Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్‌కు చలికాలంలో ఆటలు ఆడటమంటే సరదా! ఎండాకాలంలో ఎండకు కరిగిపోతాననే భయం ఉంటేనే అంత మందిని బలి తీసుకున్నది. మరి ఇప్పుడు దానికి అనుకూలమైన కాలం. చలిలో చక్కగా మనుగడ సాగించగలదు. కాబట్టి మనం ఇంతకు ముందుకన్నా జాగ్రత్తగా ఉండాలి. చాపకింద నీరులా, నివురు గప్పిన నిప్పులా సమయం కోసం వేచి చూస్తున్నది కరోనా వైరస్. సెకండ్ వేవ్‌తో కొన్ని దేశాలు ఇప్పటికే విలవిల లాడుతున్నాయి. మళ్ళీ లాక్‌డౌన్‌కు వెళ్ళాల్సి వచ్చేలా ఉందని ఆలోచిస్తున్నాయి. మన దేశానికి కూడా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే స్వీయ సంరక్షణా చర్యలు పాటించాలి. గత నెలలో వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టిందనే వార్తలు వచ్చిన నేపధ్యంలో చాలామంది మాస్కులు, భౌతిక దూరాలను తుంగలో తొక్కేశారు. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందనీ, తద్వారా మరణాల శాతం పెరగవచ్చని శాస్త్రవేత్తల అంచనా. అగ్రదేశాలు పడుతున్న సమస్యల్ని చూసైనా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అప్రమత్తతగా వ్యవహరించకపోతే ప్రమాదం వైపు పరుగులు పెట్టినట్టే అవుతుంది. కాబట్టి మాస్కుల ధారణ, శానిటైజర్, భౌతిక దూరం వంటికి కచ్చితంగా పాటించాలి.
గట్టి అట్టతో
ఇపుడు అందరూ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు కదా! అమెజాన్, ప్లిప్కార్డులలో వస్తువులు నేరుగా ఇంటికే వస్తున్నాయి. ఆ వస్తువులను పగిలిపోకుండా, డ్యామేజీ కాకుండా తగు జాగ్రత్తలతో అట్టల ప్యాకింగులతో సులభంగా ఇంటికి చేరవేస్తున్నారు. ఆ అట్టలు గట్టిగా చక్కగా ఉంటాయి. అలాంటి అట్టల్ని బొమ్మలకు వాడుకోవచ్చు. ప్రస్తుతం నేను తయారు చేసింది మాత్రం గట్టిగా ఉన్న పెండ్లి శుభలేఖను. ఈ అట్టను మౌస్ ప్యాడ్‌గా వాడుతున్నాను. అలాంటి గట్టి అట్టమీద ఒక రంగు పేపర్ అతికించాలి. నేను ఒక పాప బొమ్మను వేసుకున్నాను. దానికి రంగులు వేశాను. ఈ పాప బొమ్మను గట్టి అట్టపై అతికించాను. మౌస్‌ప్యాడ్ అందంగా తయారైంది. ఇలా మన చేతితో వేసిన రంగుల చిత్రంతో మౌస్ ప్యాడ్ అందంగా తయారైంది. మరి వెరైటీగా మౌస్‌ప్యాడ్ ఎంత అందంగా ఉందో చూశారా!
పాత గుండీలతో
మొదటగా రంగు రంగుల పాత గుండీలను సేకరించాను. ఈ కాలంలో ప్రతి ఇంట్లోనూ ఎన్నో రకాల డ్రెస్సులు మూలబడి ఉంటు న్నాయి. అలాంటి పాత బట్టలకున్న రంగు రంగుల, చిన్నా పెద్దా గుండీలను కత్తిరించి దాచుకుంటే అవసరానికి బొమ్మలకు పని కొస్తాయి. నేను కరోనా కాలంలో ఐదవ విడత లాక్డౌన్ విధించి నపుడు ఈ బొమ్మను తయారు చేశాను. నేను మొదటగా గుండీలతో ఒక ఇల్లు ఆకారాన్ని అమర్చాను. ఫెవికాల్తో గుండీలను అట్టమీద ఇంటి ఆకారంలో అతికించాను. ఇంటి మధ్యలో ఒక తాళాన్ని పెట్టాను. లాక్డౌన్ అంటే ఇంట్లో ఉండాలనే కదా అర్థం. అందుకే ఇంటికి తాళం వేశాను. తర్వాత పక్కనే ఐదు అని రాశాను. రాయడమంటే గుండీలతో 5 అకారంలో అతికించటం. ఈ ఇంటి చుట్టూ పూలను పెట్టాను. ఇల్లంటే కొన్ని పూల మొక్కలుండాలి కదా! అందుకే పూలను పెట్టాను. మొత్తంగా లాక్డౌన్ చిత్రం తయారైంది.
