Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం వెళితే సాయంత్రం వరకు ఆఫీసులో కుస్తీ పడుతూ పని భారంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ తీరిక లేని జీవితంలో సమయానికి తినకపోవడం, జంక్ ఫుడ్ తినడం లాంటివి చేస్తున్నారు. ఫలితంగా నేటి యువతలో చాలా మంది స్థూలకాయులుగా మారుతున్నారు. మళ్లీ ఆ చెడు కొవ్వును కరిగించేందుకు జిమ్‌లో కష్టపడుతున్నారు. మనలో చాలా మంది ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉంటున్నారు. జిమ్‌లో గంటల పాటు కుస్తీలు పడకుండా వ్యూహాత్మకమైన ఆహార ప్రణాళిక, హెల్తీ డైట్ లైఫ్ స్టైల్‌ను అనుసరిస్తే బరువు తగ్గడమే కాకుండా ఫిట్ గాను ఉంటారు. మరి బరువు తగ్గేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
- వ్యాయామానికి ఒక్కరోజు కూడా విరామం ఇవ్వకూడదు. ఎందుకంటే చెమట చిందిస్తేనే మీరనుకున్నది సాధించగలరు. మీ మనసులో ఫిట్ నెస్ అనేది ముందు వరుసలో ఉండాలి.
- సరైన సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, పోషకాలుండే ఆహారమేంటో పక్కాగా వారానికి సరిపడా ఛార్ట్‌ను తయారు చేసుకోవాలి. అందుకు సరిపడా ముడి సరుకులను వారానికి సరిపడా తెచ్చుకుంటే మంచిది.
- ఆకలిని పూర్తిగా నియంత్రించుకోమని చెప్పడం లేదు. మీకిష్టమైన జంక్ ఫుడ్, కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినే సమయంలో కొంచెం కోరికలు కంట్రోల్ చేసుకోండి. అన్నిసార్లూ అవే తినే బదులు కొన్నిసార్లు తింటే చాలు అని అనుకొని మిమ్మల్ని మీరు స్థిమితపరచుకోండి.
- మీరు ఏదైనా కోరుకుంటే దాన్ని మీకు మీరు బహుమతిగా ఇచ్చుకోండి. మీకు నచ్చిన దుస్తులు లేదా ఎక్స్ బాక్స్ మిషన్‌ను కొనుక్కోండి. అయితే ఈ విధంగా ఎప్పుడు చేయాలంటే మీ శరీరంలో బరువు తగ్గినట్టు మీకు అనిపించినపుడు మాత్రమే చేయండి. అప్పుడే మీకు ప్రేరణ కలుగుతుంది.
- ఎంతో మంది నిపుణులు మొదటగా చెప్పేది రాత్రుళ్లు త్వరగా తినమని. అంతేకాకుండా త్వరగా నిద్రించాలని కూడా చెబుతారు. అవును డిన్నర్‌ను త్వరగా పూర్తి చేస్తే జీర్ణం త్వరగా అవుతుంది. అంతేకాకుండా రాత్రుళ్లు మంచి నిద్ర కూడా పడుతుంది.
- ఉదయాన్నే చేయాల్సిన మొదటి పని వేడి నీటిలో నిమ్మరసం కలిపి ఆ ద్రావణాన్ని తాగడం అలరవర్చుకోండి. ఇది మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే కాఫీకి దూరంగా ఉంటే మంచిది.
- ఆరోగ్యకరమైన పోషకాలుండే ఆహారాన్ని తీసుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టి ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తింటే మంచిది. వేగంగా తినడం వల్ల అది మీ జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మీ కడుపు కోరుకున్న దానికన్నా ఎక్కువ తినడాన్ని ముగించాలి.
- నీటిని ఎక్కువగా తీసుకోవాలి. వేగంగా బరువు తగ్గాలనుకుంటే రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి. ఇది ఆహారం తక్కువ తీసుకునేలా ఉపయోగపడుతుంది.
- కాఫీ, టీలు తాగే బదులు గ్రీన్ టీని తాగడం ఎంతో ఉత్తమం. రోజుకు రెండు కప్పులు కెఫైన్ అధికంగా ఉండే కాఫీ కంటే హెర్బల్ టీ, గ్రీన్ టీ తాగడం మంచిది.
- రోజూ క్రమం తప్పుకుండా మితంగా తినడం ప్రారంభించడం వల్ల కొన్ని రోజులకు ప్లేట్ భోజనానికే కడుపు నిండిన భావం కలుగుతుంది. కాబట్టి క్రమంగా ఆకలిని నియంత్రించుకోవచ్చు. అయితే మీరు ఆహారంతో మీరు సంతృప్తికరంగా ఉన్నారో లేదా చూసుకోండి.
- తినేటప్పుడు టీవీ చూడటం, స్మార్ట్ ఫోన్ వాడటం, ల్యాప్ ట్యాప్ ఆపరేట్ చేయడం లాంటి వాటిని అస్సలు చేయకూడదు. ఇలా చేయడం ద్వారా అతిగా తినే ప్రమాదముంది. కాబట్టి వీటిని దూరం పెట్టి శ్రద్ధగా ఆహారాన్ని ఆస్వాదించండి.
- ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవడమే కాదు మీ ప్లేట్లో పండ్లతో తయారు చేసిన శాండ్ విచ్ లేదా సలాడ్‌ను జత చేయండి. స్వీట్ స్థానంలో పండ్లను ఆహారంగా తీసుకోండి.