Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీ పిల్లల అల్లరిని భరించలేకున్నారా? మీరు ఏ విషయంలోనైనా వారి ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా మాట్లాడారా? వారి ప్రతిపాదనలను తిరస్కరించారా? ఇలాగైతే ఆ లేత మనసులు గాయపడి, నానా అల్లరి చేసేస్తూ, మీ స్నేహితుల ముందు బంధువుల ముందు మీ పరువు తీసేయొచ్చు! అలాంటి వాళ్ల అల్లరి చేష్టలను మొగ్గలోనే తుంచకపోతే తర్వాత వంచాలన్నా వంచలేం. అందుకే ఇలాంటి అల్లరి పిల్లల మనస్తత్వాన్ని బట్టి బ్రేకులు వేస్తేనే వారిని సరైన మార్గంలో పెట్టవచ్చు...
చిన్న పిల్లల అల్లరికి హద్దూ అదుపూ ఉండనే ఉండదు. ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే, వాళ్లేమన్నా తుంటరి పనులు చేస్తారేమోనని తల్లిదండ్రులు భయపడుతుంటారు. ఇతరుల ముందు పరువు పోగొడుతున్నారన్న మీమాంసలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ముఖ్యమైన కార్యక్రమాలకు తీసుకెళ్ళేందుకు విముఖత చూపుతుంటారు. ఇలాంటి పిల్లలను దారిలో పెట్టడం పెద్ద కష్టమేం కాదు. వాళ్ళ మానసిక ఆలోచనలకు తగినట్లుగా తల్లిదండ్రులు వ్యవహరిస్తే పిల్లల అల్లరి క్రమేపి తగ్గుతుంది. అందుకు తగిన మార్గాలను తెలుసుకుందామా.
- తల్లిదండ్రులు చెబుతున్న పనుల్లో కొన్ని పనులు చేయడానికి పిల్లలు చిరాకు పడుతుంటారు. అలాంటి పనులను పదేపదే పురమాయించడం మానుకోవాలి. చిరాకు కలిగించే పనులను పురామయించడం వలన మరింత చిరాకు పుట్టుకొచ్చి, ఆపని అంటేనే అగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. అలాంటప్పుడు తల్లిదండ్రుల సహాయం ఏమన్నా కావాలేమో కనుక్కోవాలి. అలాగే ఆ పని నుంచి వారిని మళ్ళించి, వేరే పనిలో నిమగం చేయాలి. నెమ్మదిగా ఆ పనిపై వారు ఎందుకు కోపంతో ఉన్నారో కనుక్కొని వారిని ఆ పని ఇష్టంగా చేసేలా తయారు చేసుకోవాలి. అప్పుడే పిల్లలకు అన్నింటిలో ముందుండాలనే సంకల్పం ఏర్పడుతుంది.
- పిల్లల్ని రాత్రిపూట త్వరగా పడుకునేలా తర్ఫీదునివ్వాలి. వారు గాఢనిద్రలో ఉన్నప్పుడు పిల్లలను కదిలించకూడదు. ఎందుకంటే, సంపూర్ణ్ణ నిద్ర ఆరోగ్యవంతమే కాక, మరుసటి రోజు మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది. దీనివల్ల వారిలో క్రమశిక్షణ, ఏకాగ్రత ఏర్పడతాయి.
- పిల్లలకు ఆసక్తి లేని విషయాలకు దూరంగా ఉంచాలి. అంతేకాని, మేము చిన్నప్పుడు చేయాలనుకొని చేయలేకపోయాం అనుకుంటూ వాటిని పిల్లలపై రుద్దకండి. పిల్లలకు తగినంత స్వేచ్ఛనిస్తూ, వారేం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. మీరు వారిని గమనించకపోయినా వారే వచ్చి మీ దగ్గర అన్ని విషయాలు పంచుకునేలా పిల్లలతో తల్లిదండ్రుల స్నేహం ఉండాలి. పిల్లలతో చదువుగురించే కాక, ఇతర విషయాలపై కూడా చర్చలు జరపాలి. వీటి వలన వారి ఆలోచనల్లో, అవగాహనల్లో కూడా మార్పు వస్తుంది.
- పిల్లలకు ఇష్టమైన రంగమేదో గుర్తించి, వారికి వాటిల్లో తర్ఫీదు ఇప్పించాలి. ఉదాహరణకు సంగీతం, నాట్యం, పెయింటింగ్ మొదలైనవి. ఇలా చేయడం వలన వారికి మానసిక ఉల్లాసం కలుగుతుంది. అంతేకానీ, మీ ఇష్టాయిష్టాలను వారిపై రుద్దడం వలన ఏ మాత్రం ప్రయోజనం ఉండదు.
- కుటుంబమంతా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే పిల్లలకు కిష్టమైన వస్తువులను తీసుకెళ్ళడం మాత్రం మరిచిపోవద్దు. అవి తినుబండారాలు కావచ్చు, ఆడుకునే వస్తువులు కావచ్చు, డ్రాయింగ్ బుక్స్, స్టోరీ బుక్స్, మీడియో గేమ్‌లు ఇలా ఏదైనా ఫర్వాలేదు. వాటివల్ల మీ పనుల్లో, వ్యాపకాల్లో లీనమైనా, పిల్లలకు బోర్ కొట్టకుండా వాళ్ళ కిష్టమైన బొమ్మలు వేసుకుంటూనో, గేమ్స్ ఆడుకుంటూనో గడిపేస్తారు.
ఇలా పిల్లల సైకాలజీకి అనుగుణంగా నడుచుకుంటేనే వారి భవితను బంగారుమయం చేయవచ్చు.