రాఖీల బాక్సులు, వాటర్ యాంపుల్స్తో
మొదట రాఖీల బాక్సులు అవసరం పడలేదు నాకు. నేను వాటర్ యాంపుల్స్తోనే బొమ్మలు చెయ్యాలనుకున్నాను. ఎందుకంటే అప్పుడు నేను బాటిల్స్ మీద ఆర్ట్ వేస్తున్నాను. మంచి నీళ్ళు, మంచి నూనెల సీసాలతో పాటు సెలైన్ సీసాలూ ఆర్ట్ కోసం ఉపయోగించాను. ఇంకా ఇంజక్షన్ బుడ్లు కూడా అలంకారంలో భాగంగా వినియోగించాను. ఇంకా చిన్నవి ఏమైనా ఉన్నాయా అని వెతుక్కుంటున్నపుడు ఈ వాటర్ యాంపుల్స్ నా దృష్టికొచ్చాయి. వాటర్ యాంపుల్ అంటే ఇంజక్షన్ చేయాల్సిన మందుపొడిలోకి నీళ్ళను కలపటానికి వాడే చిన్న ప్లాస్టిక్ బాటిల్ లాంటిది. నేను దీనికి బాటిల్ హౌదానిచ్చి అలంకారం చేశాను. బాటిల్ ఆర్ట్‌లో భాగంగా వీటన్నింటినీ పెయింట్ చేశాను. ఇప్పుడు ఈ బుజ్జి బాటిళ్ళను ఎలా సేఫ్టీగా పెట్టాలా అని ఆలోచించినపుడు మాత్రమే నాకీ రాఖీల బాక్సులు కనిపించాయి. నేను ఈ బాక్సుల్ని తీసుకొని ఒక్కొక్క బాక్సులో రెండు రెండు బాటిళ్ళను పెట్టాను. అలా చూస్తే ఫ్రిజ్‌లో పెట్టిన బాటిల్స్‌కు మీనియేచర్ రూపాల్లా అనిపించాయి. గ్లాస్డోర్లలో ఉన్న అందమైన బాటిల్స్ ముద్దుగా కనిపిస్తున్నాయి. ఇంకా ఎలా కనిపించాయంటే - రిలయన్స్, డి-మార్ట్ లాంటి ప్రొవిజనల్ స్టోర్స్‌లో కూల్‌డ్రింగ్ బాటిల్స్ అన్నీ ఒక బీరువాలాంటి షెల్ఫ్‌లో ఉంటాయి. అలా కనిపించింది దీన్ని చూస్తున్నపుడు.
బైక్ స్పేర్ పార్టుతో
బైక్ ఏదో చిన్న రిపేర్ వచ్చిందని మా అబ్బాయి రిపేరు షాపుకు వెళ్ళాడు. అక్కడ అతను రిపేరు చేస్తుండగా చిన్న కాఫీ గ్లాసులాంటి ఇనుప ఆకారం ఒకటి అక్కడ పడి ఉండటం చూశాడు. షాపు అతన్ని అడగగా పనికి రానిదని చెప్పగానే దాన్ని ఇంటికి తెచ్చాడు. లోతుగా గుంటలా ఉన్నది. పైనున్న భాగం కోసుకునేలా లేకుండా నున్నగా ఉన్నది. కింది వైపు కొద్దిగా స్టాండువలె ఉన్నది. కాబట్టి ఎక్కడ నిలబెట్టినా నిలబడేలా ఉన్నది. వెంటనే దానికి నల్ల రంగును వేశాను. దాని తర్వాత బంగారు రంగుతో బార్డర్లు వేశాను. అడుగున ఉండే బేస్కూ బంగారు రంగు వేశాను. మధ్యలో భాగానికి ఎరుపు రంగును వేసి దానిపై తెలుపు రంగు చుక్కల్ని పెట్టాను. ఇదంతా చేసే సరికి చాలా చక్కగా కనిపించింది. ఇంత చక్కగా ఉన్న దీనిలో ఏం పెట్టుకోవచ్చా అని ఆలోచించగా టూత్‌పిక్స్ పెట్టుకోవడానికి బాగుంటుందనిపించింది. చక్కని అలంకారం ఉన్న టూత్‌పిక్ హౌల్డర్ తయారయింది.
చాక్లెట్ బాక్సుతో
డెయిరీ మిల్క్ చాక్లెట్లు, జెమ్స్ అన్నీ కలిపి ఒక బాక్సులో ప్యాక్ అయి వస్తాయి. ఇంకా అమెరికా, లండన్ల నుంచి వచ్చే చుట్టాలు ఇండియాలో ఉన్న బంధువుల కోసం గిఫ్ట్‌లుగా చాక్లెట్లే తెస్తుంటారు. చాక్లెట్ల రుచి ఏమోగానీ నాకు చాక్లెట్ ప్యాక్‌లే నోరూరిస్తుంటాయి. బంగారు రంగు, కాఫీ రంగులతో చాక్లెట్లు పెట్టే గుంటలతో రకరకాల ఆకారాలతో ఆకర్షణీయంగా ఉంటాయి. త్వరగా చాక్లెట్లు ఎవరికో ఒకరికి ఇచ్చేసి మిగిలిన ట్రేలు దాచుకుంటాను. ఈ ట్రేలతో చాలా బొమ్మలు చేశాను. మీక్కూడా చూపించాను. ఈ సారి కొద్ది వెరైటీగా చేద్దాం. ఇది చాలా చిన్న చాక్లెట్ బాక్స్. నాలుగు అరలు మాత్రమే ఉన్నాయి. ఇందులో నాలుగు జెమ్స్ ప్యాకెట్లే వచ్చాయి. ఈ బాక్స్‌లోని నాలుగు అరల్లో నలుగురు మనుషుల్ని నిలబెట్టాను. గది కొకరిని కాపలాగా పెట్టాను. మనుషులు ఎలా వచ్చారు? గుండె జబ్బులకు వాడే టాబ్లెట్ల డబ్బాలలో ఇలాంటి ప్లాస్టిక్ మూతలుంటాయి. అవి పింక్ రంగులో చాలా ముచ్చటగా ఉంటాయి. వాటికి కండ్లు, ముక్కు, నోరు పెట్టి మనుషులుగా ప్రాణ ప్రతిష్ట చేశాను. మరి ఈ ప్లాస్టిక్ మనుషులు చాక్లెట్ అరల్లో చాక్లెట్లు దొంగిలించ కుండా కాపలా ఉన్నారు.
- కందేపి రాణీప్రసాద్