Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జుట్టు నల్లగా నిగనిగ లాడుతూ కనిపించేందుకు తలలో ఉండే మెలనిన్ కారణం. దీని ఉత్పాదకత తగినంత ఉండాలంటే 'బి' విటమిన్లోపం లేకుండా చూసుకోవాలి. ఆకుకూరలూ, తృణధాన్యాలూ, గుడ్లూ, మాంసాహారం ఎక్కువగా తింటే 'బి' విటమిన్ బాగా అందుతుంది.
- 'సిలికా' అనే ఖనిజ లవణం జుట్టుకు తేమను అందించి, వెంట్రుకల్ని దృఢంగా ఉంచుతుంది. యాపిల్స్, కమలాలు, ఎండుద్రాక్ష, ఉల్లిగడ్డ, క్యారెట్లు, ఓట్స్, శుద్ధిచేయని గింజలు, పప్పులు, గింజలు, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలన్నీ సిలికాను అందిస్తాయి.
- కేశాలు చిట్లిపోయి, ఎదుగుదల తక్కువగా ఉంటే మాంసకృత్తులు లోపించినట్టని అర్థం. ఎందుకంటే జుట్టు కణాలు పరిణతి చెందాక వాటిల్లో కెరొటిన్ అనే ప్రొటీన్ నిండుతుంది. దీనివల్లే జుట్టు ఎదుగుదల బాగుంటుంది. అందుకే ప్రొటీన్లు ఎక్కువుండే లోఫ్యాట్ చీజ్, బీన్స్, గుడ్లు, పాలు, పెరుగు, సోయాపాలు, నట్స్, గింజలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
- తల దువ్వుకునేప్పుడు జుట్టు రాలడం సహజం. అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటే జింక్ లోపం ఉండొచ్చని సందేహించాలి. జింక్ జుట్టు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తుంది. నువ్వులూ, గుమ్మడి గింజలూ, పుచ్చకాయ గింజలూ, డార్క్ చాక్లెట్, పల్లీలు లాంటి వాటిల్లో జింక్ పుష్కలంగా లభిస్తుంది.
- చుండ్రు వుంటే తలంతా దురద పుట్టి, పొట్టుగా రాలుతుంది. తలలో సహజ నూనెలు తగ్గి పొడిబారినప్పుడే ఇలాంటి సమస్య ఎదురవుతుంది.దాన్ని తగ్గించుకోవాలంటే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ పోషకాలను నట్స్, సాల్మన్ తరహా చేపలు, అవిసె గింజలు, గుడ్ల నుంచి పొందవచ్చు.