Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచమంతా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలింపబడలేదు. రకరకాల రూపాలు మార్చుకుంటూ కంటికి కనిపించని ఒక క్రిమి ఆరడుగుల మనిషిని ముప్పతిప్పలు పెడుతోంది. కొత్త రూపంలో కొత్త బలంతో కొత్త స్ట్రెయిన్‌గా మనుషులను భయపెట్టడానికి వస్తోంది. కరోనా వైరస్ ఎన్ని వేషాలు వేసినా వైద్యులు దానికి దిమ్మ తిరిగే వ్యాక్సిన్లు తీసుకువస్తారు. అప్పుడు ఇంతకు ముందు వచ్చిన నిఫా, ఎబోలా, సార్స్, స్వైన్‌ఫ్లూ వంటి వైరస్లు వెనుతిరిగినట్టు కరోనా వైరస్ కూడా వచ్చిన దారిలోనే వెనక్కు వెళ్ళాల్సి వస్తుంది. ఆ క్షణం కోసం ఎదురుచూస్తూ ఉందాం. అప్పటి వరకు బయటకు వెళ్ళే పనులు వాయిదా వేసుకుందాం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మాస్క్‌లు ధరించి కాలు బయట పెడదాం. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని అనుకోవద్దు. ఎన్నో అద్భుత కళాఖండాలు ఆవిష్కృతమవుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం.
అరిశలతో
తిండి పదార్థాలతో బొమ్మలు ఏమిటీ అనుకుంటున్నారా? పిల్లలను ఆకర్షించాలంటే తప్పదు మరి. నాకీ కూర వద్దు, నాకా ఫ్రూట్ వద్దు అంటూ పిల్లలు పేచీ పెడు తుంటారు. వాళ్ళకు బొమ్మల్లా అలంకరించి పెడితే త్వరగా తింటారు. నేను దీనికి 'ఫుడ్ ఆర్ట్' అని పేరు పెట్టాను. మామూ లుగా కూరగాయల తోనూ పండ్లతోనూ కార్వింగ్ చేస్తారు కదా! దాన్నే నేను కొద్దిగా మార్చి పిండి వంటలతో తయారు చేస్తున్నాను. నేనీ బొమ్మల్ని పెద్ద ఫొటోలుగా తీసి మా హాస్పిటల్లో పెడితే పిల్లలు దాని ఎదురుగా నిల్చుని తింటున్నట్టుగా యాక్షన్ చేయసాగారు. అది చూసి నాకు చాలా ఆనందమనిపించింది. ఇప్పుడు సంక్రాంతి రాబోతున్నది కదా! అందరూ అరిశలు వండుకుంటారు. వాటితో ఇలా చేసి చూడండి. పిల్లలెలా తినేస్తారో. పోయిన సంక్రాంతికి బెల్లపు అరిశలు చేశాను. ఒక ప్లేట్లో రెండు అరిశలను ఒక దాని కింద మరొకటి పెట్టాను. ఇది తల, మొండెం అన్నమాట. దీనికి కాళ్ళు, చేతులు తగిలించాలి కదా! ఇంకొక అరిశను ముక్కలుగా చేసి కాళ్ళు, చేతులు అమర్చాను. చేతుల వేళ్ళ కోసం కారబ్బూందీ పెట్టాను. స్వీటుకు హాట్ తోడన్నమాట. కండ్ల కోసం యాలకులు, కనుబొమ్మలు, నోరు కోసం కారప్పూసను, ముక్క కోసం ద్రాక్షను పెట్టాను. ఒక పిల్లవాడు తయారయ్యారు. నేను వీడికి జుట్టు పెట్టలేదు. మీరు జుట్టు కూడా పెట్టవచ్చు. ఇలా ప్లేట్లో పెట్టి డైనింగ్ టేబుల్‌పై పెట్టండి. ఐదు నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అవకపోతే చూడండి.
పాతశుభలేఖలతో
పెండ్లి సమయంలో ఎంతో అందంగా శుభ లేఖలు ముద్రించు కుంటారు. ఇప్పుడు ఎంతో ఖరీదుగా కూడా ఉంటున్నాయి. అవి అందరికీ ఆనందంగా పంచు తాము. పెండ్లి సమయం దాకా మనం వచ్చిన కార్డులను అట్టిపెట్టు కుంటున్నాం. పెండ్లి డేట్ అయిపోయాక పారేస్తాం. ఇంత ధనం ఖర్చుపెట్టి ముద్రించిన శుభలేఖలు వృధాగా పారేయకుండా ఇలా తయారు చేస్తే బాగుంటుంది. నేను ఇలా తయారు చేసిన వాటికి ''వెడ్డింగ్ కార్డు క్రియేషన్స్'' అని పేరు పెట్టాను. కొద్దిగా గోధుమ రంగులో ఉన్న పెద్ద శుభలేఖను అందంగా అలంకరించాను. దీనికి మధ్యలో వినాయకుడు ఉన్నాడు. కింద బంగారు రంగు డిజైను ఉన్నది. చుట్టూతా 'శుభం' అని స్కెచ్పెన్నుతో రాశాను. మధ్యలో ఆకులు, పూవులు చిత్రించాను. వీటిని 3డి కలర్లతోనూ, స్కెచ్ పెన్నులతోనూ దిద్దాను. ముచ్చటగా తయారయింది.
