Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్ద ఉసిరికాయలు విరివిగా దొరికే కాలం ఇది. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరిని తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుత కరోనా కాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇదేంతో ఉపయోగపడుతుంది. ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్న ఉసిరితో రకరకాల వంటలు చేసుకోవచ్చు. వాటిలో కొన్ని ఈరోజు తెలుసుకుందాం...
పులుసు కూర
కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు - 4 లేదా 6, ఉల్లిగడ్డ ముక్కలు - అర కప్పు, టమాటా ముక్కలు - అర కప్పు, పసుపు - పావు స్పూన్, ఉప్పు - అర స్పూన్, పచ్చిమిర్చి - రెండు, కారం - స్పూన్, ధనియా పొడి - స్పూన్, జీలకర్ర పొడి - స్పూన్, నూనె - 3 లేదా 4 స్పూన్లు, పోపు కోసం - జీలకర్ర - పావు స్పూన్, ఆవాలు - పావు స్పూన్, ఎండుమిర్చి - ఒకటి, కరివేపాకు.
తయారు చేసే విధానం: ముందుగా ఉసిరి కాయల్ని కడిగి తుడిచి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాణలిలో రెండు స్పూన్ల నూనె పోసి ఉసిరికాయల్ని వేసి దోరగా వేయించుకోవాలి. అవి కొద్దిగా పగులుతాయి. వాటిని వేరే గిన్నెలోకి తీసుకుని మిగతా రెండు చెంచాలు నూనె వేసి పోపు సామాగ్రి వెయ్యాలి. అవి వేగుతుండగా ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి అన్నీ చక్కని రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కలిపి వేయిస్తూ పసుపు, కారం వేసి గరిటతో టమాటా ముక్కలు మెత్తగా నొక్కుతూ.. ఒక ముద్ద కూరలా అయ్యేలా ఉడికించుకోవాలి. నీరు కలిపి చక్కని గ్రేవీలా తినే రుచిని బట్టి పలుచగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉసిరికాయల్ని ఉడికే ఆ పులుసుకూర మిశ్రమంలో వేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి జోడించి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కూర వేడి అన్నంతో నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే చపాతి, రోటీలలో కూడా చాలా రుచిగా ఉంటుంది.
ఉసిరి పొడి
కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు - పది, జీలకర్ర - నాలుగు టీస్పూన్లు, మిరియాలు - టీ స్పూను, శొంఠి - చిన్నముక్క, ఇంగువ - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: ముందుగా ఉసిరికాయల్ని కడిగి తడిలేకుండా తుడవాలి. తర్వాత ముక్కలుగా కోసి గింజలు తీసి ఎండలో పెట్టాలి. బాగా ఎండాక ఉసిరికాయ ముక్కలకు జీలకర్ర, ఇంగువ, శొంఠి, మిరియాలు, ఉప్పు చేర్చి మిక్సీలో మెత్తగా పొడి చేయాలి. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది.
ఉసిరి ఆవకాయ
కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు - కిలో, ఉప్పు - అరకప్పు, పసుపు - ఒక టీస్పూను, నువ్వుల నూనె - ముప్పావు కప్పు, కారప్పొడి - అరకప్పు, ఇంగువ - ఒక టీస్పూను, మెంతిపొడి - పావు కప్పు, నిమ్మకాయలు- నాలుగు, ఆవాలు- అర టీస్పూను.
తయారు చేసే విధానం: ఉసిరికాయలను నీళ్లతో కడిగి ఆరబెట్టాలి. పెద్ద పాన్ తీసుకుని అందులో నువ్వుల నూనె వేడిచేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, ఇంగువ వేయాలి. ఆవాలు చిటపటలాడడం మొదలవ్వగానే ఆ నూనెలో ఉసిరికాయలు వేసి మెత్తబడేవరకూ మూతపెట్టి స్టవ్ మీద సన్నని మంటపై ఉంచాలి. పాన్లోని ఉసిరికాయలు మెత్తబడిన తర్వాత బాండీలోని నీళ్లు ఇంకిపోయేవరకూ స్టవ్ మీద ఉడికించాలి. పాన్లోని మిగిలిన నీళ్లు కూడా పూర్తిగా ఆవిరైన తర్వాత స్టవ్ మీద నుంచి దించి ఉసిరికాయలను చల్లారనివ్వాలి. చల్లారిన ఉసిరికాయల్లో ఉప్పు, కారం, పసుపు, మెంతిపొడి వేయాలి. అందులో నిమ్మరసం పిండి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడు రోజులు అలాగే జాడీలో నాననివ్వాలి. ఇలా చేస్తే కారాన్ని ఉసిరికాయలు బాగా పీల్చుకుంటాయి. అప్పుడు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని గాజు జార్లో పెట్టి గట్టిగా మూతపెట్టి వాడుకోవాలి. మూడు నాలుగు నెలలు ఇది నిల్వ ఉంటుంది.
ఉసిరి రైస్
కావల్సిన పదార్థాలు: ఉసిరి కాయలు - ఏడు, కొబ్బరి తురుము - అరకప్పు, పచ్చిమిర్చి - నాలుగైదు, ఉప్పు - తగినంత, నూనె - టేబుల్ స్పూను, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర - అరచెంచా చొప్పున, పల్లీలు - అరగుప్పెడు, ఎండుమిర్చి - మూడు, ఇంగువ - కొద్దిగా, కరివేపాకులు రెబ్బలు - నాలుగు, పసుపు - పావు చెంచా, అన్నం - రెండున్నర కప్పులు.
తయారు చేసే విధానం: ఉసిరి కాయల్ని కడిగి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కల్లా తరగాలి. కొబ్బరి తురుము, పచ్చిమిర్చి తీసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు, ఇంగువ వేయించాలి. అందుల కరివేపాకు వేయాలి. అవి చిటపటలాడాక ముందుగా చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కలు, కొబ్బరి మిశ్రమాన్ని చేర్చాలి. పచ్చి వాసన పోయాక తగినంత ఉప్పు వేసి అన్నం కలిపితే సరిపోతుంది.
మురబ్బా
కావల్సిన పదార్థాలు: పెద్ద ఉసిరి కాయలు - కేజీ, పంచదార - ఒకటింపావు కేజీ.
తయారు చేసే విధానం: ఫోర్కుతో కాయలని గుచ్చి, మునిగేదాకా నీళ్లు పోసి కొద్దిసేపు ఉంచాలి. తర్వాత కాయలని కడగాలి. మళ్లీ వాటిని మరిగే నీళ్లలో పోసి రెండు నిమిషాలు ఉడకనిచ్చి దించేయాలి. పంచదార పాకం పట్టి ఉడికించిన ఉసిరికాయల్ని పాకంలో వెయ్యాలి. వీటిని ఒక రోజు అలాగే ఉంచాలి. తర్వాత కాయల్ని తీసి పొడిగా ఉన్న సీసాలో వేసి మూత పెట్టాలి. ఇది మూడు నెలలు నిల్వ ఉంటాయి.