Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''తంగేడు పువ్వా... మందార పువ్వా...
చేమంతి పువ్వా... ఓ బంతి పువ్వా...
గునుగు పువ్వా... గుమ్మడి పువ్వా...
పువ్వుల పువ్వుల పువ్వుల పండగ... నవ్వుల నవ్వుల నవ్వుల పండగ...'' అంటూ బతుకమ్మ చరిత్రను, చేసుకునే విధానాన్ని పాట ద్వారా ప్రపంచానికి చాటి చెబుతోంది కత్తి కార్తీక. ఈ అమ్మాయి కత్తి యాంకర్‌గా అందరికీ పరిచయమే. కానీ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో బతుకమ్మ చరిత్రను పాటగా మలిచి నాలుగు నిమిషాల్లో సినిమాగా చూపించిన కత్తి కార్తీకతో ఇంటర్వ్యూ...
పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లో. స్కూలు స్టడీస్ సెంయాన్స్లోనే జరిగింది. ఆర్కిటెక్చర్ చేశాను. లండన్‌లో మాస్టర్స్ చేశాను. తర్వాత రెండేళ్ళు అక్కడే ఉద్యోగం చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చి ఇక్కడే ఉద్యోగం చూసుకున్నా.
యాంకర్‌గా ఎలా మారారు?
అప్పటికి వి6 ఛానెల్ ఎయిర్ కాలే. కన్స్ట్రక్షన్ పని జరుగుతుండె. ఆ పని మీదే వి6 ఆఫీస్‌కి వెళ్లుంటి. నా మాట తీరు చూసి పక్కా తెలంగాణ మాట్లాడుతున్నానని 'యాంకర్‌గా చేస్తరా అని అడిగిండ్రు. వాళ్ళు తెలంగాణ భాషతో ఒక ప్రోగ్రామ్ చేయాలని ప్లాన్ చేస్తున్నరట. అప్పటివరకు నాకు మీడియాతో ఎలాంటి కనెక్షన్ లేదు. కెమెరా ముందు ఎలా ఉండాలో నాకు తెలియదు. ఎలా ఉంటదో అనుకున్న. 'నువ్వు ఇంట్లో ఎట్లుంటవో అట్లుండు' అంటూ నాకు స్వేచ్ఛ ఇచ్చారు. అంతేకానీ, కెమెరాని ఇలా చూడాలి, ఇలా కూర్చోవాలి, ఇలా నవ్వాలి అంటూ ఎలాంటి రూల్స్ పెట్టలేదు. నాకు నవ్వాలని పిస్తే నవ్విన... ప్రశ్నలు వేయాలనిపిస్తే వేసిన... అలా 'కత్తి కార్తీక' ప్రోగ్రామ్‌కు యాంకర్‌గా మారిన.
ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
ఎప్పుడూ మీడియాలో పనిచేస్తానని అనుకోలేదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాను. 'కత్తి కార్తీక' కార్యక్రమంలో నా మాటతీరు, తెలంగాణ భాష చూసి అలాంటి ప్రోగ్రామ్సే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు టి న్యూస్‌లో 'దిల్ సే కార్తిక', మా మ్యూజిక్‌లో 'ఈ అమ్మాయి కత్తి' కార్యక్రమాలు చేస్తున్న.
మీ వృత్తి, ప్రవృత్తి రెండూ ఇదేనా?
ఇవి చేస్తూనే... నా వృత్తిని నేను మరిచిపోలేదు. 'బి డిజైన్స్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్' పేరుతో బిజినెస్ ఉంది. దాని ద్వారా కొన్ని ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్టులు చేస్తున్న. అలాగే, ఫ్రీలాన్సర్‌గా మారి కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్న. అది తెలంగాణ కల్చర్‌ని ప్రతిబింబించేలా ఉండాలనుకున్న.
బతుకమ్మ మీద పాట చేయాలని ఎందుకనిపించింది?
ఇవాళ బతుకమ్మ మీద చాలా పాటలు వస్తున్నయి. వాటిలో బతుకమ్మ చరిత్ర తక్కువ. మన పెద్దలు ఒకొక్కరు ఒక్కోలా... చాలా కథలు చెబుతరు. అందుకే దాని చరిత్ర ఇమిడి ఉండేలా ఒక పాట చేయాలనుకున్న. వెంటనే సుద్దాల ఆశోకన్నకు ఫోన్ చేసి బతుకమ్మ మీద పాట రాయాలని అడిగిన. దానిలో ''బతుకమ్మ చరిత్ర, తెలంగాణ కల్చర్, బతుకమ్మను ఎలా తయారు చేస్తరు ఇలా అన్ని ఉండేలా నాలుగు నిమిషాల పాటలో సినిమా చూసిన అనుభూతి దిమాక్‌లో పడాలే''. అలా ఉండాలని చెప్పిన. అంతకన్నా ఎక్కువగా రాసిచ్చారు ఆశోకన్న రాసిచ్చారు. ఈ సందర్భంగా అన్నకు థ్యాంక్స్ చెబుతున్న.
ఈ పాట ఎక్కడ తీశారు?
