Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిడ్డ అడుగు బయట పెడితే క్షేమంగా ఇల్లు చేరుతుందో లేదోనని కన్నవారి గుండెల్లో గుబులు. అమ్మాయిలపై రోజురోజుకు పెరిగిపోతున్న దాడులే దీనికి కారణం. ఆడపిల్లలే మనుగడే కష్టంగా మారింది. కాపాడాల్సిన వారే కాటు వేస్తున్నారు. ఆరు నెలల పసి పాప నుండి పండు ముసలి వరకు ఎవ్వరూ దీనికి అతీతులు కారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలకు ఆత్మరక్షణ ఎంతో అవసరం. అయితే కరాటే వంటివి ఎక్కువ మంది ధనవంతుల బిడ్డలే నేర్చుకుంటున్నారు. పేద పిల్లలు ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ తరగతులకు దూరంగా ఉంటున్నారు. అలాంటిది బస్తీలో జీవిస్తూ తాము కరాటే నేర్చుకుని.. తమ లాంటి ఆడపిల్లలకు నేర్పిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న ఇద్దరు అమ్మాయిల గురించి ఈ రోజు తెలుసుకుందాం...
అమ్మాయిలపై పెరిగిపోతున్న దాడులు, హింస చూసి నాగరాజు చలించిపోయాడు. ఆత్మ రక్షణలో శిక్షణ ఇవ్వడమే దీనికి పరిష్కారం అని భావించాడు. ప్రభుత్వాలు చేయవల్సిన పనిని ఇప్పుడు అతను చేస్తున్నాడు. ముఖ్యంగా బస్తీల్లో నివసించే అమ్మాయిలకు తనకు తెలిసిన విద్యను నేర్పించాలనే నిర్ణయం తీసుకున్నాడు. మీర్పేట్ మున్సిపాల్టీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి అవగాహన కల్పించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కరాటే అమ్మాయిలకు ఎలా ఉపయోగపడుతుందో వివరించాడు. చాలామంది ఆసక్తితో నేర్చుకోవడానికి ముందుకు వచ్చారు. అలా వచ్చిన వారే రమ్య నాయక్, సంగీత. ఇప్పుడు వీరిద్దరూ అంతర్జాతీయ స్థాయిలో కరాటే పోటీలకు సిద్ధమవుతున్నారు.
తన లాంటి అమ్మాయిలకు...
రమ్య నాయక్ది మీర్పేట్ మున్సిపాల్టీలోని బడంగ్పేట్ ప్రాంతం. ఈమె ఓ గిరిజన కుటుంబంలో పుట్టింది. స్థానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. రెండేండ్ల కిందట ఆమె చదివే పాఠశాలకు వెళ్ళి నాగరాజు కరాటే శిక్షణ గురించి చెప్పాడు. ఆయన చెప్పింది విన్న రమ్య తనూ ఎలాగైనా కరాటే నేర్చుకోవాలనుకుంది. నాగరాజు స్థాపించిన 'కరాటే అండ్ మార్షర్ ఆర్ట్స్'' అకాడమీలో చేరింది. సంవత్సరం నుండి కరాటే నేర్చుకుంటున్న రమ్య ఈ కాలంలో జరిగిన కొన్ని పోటీల్లో పాల్గొని మెడల్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం బస్తీలో తన లాంటి అమ్మాయిలు ఎందరో కరాటే నేర్చుకోవడానికి కారణమయింది. 2020 డిసెంబర్లో కర్మన్‌ఘాట్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఛాంపియన్‌గా నిలిచింది.
శిక్షణ కూడా ఇస్తుంది
సంగీత గత ఆరు సంవత్సరాల నుండి కరాటే నేర్చుకుంటుంది. ఆమె ఏడో తరగతిలో ఉన్నప్పుడు నాగరాజు ఆమె చదువుత్ను జెడ్.పి.టి.సి పాఠశాలకు వెళ్ళాడు. సెల్ఫ్ డిఫెన్స్ క్లాసుల గురించి ఆయన చెప్పిన మాటకు స్ఫూర్తి పొంది అప్పటి నుండి శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈమె ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది. తను నేర్చుకోవడమే కాకా అకాడమీకి వచ్చే అమ్మాయిలకు కరాటేలో శిక్షణ కూడా ఇస్తుంది. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించింది. వైజాగ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఛాంపియన్‌గా నిలిచింది. దుబారులో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొంది. ఇప్పటి వరకు సుమారు పది మెడల్స్ తన ఖాతాలో వేసుకుంది. ఒలింపిక్స్‌లో పాల్గొనాలని ఆమె కోరిక. తన లాంటి పేద అమ్మాయిలకు కరాటే నేర్పించడమే తన లక్ష్యంగా చెబుతుంది సంగీత.
ప్రభుత్వం నుండి సహకారం ఉంటే...
