Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి బిజీ జీవితంలో చాలామంది సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. పని ఒత్తిడి, మానసిక సంఘర్షణ కారణంగా ఎంతో మంది నిద్రలేమితో భాదపడుతున్నారు. దాంతో అనేక సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. మానవ శరీరం సరైన రీతిలో పనిచేయాలంటే నిద్ర ఎంతో అవసరం. నిద్ర వల్ల శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది. రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. సరైన నిద్ర మరుసటి రోజు నూతనోత్తేజంతో పనిచేసేందుకు కావాల్సిన శక్తినిస్తుంది. జీర్ణక్రియ నుండి మానసిక స్థితి వరకు అన్నింటిపై నిద్ర అనేక ప్రభావాల్ని చూపిస్తుంది. అందువల్ల మెదడు సరిగ్గా పనిచేయడానికి తగినంత నిద్ర తప్పనిసరి.
మీ మెదడు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మెదడుపై ఒత్తిడిని తగ్గించడంమే కాదు సరైన నిద్ర పోవడం కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా మీరు నిద్రపోయే ముందు మీ మొబైల్ ఫోన్ వాడకానికి దూరంగా ఉండండి. పడుకునే ముందు మొబైల్ వాడటం మూలాన అది మీ మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నిద్రకు, మెదడుకు సంబంధం ఏమిటి?
శరీరం, మనసును ఆరోగ్యంగా ఉంచడానికి ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గంటల సమయం నిద్ర పోవడం చాలా ముఖ్యం. సరైన నిద్రతో శ్వాస, హదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత నియంత్రణలోకి వస్తాయి. నిద్రలేమితో బాధపడుతున్న వారి మెదడు సమర్థవంతంగా పనిచేయదు. సరైన నిద్ర లేనప్పుడు మతిమరుపు, ఏకాగ్రత లేకపోవడం, మూడ్ స్వింగ్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అది క్రమంగా మానసిక, సామాజిక, భావోద్వేగ, శారీరక సమస్యలకు దారితీస్తుంది. సరిగ్గా నిద్ర పోని కారణంగా ఊబకాయం, ఆకలి లేకపోవడం, హార్మోన్ల మార్పులు, గుండె సమస్యలు, రక్తపోటు, డయాబెటిస్ వంటి ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి శరీరాన్ని, మనసును ఆరోగ్యకరంగా ఉంచడానికి సరైన నిద్ర తప్పనిసరి.