Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అన్నిరకాల పోషకాలు ఉండే సమతులాహారం అవసరం. ఎదుగుతున్న క్రమంలో వారికి ఎక్కువ శక్తినిచ్చే ఆహారం ఇవ్వాలి. వివిధ రకాల కూరగాయల నుంచి పిల్లలకు విటమిన్లు, ఖనిజాలు, ఇతర సూక్ష్మ పోషకాలు అందుతాయి. సాధారణంగా కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా, కెలొరీలు తక్కువగా ఉంటాయి. వీటితో పిల్లలకు శక్తి అందటంతో పాటు కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. వివిధ రకాల ఆకుకూరలు, దుంపలు, కూరగాయల ద్వారా పిల్లలకు అవసరమైన అన్నిరకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. ఇవన్నీ వారి పెరుగుదలకు సహాయపడతాయి. తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇన్ని ఉపయోగాలు ఉండే కూరగాయలను పిల్లలు ఇష్టపడేలా చేయాలి. ఇందుకు తల్లిదండ్రులు కొన్ని పద్ధతులు పాటించాలి.
కొత్తగా వండాలి వండాలి
సాధారణంగా పిల్లలు కొత్త రుచులను ఎక్కువగా ఇష్టపడతారు. రోజూ ఒకేరకమైన రుచి ఉండే పదార్థాలను వారు దగ్గరకు రానివ్వరు. అందువల్ల అన్నం, రోటీలతో పాటు క్యారెట్లు, ఉల్లిగడ్డలు, పాలకూర, దోసకాయ, టమాటాలు వంటివన్నీ పిల్లలకు ప్లేట్లో పెట్టి ఇవ్వాలి. వాటిపై కొంచెం నిమ్మరసం, ఉప్పు కలిపి సలాడ్‌లా చేసి ఇస్తే తినేందుకు ఆసక్తి చూపుతారు. వీటిని ఇష్టపడని వారికి ఇంట్లోనే బర్గర్లు వంటివి తయారు చేసి, వాటిల్లో ఆకుకూరలు పెట్టి ఇవ్వాలి. సాదాగా ఉడికించిన కూరగాయలకు బదులుగా ఇతర పదార్థాలతో వాటిని కలిపి ఇవ్వాలి.
అర్థమయ్యేలా చెప్పాలి
కూరగాయల్లో ఉండే పోషకాల గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. వివిధ రకాల కూరలు, దుంపలు, ఆకుకూరల వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో వివరించాలి. సాధారణంగా పిల్లలు అన్ని విషయాల్లోనూ తమ ఇంట్లో ఉండే పెద్దవాళ్లను ఫాలో అవుతారు. వారినుంచే మంచి చెడు తెలుసుకుంటారు. అందువల్ల ముందు తల్లిదండ్రులు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో తీసుకుంటూ, పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ఏవేవి ఎంత మొత్తంలో తినాలో చెబుతూ వారిని కూడా ప్రయత్నించమని ప్రోత్సహించాలి.
పదార్థాలపై ఆసక్తి పెంచాలి
శాకాహారంలో పిల్లలకు ఏవంటే ఇష్టమో అడిగి తెలుసుకొని, వాటినే ఎక్కువగా చేసివ్వాలి. దీంతోపాటు కూరగాయలు, ఆకుకూరలతో ఎలాంటి కొత్తరకం వంటకాలు చేయవచ్చో వారికి వివరించాలి. పిల్లలు సహజంగానే ఇలాంటి కొత్త విషయాలపై ఆసక్తి చూపుతారు. అందువల్ల వారి అభిప్రాయంతో, వారికి ఇష్టమైన పదార్థాలనే తినిపించాలి. కొత్త రెసిపీని చేసేటప్పుడు దాంట్లో వాడే మసాలాలు, సుగంధద్రవ్యాలు రుచికి ఎలా కారణమవుతాయో వివరించాలి. ఇవన్నీ కొత్త రకం వంటలపై వారికి ఆసక్తిని పెంచడంతోపాటు ఆకలిని కూడా ప్రేరేపిస్తాయి.
క్రమం తప్పకుండా ఇవ్వాలి
పిల్లలకు ఇచ్చే ఆహారంలో కూరగాయలు కొద్దిమొత్తంలోనైనా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో కూరగాయలతో చేసిన వంటకాలు క్రమం తప్పకుండా ఉండాలి. కానీ రోజూ ఒకేలా కాకుండా కొత్త రుచులను వారికి పరిచయం చేయాలి. దీనివల్ల వాటిని తినేందుకు పిల్లలు మానసికంగా సన్నద్ధమవుతారు.
ఓపికగా ఉండాలి
చిన్నపిల్లలు సహజంగానే బయట దొరికే కేకులు, చిప్స్, క్యాండీలు, ఇతర చిరుతిళ్లను ఇష్టపడతారు. వాటి వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి, కూరగాయల ప్రయోజనాల గురించి వారికి ఆ వయసులో పెద్దగా తెలియదు. అందువల్ల కోపంతో, బలవంతంగా వారి ఆహారపు అలవాట్లను మార్చే ప్రయత్నం చేయకుండా ఓపికతో వ్యవహరించాలి. వివిధ రకాల కూరగాయలు, బంగాళాదుంప, క్యారెట్ వంటి దుంపలు, ఆకుకూరలను క్రమంగా వారికి అలవాటు చేయాలి. పిల్లలు కూడా ఎదిగే క్రమంలో వాటి ఉపయోగాలను తెలుసుకుంటూ వాటిపై ఇష్టం పెంచుకుంటారు.