గ్రీటింగ్ కార్డు
మా బంధువుల్లో పాపకు మొదటి సంవత్సరం పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. దాని కోసం సరదాగా ఒక గ్రీటింగ్ కార్డు చెయ్యాలనుకున్నాను. అందుకు గాను ఒక చిత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మధ్యలో చిన్నిపాప, అటూఇటూ ముద్దులు పెడుతున్న అమ్మానాన్నలు ఉన్న చిత్రాన్ని తీసుకున్నాను. మా మందుల సీసాలపై ఇలాంటి బొమ్మలు ఉంటాయి. వాటిని కత్తిరించి ఈ కార్డులో వాడుతున్నాను. దీనికి ఒక కవితను జోడించాను. నా 'పూలతోట' పుస్తకంలోని పిల్లల గేయమిది. ఈ గ్రీటింగ్ కార్డు కింది భాగాన రంగు రంగుల సీతాకోక చిలుకను, గులాబీ పువ్వుల్ని చిత్రించాను. ఇవి పిల్లలకు ఎంతో ప్రీతి పాత్రమైనవి కదా! అంతా తయారు చేశాను, బాగుంది. కానీ మేము హాస్పిటల్ తరపున గిఫ్ట్ ఇస్తున్నాం కాబట్టి ఏదైనా జాగ్రత్తలు చెప్పాలి కదా అనుకున్నాను. అందుకే కార్డులో ఈగలు, నల్లులు బొమ్మల్ని చిత్రించాను. చాలా వ్యాధులకు దోమలు, ఈగలు, నల్లులు వంటి కీటకాలే కారణమవుతున్నాయి. అలాంటి వాటిని దరి చేరనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందువల్లనే ఈ కీటకాలను చిత్రించాను. వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ఆయా కీటకాలకు దూరంగా ఉండాలి. పసిపిల్లల్ని మరీ జాగ్రత్తగా చూసుకోవాలి.
సూదిమందు మూతలతో
పిల్లల కొచ్చే వ్యాధుల బారి నుండి త్వరగా బయట పడాలంటే ఇంజక్షన్లు చేయటం తప్పనిసరి. వ్యాధి తీవ్రతరం కాకుండా ఉంటుంది. ఇంకా టానిక్కులు, టాబ్లెట్ల వంటివి ఇచ్చినపుడు పిల్లలు పూర్తిగా తాగలేరు, మింగలేరు. బయటకు కక్కేస్తూ ఉండటం వల్ల వెళ్ళాల్సినంత డోస్ శరీరంలోకి వెళ్ళదు. ఆ విధంగా కూడా ఇంజక్షన్లు చాలా బెటర్. కచ్చితమైన ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంజక్షన్ల సీసాల మీద ఉండే ప్లాస్టిక్ మూతలు చాలా అందంగా ఉంటాయి. నేను వాటితో కొన్ని వేల బొమ్మలు చేశాను. ఈరోజు కరోనా చిత్రం గురించి చూద్దాం. రామ బాణానికి తిరుగులేదంటారు. ఈ మూతలతో ఒక విల్లును, బాణాన్నీ తయారు చేశాను. మరి ఈ బాణం ఎవరికి ఎక్కుపెడుతున్నాం అంటే కరోనా వైరస్ మీదే కదా! మరి కరోనా వైరస్‌ను తయారు చెయ్యాలి కదా! కరోనా కోసం కూడా ఇవే రంగురంగుల ఇంజక్షన్ మూతల్ని వాడాను. ఆ మూతల్ని వాడాను. ఆ మూతల్ని గుండ్రంగా అమర్చి దానిమీద ఉండే తంతువుల కోసం ఇంజక్షన్ నీడిల్ క్యాప్స్‌ను వాడాను. చూశారా కరోనా వైరస్ చిత్రం తయారైంది. వైరస్ మీదకు ఎక్కుపెడుతున్న బాణం కూడా తయారైంది. ఇక కరోనా పారిపోతుంది.
ఆకులతో
ప్రతి ఇంట్లో ఏదో పూల చెట్లుంటాయి కదా! వాటి ఆకులు, పూలు, కాయలతో ఏదో ఒక బొమ్మలు తయారుచేయవచ్చు. ఒక పక్షి బొమ్మను చేశాను. మా ఇంట్లో ఎర్రగన్నేరు పూల చెట్టు ఉన్నది. దాని ఆకులు సన్నగా, పొడవుగా ఉంటాయి. ఈ ఆకుల మధ్యలో ఈనె బాగా బయటికి కనిపించేలా ఉండి, ఆకు మందంగా ఉంటుంది. ఈ ఆకుల్ని పక్షి తోకగా అమర్చాను. పక్షి శరీరం కోసం ఆవాల చెట్టు ఆకును వాడాను. తల కోసం క్రోటన్ ఆకును పెట్టాను. దానికో కన్నును పెట్టాను. పక్షి తల మీద తురాయి లాగా నూరు వరహాల పూలను పెట్టాను. ఆదే విధంగా పక్షి కాళ్ళ కోసం కూడా అదే నూరు వరహాల పూలను పెట్టాను. ఈ విధంగా ఇంట్లో ఉన్న చెట్ల ఆకులతో ముచ్చటైన పక్షి తయారు చేశాను.
- డా|| కందేపి రాణీప్రసాద్