Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమంది తమ భాగస్వామిని ఎంచుకునే విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. దీని వల్ల పెండ్లి తర్వాత కలిసి ఉండలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అందుకే భాగస్వామిని ఎంచుకునే క్రమంలో కొన్ని విషయాలను బాగా గమనించాల్సి ఉంటుంది. పెండ్లి అనేది ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. అయితే ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు సరిగ్గా లేకపోయినా వారి వివాహ జీవితంలో ఇబ్బందులు తప్పవు. అందుకే జీవిత భాగస్వామి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. అలాగే కొన్ని విషయాల గురించి అస్సలు పట్టించుకోకూడదు అని కూడా చెబుతారు. అవేంటో తెలుసుకుందాం.
అందం కంటే వ్యక్తిత్వం ముఖ్యం
సహజంగా ఎవరైనా ఎదుటివారి అందాన్ని చూసి ఇష్టపడతారు. వారి వ్యక్తిత్వం ఎలా ఉన్నప్పటికీ అందంగా ఉంటే చాలు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. ఇది సరైన పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అందం, ఎత్తు, రంగు వంటి వాటి కంటే అవతలి వ్యక్తి వ్యక్తిత్వం ఎంతో ముఖ్యమైనది. బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పది. అందుకే అందం కంటే వారిలోని నిజాయితీ, వ్యవహార శైలితో పాటు వారి మనస్తత్వం మీ మనస్తత్వానికి దగ్గరగా ఉందా? లేదా? అన్న విషయాలను గమనించాలని స్పష్టం చేస్తున్నారు.
వయసుపై శ్రద్ధ పెట్టకండి
మీ భాగస్వామి ఎంత గొప్పవారో వారి వయసును బట్టి చెప్పలేం. వారి జీవిత అనుభవాలు, వారి పెంపకం, జీవితంలో వారు ఎదుర్కొన్న కష్టనష్టాలు వంటి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా సంబంధాలు శరీరాకృతి, రంగు, వయసుతో పని లేకుండా దృఢంగా నిలుస్తాయని గుర్తుంచుకోండి. జీవితంలో కలిసి మెలిసి గడిపేందుకు వయసు, శరీరాకృతి వంటివి అడ్డు రావని అర్థం చేసుకోండి.
ఎలా కలిశారని పట్టించుకోవద్దు
టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరగడం కొన్ని అనర్థాలకు దారి తీస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో టెక్నాలజీ కూడా మంచే చేస్తుంది. డేటింగ్ యాప్స్ ద్వారా మొదలైన బంధాల్లో 30 శాతం జీవితాంతం నిలిచి ఉంటున్నాయట. చాలామంది తాము డేటింగ్ యాప్స్‌లో కలిసిన వ్యక్తిని కలిసి, ముందు ప్రేమలో పడడం, ఆ తర్వాత వారినే వివాహం చేసుకోవడం చేస్తున్నారట. అందుకే సోషల్ మీడియా ద్వారా బంధాలను కొనసాగించడం కాస్త ఇబ్బందైన పద్ధతే అయినా.. ఒకవేళ అవతలి వ్యక్తిని కలిసిన తర్వాత వారు మంచి వారు అన్న ఫీలింగ్ మీకు వస్తే అలాంటివారిని భాగస్వామిగా ఎంచుకోవడానికి వెనుకాడవద్దు.
వారి గతం మీకు అనవసరం
మీరు మీ భాగస్వామిని చూసే వరకూ ఇంకెవరినీ ప్రేమించకపోయి ఉండొచ్చు. వారు మాత్రం మీకంటే ముందే ఓ నలుగురితో బ్రేకప్ చెప్పి ఉండవచ్చు. అయితే ఇవేవీ మీ బంధాన్ని బలహీనంగా మార్చలేవు. మీ ఇద్దరి మధ్య ప్రేమ, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధానం వంటివి మీ ఇద్దరినీ కలకాలం కలిపి ఉంచుతాయి. అందుకే వారి గతం గురించి గతంలోనే వదిలేయండి. అలాంటి విషయాలు పట్టించుకోవద్దు. గతంలో వారికి ఉన్న ప్రేమికుల గురించి మాట్లాడి వారిని ఇబ్బంది పెట్టవద్దు.
ఆలోచనలను పంచుకోండి
మీ జీవితంలో కొత్త వ్యక్తిని ఆహ్వానించే క్రమంలో వారితో మీ ఇష్టాఇష్టాలను పంచుకోండి. అదేవిధంగా వారి ఇష్టాలను కూడా తెలుసుకోండి. సాధారణంగా ఆలోచనలు ఒకేలా ఉంటే వివాహ జీవితం సాఫీగా సాగుతుందని భావిస్తుంటాం. కానీ ఇద్దరూ ఒకేలా ఆలోచించే వ్యక్తులైతే కొన్ని రోజుల తర్వాత జీవితం బోరింగ్‌గా మారే అవకాశం ఉంటుంది. ఇద్దరి అభిరుచులు వేర్వేరుగా ఉండి.. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తూ.. ఒకరికి నచ్చిన విషయాలను మరొకరు ట్రై చేస్తూ ముందుకు వెళ్లడం వల్ల జీవితం కొత్త కొత్తగా ఆనందంగా మారుతుంది. ఉదాహరణకు మీకు ఇంట్లో ఉండడం అంటే ఇష్టం. మీ భాగస్వామికి ట్రెక్కింగ్ అంటే ఇష్టం. అలాంటప్పుడు ట్రెక్కింగ్ చేయడంలోని మజాను మీరూ ఓసారి ట్రై చేస్తే వీకెండ్‌కి ఇంట్లోనే ఉంటూ ఆనందంగా సమయం గడపడాన్ని వారూ ఆనందిస్తారు. ఇలా ఇద్దరి ఇష్టాలను గౌరవిస్తూ జీవించడం వల్ల కొత్త కొత్త అలవాట్లతో మీ జీవితం ఆనందంగా మారుతుంది.