Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీలో ఆరు నెలల తర్వాత తొలిసారిగా కేసులు తక్కువైనట్టుగా గుర్తించిన ప్రజలు సంతోషిస్తున్నారు. దీని కన్నా సంతోషకరమైన విషయం భారత్‌లోనూ వ్యాక్సిన్ తయారవుతోంది. ఇప్పటి వరకూ అమెరికా, రష్యాలు మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్లు మూడో దశ ప్రయోగాలకు వచ్చినట్టుగా ప్రకటించాయి. ఇప్పుడు భారతదేశం కూడా వాటి సరసన నిలబడబోతోంది. భారత్ బయోటిక్ సంస్థ వారి కోనాగ్జిన్ వ్యాక్సిన్ సిద్దమౌతోందని పత్రికల్లో చదివి ఆనందించని వారు లేరు. రెండు నెలల కిందటి నుంచే కరోనా వారియర్స్ లిస్టులు తయారు చేస్తున్నారు. ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు అందరి లిస్టులు తయారు చేసి పంపించారు. మొదటి విడతలో కరోనా వారియర్లకు వ్యాక్సిన్ వేయాలని భావిస్తున్నారు. కాబట్టి వ్యాక్సిన్ వచ్చేదాకా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. శానిటైజర్ వాడడం, మాస్క్ ధరించడం కచ్చితంగా పాటించాలి. బయట ఎవరికి కరోనా ఉందో తెలియదు. అందరూ బయట తిరిగేస్తున్నారు. అందుకే భౌతిక దూరం పాటించడం చాలా ముఖ్యం. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉందాం... కళాత్మకంగా గడుపుదాం...
పచ్చగన్నేరు పూలతో
ఈ పచ్చగన్నేరు పూలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. రోడ్ల పక్కన, డివైడర్ల మీద ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చెట్టుకు పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఆకులతో సమానంగా పూలు ఉంటాయి. పసుపు ముద్దలు వేలాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది గన్నేరు పూలకు దగ్గర సంబంధం గల మొక్క. అపోసైనేసి కుటుంబానికి చెందిన పుష్చించే మొక్క. దీని శాస్త్రీయ నామం 'తెవిషియా పెరువియానా'. ఈ పూలను చాలా కోసుకొచ్చి పెట్టుకున్నాను. డివైడర్ దగ్గర చెట్ల ఆకులు కూడా కోసుకొని తెచ్చుకున్నాను. సరే దీపావళికి ఇవన్నీ కలిపి అలంకారం చేద్దామనుకున్నాను. మధ్యలో ప్రమిద పెట్టి చుట్టూ పూలు, ఆకులు చుట్టాలి. ఒక వెడల్పాటి పాత్రలో ఆకుల్ని తమలపాకుల్లా సర్ది మధ్యలో ప్రమిద పెట్టి వత్తి వెలిగించాను. ఈ పాత్ర చుట్టూతా బంతిపూలు పెట్టి ఆ తర్వాత గుండ్రంగా అక్కడక్కడా గుండ్రటి ఆకులు పెట్టాను. ఆ ఆకుల మధ్యలో పచ్చ గన్నేరు పూల గుత్తులు వరుసలుగా సర్దాను. దీనిపైన మళ్ళీ ఆకుల్ని వరసగా పెట్టాను. ఈ ఆకుల మీద దీపాలు పెట్టి వెలిగించాను. ఆకుల తర్వాత మరో వరస పచ్చగన్నేరు పూలు అలంకరించాను. ఇంకా సన్నజాజులు, బంతులు, నందివర్ధనాలు మా పెరట్లోవి కోసి అక్కడక్కడా పెట్టాను. మొత్తంగా గుండ్రంగా పెద్ద పూల ముగ్గు తయారయింది. ఇలా హరితహారపు మొక్కల ఆకులు పూలతో అందమైన రంగవల్లిక అమరింది. మధ్యలో వెలిగే దీపాలు స్పెషల్ ఎట్రాక్షన్.
చాక్లెట్ ప్యాకింగ్‌తో
డెయిరీ మిల్క్ చాక్లెట్లు మా పిల్లలు బాగా తింటారు. అందుకే అందరూ విదేశాల నుంచి వచ్చేటప్పుడైనా, హైదరాబాద్ నుంచైనా చాక్లెట్ బాక్సులు తెచ్చిస్తారు. చాక్లెట్ల బాక్స్ ప్లాస్టిక్ ట్రేలా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ట్రే కూడా చాక్లెట్ కలర్‌తో ఉంటుంది. సరే ఈసారి దీన్ని వెరైటీగా ప్లాన్ చేశాను. కార్ పార్కింగ్ ప్లాంట్‌గా మార్చేశౄను. నగరాలలో కార్ పార్కింగ్‌కు స్థలం లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలిసిన విషయమే కదా! అందుకే కొంతమంది కార్లను ఒకదాని పైకి మరోటి ఐదారు వరసల్లో పార్కింగ్ చేసేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఇనుప షీట్ లాంటి దాని మీదకు కార్ వెళ్ళగానే లిఫ్ట్ సాయంతో పైకి వెళ్ళి పోతుంది. అలా నాలుగైదు ఫ్లోర్లలో ఎక్కువ కార్లు తక్కువ స్థలంలో పెట్టుకోవచ్చు. నాక చాక్లెట్ రంగులో ఉన్న ట్రేను చూడగానే కార్లను ఉంచే ఇనుప షీటులా అనిపించింది. అందుకనే దీన్ని కార్ పార్కింగ్ ప్లాంట్‌గా మారుద్దామని అనుకున్నాను. మరి కార్లు కావాలి కదా ఎలా అని ఆలోచిస్తే మా పిల్లలు చిన్నప్పుడు ఆడి పక్కన పారేసిన బుల్లి కార్లు గుర్తొచ్చాయి. ఇంకేముంది. ఆ కార్లనన్నింటినీ తెచ్చి ఈ ప్లాస్టిక్ ట్రేలో నింపాను. డెయిరీ మిల్క్ చాక్లెట్లు పెట్టడానికుపయోగించే లోతుల్లో ఈ కార్లను లైన్లో పెట్టాను. ముచ్చటగా అమరిపోయాయి కార్లు. కార్ పార్కింగ్ ప్లేస్‌గా ఈ ప్లాస్టిక్ ట్రే తయారయింది.
