను తయారు చేశాను. మూత, మూత కలిసి బాటిల్ అయింది.
ఎండిన కాయలతో
మా ఇంట్లో శంఖుపూల చెట్టుంది. వీటికి కాయలు విపరీతంగా కాస్తాయి. ఈ కాయలు అచ్చం చిక్కుడు కాయల్లా ఉంటాయి. ఈ శంఖుపూలు ఊదారంగు, తెలుపురంగుల్లో పూస్తుంటాయి. ఈ సంవత్సరం అన్నీ కుండీల్లో అవే విత్తనాలు ఇల్లంతా తెలుపు, ఊదారంగుల మయం చేసేశాయి. శంఖు చుట్టుకున్నట్లే చుట్టు కుంటాయి. వీటి కాయలు ఎండిపోయాక సేకరించి పక్కన ఉంచు కోవాలి. పూర్తిగా ఎండిపోకూడదు. పూర్తిగా ఎండితే పగిలిపోతాయి. అలా కొన్ని కాయల్ని తీసుకొని వాటిపై రంగులు వేశాను. ఒక్కొక్క దానిపై ఒక్కొక్క రంగు వేశాను. అవి ఆరిన తర్వాత వాటిమీద సన్నని డిజైన్లు వేశాను. ఒక రోజంతా ఆర బెట్టాను. తర్వాత ఒక డ్రాయింగ్ షీటును తీసుకొని దానిమీద ఒక చెట్టును గీశాను. ఆ చెట్టుకు ఆకుల్లాగా ఈ డిజైన్ల కాయల్ని అతికించాను. ఇప్పుడొక చెట్టు తయారయింది. మామూలుగా కాయలు పగిలి విత్తనాలు వెదజల్లితే మొక్కలు మొలుస్తాయి. అదే పనిని మనం కూడా చేశాం. కాయల విత్తనాలతో చెట్టు మొలిపించాము బాగుందా!
- డా|| కందేపి రాణీప్రసాద్