Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండగ అంటేనే ఆనందం... బతకమ్మ, దసరా సమీపిస్తుండటంతో అందరికీ కొత్త బట్టలు, పిండి వంటలు తయారు చేయడం... ఇలా ప్రతి ఇంట్లో సందడి నెలకొంటుంది. అంతేకాదు, పండగల వేళ ఎక్కడ చూసినా రాయితీల జోరే. అది బట్టల విషయంలో కావచ్చు, సూపర్ మార్కెట్లలో రాయితీలు కావచ్చు. కానీ వాటిని సరిగ్గా వినియోగించుకుంటే... ఆనందం మీ వెంటేనని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ముందే నిర్ణయించుకోవాలి : షాపింగ్ అంటే మాల్సే గుర్తుకువస్తాయి. మనకు కావలసిన వస్తువులన్నీ ఒకేచోట దొరికే ప్రదేశం కూడా అదే. అన్నీ ఒక దగ్గరే దొరుకుతాయి కాబట్టి వాటివైపే మొగ్గు చూపుతారు కూడా. అంతేకాదు, సమయం ఆదా. కానీ, అన్నీ ఒక దగ్గరే ఉన్నాయనే సాకుతో అవసరానికి మించి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి, అవసరాలకు తగ్గట్టుగా ఏమేం కొనాలనుకుంటున్నారో ముందే లిస్ట్ తయారు చేసుకుంటే అనవసరమైన వస్తువుల కొనుగోలు ఉండదు. మాల్స్‌లోని ఆర్భాటాలు చూసి కొంటే మీ బడ్జెట్లో కొరత ఏర్పడే ప్రమాదముంది. అసలు కొనాల్సిన వస్తువుల సంగతి మరిచిపోయి ఏది కావాలో.. ఏది వద్దో నిర్ణయించుకోలేకపోవడం వల్ల ఖర్చు తడిసి మోపెడవుతుంది జాగ్రత్త.
ఆఫర్లతో జాగ్రత్త : చాలా రీటైల్ సంస్థలు ఈ పండుగల సీజన్లో 10% నుంచి 70% వరకు డిస్కౌంట్ అని ప్రకటిస్తాయి. తీరా అక్కడి వెళ్లేసరికి దీనిపైన కేవలం 10% లేదా 15% డిస్కౌంటే ఉందని, 70% డిస్కౌంట్ కేవలం ఆ ఒక్క వస్తువు మీదే ఉందంటాడు. అప్పటికే షాపింగ్ చేసి అలసి ఉండటంతో ఇక మార్చే ఓపిక లేక షాపింగ్ పూర్తి చేస్తారు. ముఖ్యంగా అప్టు 50% అని డిస్కౌంట్ ఉన్నచోట ఎంచుకునే వస్తువుపై ఎంత డిస్కౌంట్ ఉందో ముందే అడిగి తెలుసుకోండి. సాధారణంగా చాలా షాపులు అమ్ముడు కాని బాగా ఓల్డ్ స్టాక్ మీద మాత్రమే ఎక్కువ డిస్కౌంట్‌ను ప్రకటిస్తాయి.
అంతేకాదు, కొన్ని వస్తువులపై ఉచితం ఆఫర్ కూడా ఇస్తాయి. ఉచితం అనగానే ఆలోచించకుండా కొను గోలు చేస్తారు. ఆ వస్తువు అవసరం ఉందా? లేదా? అని ఆలోచించాలి. కాబట్టి జాగ్రత్తగా కొనుగోలు చేయడం మంచిది.
దృష్టి పెట్టాలి : మాల్స్‌లో సౌకర్యాలు వినియోగదారుల దృష్టిని పక్కతోవకు పట్టిస్తాయి. ఒక పక్క మ్యూజిక్ వింటూ స్నాక్స్ నములుతూ వస్తువుల ధరలను అంతగా పట్టించుకోరు. కాబట్టి ఏదెైనా తీసుకుంటున్నప్పుడు మీ దృష్టిని ఆ వస్తువు వెైపే కేంద్రీకరించండి. బట్టల మీదున్న ధరలు ఒక్కోసారి సరిగ్గా కనిపించకపోవచ్చు. కానీ దానిని అలా వదిలేయకుండా నిశితంగా పరిశీలించి చూడాలి. అర్ధం కాకపోతే షాపువారిని అడిగి తెలుసుకోవాలి. షాపు దర్పం చూసి మొహమాటపడితే నష్ట పోయేది మీరే.
సరిచూసుకోండి :
అంతేకాదు, ఇంకొద్ది సమయంలో క్యాష్కౌంటర్కి వెళ్తాం అనుకున్నప్పుడు ఎంపిక చేసుకున్న వస్తువులన్నింటినీ ఒకసారి పరిశీలించి చూడండి. వాటిలో కొన్ని అవసరం లేదు అనుకుంటే కౌంటర్లో అయినా నిరభ్యతరంగా పక్కన బెట్టండి. కొన్ని వస్తువులు ధర తక్కువగా ఉన్నాయని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగుతుంది. వీటి కారణంగా చివరకు బిల్ ఎక్కువవుతుంది. కాబట్టి కొనే ముందు ఒక్కసారి ఆలోచించాలి.
మీరు తీసుకున్న వస్తువులకు మ్యానువల్ బిల్ ఉండ దు. ప్రతీది స్కాన్ చేసి బిల్చేసే విధానం ఇప్పుడు అంతటా అమలులో ఉంది. కాబట్టి బిల్ కరెక్ట్‌గా ఉందో లేదో తిరిగి చెక్ చేయండి. షాపింగ్‌లో ఈ మాత్రం జాగ్రత్తలు అవసరం.
- భారతి