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అమ్మాయిలకు కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నుండి ఏమైనా సహకారం అందుతుందేమోనని నాగరాజు చాలా ప్రయత్నించాడు. కానీ అలాంటిది ఏమీ దొరకలేదు. దాంతో హీరో సుమన్ సహకారంతో అతనే 2015లో ''సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్'' అనే అకాడమీని స్థాపించి ఉచిత శిక్షణ ప్రారంభించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మాలకు నేర్పించి ఆ అమ్మాయిలతోనే శిక్షణ కూడా ఇప్పిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు అన్ని స్థాయి పోటీల్లోనూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా దాడులను నుండి వాళ్ళను వాళ్ళు కాపాడుకోగలుగుతున్నారు. ప్రస్తుతం ఈ అకాడమీకి హీరో సుమన్ చైర్మన్. ఆయన సహకారంతోనే ఇది నడుస్తుంది. అమ్మాయిలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న నాగరాజు ప్రయత్నాని చూసి సుమన్ అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తున్నారు. ప్రస్తుతం చంపాపేట్, కర్మన్‌ఘాట్, సంతోష్‌నగర్, బడంగ్పేట్, బాలాపూర్, లెనిన్‌నగర్‌లో దీని బ్రాంచ్‌లు నడుస్తున్నాయి. వీటిల్లో నేర్చుకున్న గవర్నమెంట్ స్కూల్ అమ్మాయిలు బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. ఒకప్పుడు ఈ అమ్మాయిలు ఏం చేయగలరు అని అన్నవారే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు.
ఇప్పుడు భయం లేదు
గతంలో నేను బయటకు వెళితే మళ్ళీ తిరిగి వచ్చే వరకు మా ఇంట్లో వాళ్ళు చాలా భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకు ఆ భయం లేదు. ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయి జాగ్రత్తగా రాగలదు అని నమ్ముతున్నారు. దీనికి కారణం నేను కరాటే నేర్చుకోవడమే. నాలాంటి పేద అమ్మాయిలకు మా సార్ ఫ్రీగా నేర్పిస్తున్నారు. ప్రస్తుతం అమ్మాయిలకు రక్షణ లేదు. నా ఆత్మరక్షణ కోసమే కరాటే నేర్చుకుంటున్నాను. ఈ మధ్య నేను క్లాసులకు వస్తుంటే ఒకడు వెంటబడ్డాడు. అతన్ని కొట్టాను. అప్పటి నుండి మళ్ళీ కనిపించలేదు. కరాటే నేర్చుకున్నాను కాబట్టే ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాను. నాపైన నాకు నమ్మకం వచ్చింది. కరాటే ఛాంపియన్ కావాలని నా కోరిక. మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. నన్ను చూసి ఇంకా చాలా మంది అమ్మాయిలు కరాటే నేర్చుకోవడానికి ముందుకు రావాలి. డిసెంబర్లో నేను గెలిచినప్పుడు 'మా గల్లీలో అమ్మాయి ఛాంపియన్ అయ్యింది' అని అందరూ గర్వపడ్డారు.
- రమ్యా నాయక్.
ఉచితంగా శిక్షణ ఇస్తాను
అమ్మాయిలు కరాటే నేర్చుకోవడం వల్ల ఎంత ఉపయోగమో మా నాగరాజు మాష్టారు మా స్కూల్‌కి వచ్చి చెప్పారు. అప్పుడే అకాడమీకి వచ్చి చేరాను. మాష్టారు నేర్పించే విధానం కూడా చాలా బాగుంది. అందుకే అప్పటి నుండి మా మాష్టార్ దగ్గరే నేర్చుకుంటున్నాను. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇంత వరకు వచ్చాను. బయట పరిస్థితులు బాగోలేదు. అమ్మాయిలను ర్యాగింగ్ చేయడం, ఏడిపించడం ఎక్కువైపోయింది. వాటి నుండి బయట పడాలంటే కరాటే వచ్చి ఉండాలి. ఎవరో వచ్చి మనకు సాయం చేస్తారని ఎదురు చూడడం కంటే మనమే ఎదురు తిరిగితే ఎవ్వరూ మన దగ్గరకు రారు. ప్రతి అమ్మాయి కరాటే నేర్చుకోవాలి. అప్పుడే ఈ దాడులు తగ్గుతాయి. అందుకే భవిష్యత్‌లో నాలాంటి పేద అమ్మాయిలకు కరాటేలో ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను.
- కె.సంగీత.
అవకాశం కల్పిస్తే...
2012లో నేను బ్లాక్ బెల్ట్ పూర్తి చేశాను. తర్వాత అమ్మాయిల కోసం స్కూల్ ప్రారంభించాలని అనుకున్నాను. ప్రస్తుతం అమ్మాయిలపైన దాడులు బాగా జరుగుతున్నాయి. వాళ్ళకంటూ సొంతంగా సెల్ఫ్‌డిఫెన్స్ ఉంటే ధైర్యంగా బయటకు వెళ్లగలరు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మాయిలకు నేర్పించాలనుకున్నా. అక్కడ పేద పిల్లలు ఉంటారు. వాళ్ళకు వీటిపై అవగాహన ఉండదు. వేలకు వేలు ఫీజలు కట్టి నేర్చుకునే ఆర్థిక స్థోమత వారికి ఉండదు. అలాంటి వారికి నేర్పిస్తే మంచిదని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి అవగాహన తరగతులు పెట్టేవాడిని. మొదట్లో స్కూల్ ప్రిన్సిపల్ వాళ్లు 'ఈ అమ్మాయిలు ఏం నేర్చుకుంటారు' అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పేద అమ్మాయిలే ఛాంపియన్స్‌గా నిలుస్తున్నారు. సంగీత, రమ్య అలా వచ్చిన మట్టిలో మాణిక్యాలో. ఇలాంటి మాణిక్యాలు మన చుట్టూ ఎందరో ఉన్నారు. అవకాశలు కల్పిస్తే కచ్చితంగా అమ్మాయిలు ఛాంపియన్స్‌గా నిలుస్తారు. ప్రభుత్వం నుండి సహకారం అందిస్తే ఇంకా ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వగలను.
- నాగరాజు, కరాటే మాష్టార్