బతుకమ్మ మీద పాట చేయాలనుకున్నప్పుడు ఎక్కడ తీయాలని ఆలోచించాం. సిద్ధిపేట దగ్గర్లోని చిన్నగుండవల్లిలో పాట షూట్ చేశాం. ఆ గ్రామ మహిళలంతా పాల్గొన్నరు. పాట చేస్తున్నన్ని రోజులు ఆ గ్రామం మొత్తం పండగ వాతావరణం వచ్చినట్లుండే. అలాగే, ఈ పాటలో తెలంగాణ మహిళా ప్రముఖులు బతుకమ్మ పట్టుకొని కనిపిస్తరు.
పాటలో వీరినే ఎందుకు ఎన్నుకున్నారు?
బతుకమ్మ మహిళల పండగ. మహిళల్లో ఒక్కో రంగంలో ప్రముఖులను తీసుకోవాలనుకున్న. వారిలో ఎం.పి కవితక్క తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మను రెగ్యులర్‌గా నిర్వహిస్తున్నరు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందరక్క. అలాగే, క్రికెట్ అంటే ఎంతో క్రేజ్ ఉంది. కానీ మహిళల క్రికెట్ అంటే అంత క్రేజ్ లేదు. మగవారితో సమానంగా వారు కష్టపడుతున్నరు, దేశానికి పేరు తెస్తరు కానీ గుర్తింపులేదు అందుకే మిథాలీరాజ్‌ను అనుకున్న, అలాగే పి.వి సింధు కూడా మంచి క్రీడాకారిణి, మంచులక్ష్మి స్వచ్ఛ హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్ సానియా మీర్జాను కూడా అనుకున్నా. కానీ ఆమె చైనాలో ఉండటం వల్ల కుదరలేదు. మగవారితో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు పోతున్నరు అనే దానికి సింబాలిక్‌గా వీరిని తీసుకోవడం జరిగింది. అలాగే, చిన్నప్పటి బతుకమ్మగా సన్నాఫ్ సత్యమూర్తిలో నటించిన పాప వర్ణిక నటించింది. ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్్ చెబుతున్న.
బతుకమ్మ పండగ చేసుకునే తీరు పట్నంకి, గ్రామానికి మధ్య తేడా ఏమైనా కనిపించిందా?
ఆ... చాలుండే. నిజంగా చెప్పాలంటే, నాకు ఊరు లేదనే ఫీలింగ్ చిన్నప్పటి నుంచి ఉండేది. కారణం మా తాతల నుంచి హైదరాబాద్‌లో ఉన్నరు. సిటీలో ఉన్నా కల్చర్‌లో తేడా ఉండదు కానీ ఊరు అన్న ఫీలింగే వేరేగా ఉంటుంది. సిటీలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఆ ఇంట్లో వాళ్లే ఆడుకుంటరు. అదే ఊర్లో అయితే, చుట్టుపక్కల వాళ్లంతా ఒకచోట కలిసి ఆడటం పండగలా ఉంటది.
అసలు, మీరు ఇంతలా తెలంగాణ భాషను ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఏమైనా ప్రాక్టీీస్ చేశారా?
లేదు. చిన్నప్పటి నుంచి తెలంగాణ భాషలోనే మాట్లాడేదాన్ని. నా భాష తీరు చూసి స్కూల్లో నా ఫ్రెండ్స్ ఎగతాళి చేసేవారు. తెలుగు టీచర్ కూడా నన్ను టార్గెట్ చేస్తుండే. చదవకపోతే... కొట్టేది. దాంతో నాకు తెలుగు మీదే భయం ఏర్పడింది. ఆ భయానికి నాకు తెలుగు చదవడం రాదు. అయినా కానీ నా మాటతీరు మాత్రం మారలే. యు.కెకి పోయినా నా మాట తీరు మారుతుందనుకున్న కానీ మారలే. అక్కడి వారినే మార్చేసి వచ్చిన.
బతుకమ్మ మీదనే పాట చేయాలని ఎందుకనుకున్నారు?
తెలంగాణ భాషని, కల్చర్‌ని, టూరిజాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇది ప్రారంభించా. ఈ భాషలో అప్యాయత, ప్రేమ ఉంటుంది. చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దాన్ని నేటి తరం, తర్వాతి తరం అందుకోవాలనే ఈ షో చేశాను. దీంతో నన్ను నేను ప్రూవ్ చేసుకున్న. ఇప్పుడు తెలంగాణలో ఉన్న టూరిస్ట్ ప్రదేశాల మీద ఒక ప్రాజెక్ట్ చేద్దామనుకుంటున్న. దానికి నా సొంత ప్రొడక్షన్ 'బి డిజైన్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్' ని కూడా ప్రారంభించా.
భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు?
ఇన్ని రోజులు స్క్రీన్ మీద చూశారు. ఇప్పుడు క్రియేటివ్ టీంతో నా సొంత సంస్థ 'బి డిజైన్స్ స్టూడియో' ద్వారా మొదటి ప్రాజెక్టు ఇది. ఇప్పుడు తెలంగాణ టూరిజం మీద ప్రతి ఒక్క ప్రదేశాన్ని ఒక డాక్యుమెంటరీ తీయాలనే కోరిక ఉంది. మన తెలంగాణలో ఎన్నో టూరిజం ప్రదేశాలు ఉన్నాయి. కానీ మనకు తెలిసినవి చాలా తక్కువ. అందుకే దాన్ని ఎక్స్పోజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్న.
ఇంటర్వ్యూ: ఆశాభారతి