Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమెకు నటనంటే ప్రాణం. అందుకే కుటుంబంలో ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా ఒప్పించి మరీ ఇండిస్టీలోకి వచ్చింది. నచ్చిన రంగంలో ఎదిగేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగిం చుకుంటుంది. ఏ పాత్ర చేసినా భిన్నంగా ఉండాలని కోరుకుంటుంది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు పట్టుదల తో కృషి చేస్తున్నది. ఆమే యష్మీ గౌడ. 'నాగభైరవి'గా త్వరలో తెలుగు ప్రేక్ష కుల ముందుకు రాబో తున్న ఆమెతో మానవి చిట్‌చాట్...
మా అమ్మ విజయలక్ష్మి, హైజ్వైఫ్, నాన్న రమేష్, సొంత ఫ్యాక్టరీ ఉంది. నేను పుట్టింది పెరి గింది బెంగళూరులో. నాకు ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. ఇంట్లో నేనే పెద్దదాన్ని. చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సినిమాలు బాగా చూస్తాను. టీవీలో ఏ సినిమా చూసినా డైలాగులు బట్టీ పట్టి అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేస్తుండేదాన్ని. ఇంట్లో అందరినీ ఓ దగ్గర కూర్చోబెట్టి టీవీలో పాటలు పెట్టి డ్యాన్స్ వేస్తుండేదాన్ని. అయితే మా ఇంట్లో యాక్టింగ్ అంటే అస్సలు ఇష్టం లేదు. 'ఇవన్నీ అవసరమా' అనేవాళ్ళు. పదో తరగతి తర్వాత సివిల్ డిప్లొమా చేరాను. ఇంట్లో ఇష్టం లేకపోయినా కాలేజీకి వచ్చాక మోడలింగ్ చేశా. డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ చేయమన్నారు, కానీ నాకు ఇష్టం లేదు. ఎలాగైనా యాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను.
నిర్ణయాన్ని మార్చుకోలేదు
యాక్టింగ్ చేస్తానంటే ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు. బతిమలాడి బతిమలాడి ముందు అమ్మను ఒప్పించాను. అయితే నాన్న అస్సలు ఒప్పుకోలేదు. నాతో సంవత్సరం పాటు సరిగా మాట్లాడలేదు. ఆయన ఒప్పుకోరని తెలిసినా యాక్టిగ్పై ఉన్న ఇష్టంతో నా నిర్ణయాన్ని మార్చుకోలేకపోయాను. మోడలింగ్ చేశానని చెప్పాను కదా... కాస్ట్యూమ్ డిజైనర్ ఒకరు కన్నడలో ఓ సీరియల్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని చెబితే ప్రయత్నిద్దామని వెళ్ళాను. అందులో సెలక్ట్ అవుతానని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే అప్పట్లో నేను లావుగా ఉండేదాన్ని. అయితే నేను ఆడిషన్స్‌కు వెళ్ళిన పాత్రకు సన్నగా, మోడ్రన్‌గా వుండే అమ్మాయి కోసం వాళ్ళు చూస్తున్నారు. అందుకే ఆడిషన్స్‌కి అయితే వెళ్ళాను గానీ దానిపై ఆశలు పెట్టుకోలేదు. అయితే అనుకోకుండా వాళ్ళ నుండి కాల్ వచ్చింది. అదే సీరియల్లో సైకో పాత్ర చేసే అవకాశం వచ్చింది. మామూలుగా అయితే మొదటి సారి ఇలాంటి పాత్రలు ఇవ్వరు. కానీ నాకు అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. ఏడు నెలలు ఆ సీరియల్‌కి వర్క్ చేశాను.
భిన్నంగా ఉండడం ఇష్టం
ఆ తర్వాత తెలుగులో 'స్వాతి చినుకులు' సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. ఓ సాధారణ అమ్మాయిగా కన్నా కాస్త భిన్నంగా ఉండడం ఇష్టం. జీవితాన్ని ఛాలెంజింగా తీసుకోవాలి. పాత్రలు కూడా అలాంటివే చేయాలి. అందుకే ఈ సీరియల్ చేయడానికి ఒప్పుకున్నా. అప్పటి వరకు తెలుగు నాకు అస్సలు రాదు. హైదరాబాద్ కూడా ఎప్పుడో స్కూల్ టైంలో ఒక్కసారి వచ్చాను అంతే. తెలుగు నేర్చుకోవడం, షూటింగ్ కోసం హైదరాబాద్ వరకు వెళ్ళి రావడం, ఇదంత అప్పటి వరకు నా జీవితానికి కాస్త భిన్నమైనవి. ఏ మాత్రం తెలియని తెలుగు పరిశ్రమ లో అడుగు పెట్టడం అంటే ఎంతో నేర్చు కోవచ్చు. అందుకే ఇంట్లో వాళ్ళు భయ పడ్డా నేను మాత్రం చేయా లని నిర్ణయించుకున్నాను. ఏడాది పాటు ఆ సీరియల్లో చేశాను. అయితే అప్పుడు అంతా నాతో ఇంగ్లీషులోనే మాట్లాడే వాళ్ళు. దాంతో తెలుగు పెద్దగా నేర్చుకోలేక పోయాను. 'స్వాతి చినుకులు' తర్వాత తెలుగులోనే 'త్రినయిని' సీరియల్లో ఓ చిన్న పాత్ర చేశాను. అది హీరోయిన్‌కి స్నేహితురాలి క్యారెక్టర్. పదిహేను రోజులు మాత్రమే చేశా. అందులో చూసే ఇప్పుడు 'నాగభైవరవి'లో ప్రధాన పాత్ర చేసే అవకాశం ఇచ్చారు. దీనికి ప్రొడ్యూసర్ కల్కిగారు. ఆయనా, నేనూ 'స్వాతి చినుకులు' లో కలిసి పని చేశాము.
డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్
మొదటి నుండి సీరియల్స్ కన్నా సినిమాల్లో చేయడ మంటేనే ఇష్టం. ప్రస్తుతం కోవిడ్ వల్ల అది కాస్త పెండింగ్‌లో వుంది. ఇంతలో 'నాగభైరవి'లో అవకాశం వచ్చింది. నేను కోరుకున్నట్టే ఇందులో నాది ఓ ప్రత్యేకమైన పాత్ర. ఛాలెంజింగా ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన వాటి కంటే డిఫరెంట్ ఎక్ప్సీరియన్స్ ఇది. అంతకు ముందు టీవీలో చూసినప్పుడు ఇలాంటి గ్రాఫిక్స్ ఎలా చేస్తారు అనుకునేదాన్ని. ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను. ఇటీవలె ఓ షార్ట్ ఫిలిం కూడా చేశాను. ఈ నెలలో అది రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు సీరియల్ షూటింగ్లో కాస్త బిజీగా ఉన్నాను. ఈ సీరియల్ తర్వాత కచ్చితంగా సినిమాలో చేస్తాను.
ఇంట్లో వాళ్ళు కాస్త భయపడతారు
అమ్మను అయితే ఎలాగో బతిమలాడి మొదట్లోనే ఒప్పించాను. నాన్న కూడా ఇప్పుడు ఓకే. టీవీలో నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా వచ్చి మీ అమ్మాయి బాగా చేస్తుంది అంటే ఆయన కూడా గర్వంగా ఫీలవుతున్నారు. అయితే షూటింగ్ కోసం హైదరాబాద్ ఒంటరిగా వస్తున్నానని కాస్త భయపడతారు. మొన్నటి వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు తోడుగా ఉండేవారు. ఇప్పుడు ఒక్కదాన్నే వెళుతున్నానని కంగారు పడతారు. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, తిన్నావా అని అడుగుతుంటారు. నాకైతే ఇంట్లో ఎలా ఉన్నానో షూటింగ్లో కూడా అలాగే అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. టీం మొత్తం కుటుంబంలా ఉంటాము. నటన అంటే విపరీతమైన ప్రేమ. కాబట్టి చిన్న పాత్ర అయినా దానికి న్యాయం చేయాలనుకుంటాను.
ప్రత్యేక ఎఫెక్ట్స్ ఏమీ పెట్టలేదు
మొదటిసారి నేను చేసిన కన్నడ సీరియల్లో నా నటన చూసి 'నీకు నిజంగానే ఇది మొదటి సీరియలేనా' అని అడిగారు. నా గురించి గూగుల్‌లో కూడా వెదికారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాతే చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న 'నాగభైరవి' పాత్ర నా నిజ జీవితానికి చాలా దగ్గరగా వుంటుంది. నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా ఉండే పాత్ర. కాబట్టి నాకు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవరసం రాలేదు. ఒక్క బరువు తగ్గడం తప్ప ఈ సీరియల్ కోసం నేను ప్రత్యేకంగా వేరే ఎఫెక్ట్స్ ఏమీ పెట్టలేదు.
కూల్ గా ఉంటారు
ఈ సీరియల్లో రమ్యకృష్ణ గారిది గెస్ట్ పాత్ర. ఒక్క రోజు మాత్రమే ఆమెతో కలిసి పని చేశాను. చిన్నప్పటి నుండి సినిమాల్లో ఆమెను చూసి బయట కూడా అంతే సీరియస్‌గా ఉంటారనుకున్నా. కానీ డైరెక్టర్‌గా చూసి ఆమె ఇంత కూల్ ఉంటారో అనిపించింది. కోవిడ్ కారణంగా కాస్త క్లోజ్‌గా మూవ్ కావడం కుదరలేదు. కనీసం సెల్ఫీ కూడా దిగలేకపోయాను. అదే కాస్త బాధ. స్క్రీన్ షేర్ చేసుకోవడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. అందరితో ఆమె చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.
అవకాశాలు ఉన్నాయి
చాలెంజింగ్ పాత్రలు చేయాలి. చేసే ప్రతి పాత్ర అంతకు ముందు చేసిన దానికంటే కొత్తగా ఉండాలి. అంతా ఓకే అయితే వచ్చే ప్రాజెక్ట్ సినిమాలో చేయాలని ఉంది. దానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు చేస్తున్న దాని కంటే డిఫరెంట్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నా.