Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మాయి అనగానే అందరికీ తట్టే మరో పదం అందమైన. అమ్మాయి - అందం ఈ రెండు పదాలూ కలగలిసిపోయి ఒకటి లేని రెండవదాన్ని మనం ఊహించను కూడా ఊహించలేకపోతున్నాం. సినిమాలూ, కధల్లోనే కాదు ఈ అందమైన అమ్మాయి అన్న ఫ్రేజ్ మన రోజువారీ మాటల్లో కూడా ఉంటుంది. సన్నగా ఉంది, లావుగా ఉంది, బొద్దుగా ఉంది, నల్లగా ఉంది, తెల్లగానే ఉంది కానీ కళగా లేదసలు, మరీ పొట్టి, తాడి చెట్టులా అంత పొడుగ్గా ఉందేమిటి ఈ పిల్ల.. ఇలాంటి మాటలు తప్ప ఈ అమ్మాయి బాధ్యతగా ఉంటుంది, చక్కగా ఆలోచిస్తుంది, నోరారా పలకరిస్తుంది లాంటి మాటలు వినిపించవు. ఈ సమమాజంలో మనం ఇలాంటి మాటలు వింటూ పెరిగాం, ఇలాంటి మాటలే అంటున్నాం. కానీ, మన పిల్లల్ని కూడా ఇదే పద్ధతిలో పెంచక్కరలేదు. అమాయిలు వారి అందాన్నే కాక వారి వ్యక్తిత్వానికి కూడా మెరుగులద్దుకునేలా పెంచడం మనకీ వాళ్ళకీ కూడా ఎంతో బావుంటుంది అంటున్నారు మానసిక నిపుణులు. ఇంకా వారేమంటున్నారో తెలుసుకుందామా...
వారిని వారిలానే..
పిల్లలు వారిని వారు అంగీకరించాలంటే ముందు మీరు వారిని అంగీకరించాలి. పొడవు, రంగు వంటివి పుట్టుకతో వచ్చినవి, వాటిని ఎవరూ ఏమీ చేయలేరు. పిల్లలకి నీట్‌గా.. శుభ్రంగా ఉండాలని చెప్పాలి. అందులో అనుమానం లేదు కానీ ఇంకాస్త రంగుంటే బావుండేది అనే మాటలు మీరు అనుకోకూడదు, అనకూడదు. వారిని వారిలా ప్రేమించండి, అప్పుడు వాళ్ళు కూడా తమని ప్రేమించుకోవడం నేర్చుకుంటారు.
ఓపెన్ అయ్యేలా
మీరు మీ అమ్మాయీ కలిసి టీవీ చూడండి, పేపర్లో వచ్చిన వార్తల గురించి చర్చించండి, తనకి నచ్చిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ మీరూ ఎంజారు చేయండి. ఇలా చేయడం వల్ల మీరు మీ పాపకి మంచీ చెడూ బోధించడం తేలికవుతుంది. మీడియాలో వచ్చే ఏ మెసేజ్‌ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలుస్తుంది. మీ పాపకి కూడా మీతో ఓపెన్‌గా మాట్లాడే ఛాన్స్ లభిస్తుంది.
తననే ఎంచుకోనివ్వండి..
తన బట్టలూ, పుస్తకాలూ అన్నీ తననే ఎంచుకోనివ్వండి. తను ఏం చదువుకుంటుందో తన ఛాయిస్‌కే వదిలేయండి. తనకి కావాల్సిన దానిని అడగడం నేర్పించండి. ఇది సరైన పని కాబట్టి ఇలా చేస్తాను అనుకోవాలి కానీ, అమ్మకి ఇది ఇష్టం కాబట్టి ఇలా చేస్తాను, నాన్నకి అది నచ్చదు కాబట్టి అది చేయను అని అనుకోకూడదు. తన కెరీర్, స్టడీస్ వంటి విషయాల్లో వివరించి చెప్పవలసిన బాధ్యత మీది, నిర్ణయం తీసుకునే హక్కు మీ అమ్మాయిది.
ఆటల్లో రాణించేలా
అమ్మాయి అనగానే సంగీతం, చిత్ర లేఖనం వంటివి మాత్రమే నేర్పిస్తారు. కానీ టీమ్ స్పోర్ట్స్ పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. తనకి అలాంటి స్పోర్ట్స్ ఇష్టమైతే వాటిల్లోనే జాయిన్ చేయండి.