డిపిటి ఇంజక్షన్ మూతలతో
పసిపిల్లలకు పోలియో చుక్కలు, సూది ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు కదా! పూర్వకాలంలో పసితనంలోనే పోలియో వచ్చి కాళ్ళు చేతులు పని చేయక వికలాంగులుగా మారేవాళ్ళు. అలాగే ధనుర్వాతం కూడా చాలా ప్రమాదకరమైన జబ్బు. ఎంతో మంది బాలింతలు చనిపోయే వాళ్ళు. ఇప్పుడు వాటన్నింటికీ వ్యాక్సిన్లు వచ్చాయి. కాబట్టి ఇప్పటి వాళ్ళకవేమీ తెలియదు. ఆ వ్యాక్సిన్లు వేసే సీసాల మూతలతో నేనీ రోజు బొమ్మను చేశాను. బొమ్మ అంటూ ఏమీ లేదు. మామూలు సాదాసీదా పింగాణీ కప్పులకు ఈ మూతలు అతికించి ఒక డిజైన్లా చేశాను. దీనికి మాత్రం మామూలు ఫెవికాల్ చాలదు. ఎరాల్టైత్ అతికించాలి. ఏదో సాదాగా ఉండకుండా కొద్దిగా కళాత్మకంగా జోడించడమే.
ఇంజక్షన్ సీసాల మూతలతో
ఇంజక్షన్ల మూతలు మా హాస్పిటల్లో దాచిపెడతాము. వాటిని రకరకాల బొమ్మలకు వాడుకుంటాను. మామూలుగా మంచి నీళ్ళ సీసాల
మూతల్ని వాడు కోవచ్చు. నేను ఇంజక్షన్ల మూతలలో చాలా చిన్నవాటిని ఎంచుకున్నాను. ఊపిరితిత్తుల బొమ్మను మొదట గీసుకొని దాని మీద ఈ మూతలను ఉంచటం ప్రారంభించాను. బొమ్మ అంతా పూర్తయింది. దీనికి బార్డర్‌గా బులుగు రంగు మూతలు, లోపలంతా ఎరుపు రంగు మూతలు పెట్టి అతికించాను. ఈ రెండింటిని కలిపే ట్రాకియాను వెంటిలేటర్ వేస్టుతో నింపాను. ఇవి తెల్లగా చిన్న చిన్న మూతలుగా ఉంటాయి. ఇవే వెంటిలేటర్ వేస్ట్. ఊపిరితిత్తుల బొమ్మంతా తయారయాక పక్కన 'కరోనా' అని రాశాను. కరోనా అక్షరాలను ఆకుపచ్చ, బులుగు, ముదురు ఆకుపచ్చ ఇంజక్షన్ల మూతలతో అతికించాను. ఇంకా పాత గుండీలను తీసుకొని కరోనా బొమ్మను కూడా చేశాను. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? కరోనా వైరస్ దేనిమీద ఎటాక్ చేస్తున్నది? ఊపిరితిత్తుల మీద కదా! కరోనా వైరస్ వలన ఊపిరితిత్తులు ముడుచుకు పోయి గాలి అందక వెంటిలేటర్ అనే మిషన్ మీదకు వెళ్తున్నారు బాధితులు. అందుకే ఈ వైనాన్నంతా ఈ చిన్న బొమ్మలో చూపించే ప్రయత్నం చేశాను.
మాస్కులతో
మన రోజువారి దుస్తుల ధారణలో మాస్కులు ఒక భాగమైపోయాయి. ప్రతిరోజూ కొత్త మాస్కులు వేసుకుంటున్నాము అంటే ప్రతిరోజూ ఇక డిస్పోజబుల్ మాస్క్ తీసేస్తున్నాం. మనింట్లోవే కాబట్టి వాడేసిన మాస్కుల్ని బొమ్మలో వాడుకోవచ్చు. రాత్రికి మాస్క్ తీసేశాక ఒక కవర్లో వేసి శానిటైజర్ చల్లి భద్రపరిస్తే సరిపోతుంది. ఇరవై ముప్పై అయ్యాక ఒక బొమ్మ కోసం ప్లాన్ చెయ్యవచ్చు. మాస్క్‌కు తోకలు, సైడ్స్ అన్నీ కత్తిరించేయగా మధ్య భాగం మిగిలి ఉంటుంది. ఈ భాగాన్ని మడిచి ఒక దారం కట్టేయాలి. అప్పుడు 'జౌ' తయార వుతుంది. అలాగే తోకల్ని చిన్న ముక్క లుగా కత్తిరించి పువ్వు లుగా చేయవచ్చు. అలాగే సైడ్స్ ముక్కల్ని వరసలో పెట్టి మడిచి దారంతో కుట్టేయాలి. అదొక విచ్చిన పువ్వలా అనిపిస్తుంది. ఇప్పుడు వీటన్నింటిని కలిపి ఫొటోలో చూపిన విధంగా చెట్టులా అమర్చాలి.