తనదే బాధ్యత
పిల్లల్ని వారి స్టైల్‌ని వారు ఎంచుకోనివ్వండి. మీరు ఆ స్టైల్ ఫాలో అవ్వకండి. మీ స్టైల్ మీదే, వారి స్టైల్ వారిదే. అలాగే తన కోసం తీసుకునే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వంటివి పూర్తిగా తనకే వదిలేయండి. అవి చివరికొచ్చినప్పుడు కొత్తవి తెచ్చుకోవాలి అనే ఆలోచన తనకే రావాలి తప్ప మీరూ అవే ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటే మీరు చూస్తారులే అనుకుంటారు పిల్లలు. తన విషయాలకి తనదే బాధ్యత అన్న విషయం పిల్లలకి తెలియ చేయాలి.
మెచ్చుకోండి..
మీ పాప చాలా చక్కగా రెడీ అయిందనుకోండి మెచ్చుకోండి, తప్పు లేదు. బావున్నావురా అని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోండి, అలా చేయాలి కూడా. దాంతో పాటూ తను బాగా చేసిన పనులు కూడా మెచ్చుకోండి. ఇల్లు చక్కగా ఊడ్చావురా అని అనండి. కూరలు బాగా తరిగావు అనండి, బుక్స్ నీట్‌గా సర్దుకున్నావు అని మెచ్చుకోండి. మంచిగా టెన్నిస్ ఆడతావు అని చెప్పి తన ముఖంలో ఆనందాన్ని గమనించండి.
తనకు నచ్చినవి
అందంగా ఉండడం, బాగా చదువుకోవడం, ఇంట్లో పనులన్ని వచ్చి ఉండడం మాత్రమే జీవిత లక్ష్యాలనుకునేలా అమ్మాయి ఉంటే అది తనకే నష్టం. తనని తాను ఎక్స్‌ప్రెస్ చేసుకునే విధానాలని అన్వేషించండి. వాటిలో తనకి నచ్చినవి తను చేసుకునేలా తర్ఫీదునివ్వండి.
మరొకరి గురించి..
ఇంకొకరి గురించి మీరు చెత్తగా మాట్లాడకండి, ఇంట్లో ఇంకెవరైనా మాట్లాడినా సహించకండి. అలాంటి ప్రవర్తన ఇంట్లో కుదరదు అనే విషయం ఇంట్లో ఉన్న వారందరికీ అర్ధమయ్యేలా మీ ప్రవర్తన ఉండాలి.
బయట పనులు..
తన స్కూటీ తను బాగు చేసుకోవడం, బ్యాంక్‌కి వెళ్ళి డీడీ కట్టి రావడం వంటి పనులన్నీ తనకి కూడా రావాలి. మీరు మీతో పాటు కూరల మార్కెట్‌కి మాత్రమే కాక బ్యాంక్‌కి కూడా తీసుకు వెళ్ళండి, తన కంటే చిన్న పిల్లల స్కూల్ ఫీజ్ కట్టడం లాంటి పనులకి మీతో తీసుకు వెళ్ళండి, నెమ్మదిగా ఆ పనులు తనకే అప్పచెప్పండి.
సెల్ఫ్ కేర్..
తనకి సెల్ఫ్ కేర్ని పరిచయం చేయండి. సెల్ఫ్ కేర్‌లో స్కిన్ కేర్ మాత్రమే ఉండదు, బుక్స్ చదువుకోవడం, వ్యాయామం చేయడం, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం, ఫ్రెండ్స్‌తో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేయడం, నెగెటివ్ ఆలోచనలు మనసులోకి రాకుండా కాపాడుకోవడం.. ఇలాంటి వన్నీ కూడా సెల్ఫ్ కేర్ లోకే వస్తాయి. వాటిని తనకి నేర్పించండి. అలాగే, మ్యూజియం, పెండిండ్లు, పేరంటాలు అన్నింటికీ పిల్లల్ని కూడా తీసుకు వెళ్తే వారు కొత్త విషయాలు నేర్చుకుంటారు.
రక్షణ
పై అన్నింటితో పాటూ తనకి సేఫ్టీ గురించి కూడా చెప్పండి. ఎలాంటి మోసాలు జరుగుతాయో వివరించండి. తనని భయపెట్టే విధంగా కాకుండా విషయాలు తెలిసే విధంగా చెప్పండి. బయటకి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. సోషల్ మీడియా వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియ చేయండి.