Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూర్వం ఒక ఆయుర్వేద గురుకులంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ గురువు చివరగా ఒక పరీక్ష పెట్టారట. అడవిలో ఎందుకు పనికిరాని మొక్కను తీసుకురమ్మని పురమాయించారట. విద్యార్థులంతా ఎదో ఒక మొక్కను తీసుకోని వచ్చారట. ఒక విద్యార్థి మాత్రం రిక్తహస్తాలతో వచ్చాడట. ఏ మొక్క కనిపించలేదా? అని గురువు అడిగితే.. అడవంతా తిరిగినా ఔషధగుణాలు లేని మొక్క ఒక్కటి కనిపించలేదు. కొన్ని మొక్కల పత్రాల్లోనూ, మరికొన్నింటి పూలలోనూ, కొన్ని మొక్కల వేర్లలోనూ, మరికొన్ని మొక్కల గింజల్లోనూ ఇలా మొక్కలోని ఏదో ఒక భాగం ఔషధంగా ఉపయోగపడుతుంది. పనికిరాని మొక్క ఏదీ కనిపించలేదు గరువర్యా అని సమాధానం చెప్పాడట. నిజమే ఈ ప్రకృతిలో పనికిరాని మొక్క ఏదీ లేదు. గరిక నుంచి గంధం చెట్టు వరకు అన్ని పనికివచ్చే మొక్కలే.
పొలం గట్ల వెంట, రోడ్డుకు ఇరువైపుల పొదల మాదిరిగా కనిపిస్తూ.. చిన్నచిన్న గుత్తులుగా రంగురంగుల పూలు పూసే చెట్లు చాలా మందికీ తెలుసు. వీటి పేరు మాత్రం కొందరికే తెలుసు. కారణం.. వివిధ ప్రాంతాల్లో వీటి పేరు వివిధ రకాలుగా ఉంది. పులి చెట్టు, గాజు కంప, తలంబ్రాల చెట్టు, లంబాడీ చెట్టు ఇలా రకరకాల పేర్లతో పిలువబడే ఈ చెట్టు పూలు ఒకవిధమైన వాసనను వెదజల్లుతాయి.
ఇతర రాష్ట్రాలోనూ, విదేశాలలోనూ సైతం కనిపించే ఈ చెట్లును లాంటానా అని పిలుస్తారు. దీనిలో 150కి పైగా జాతులు కలవు. ఆఫ్రికా, అమెరికా ఖండాల్లో విరివిగా కనిపిస్తాయి. హిమాచల్ ప్రదేశ్ లో లాంటానా పొదలను ఫర్నీచరు తయారీలోనూ, కంచెలు నిర్మించడంలోనూ ఉపయోగిస్తారు.
ఔషధగుణాలు..
ఈ మొక్కలో చాలా ఔషధగుణాలను కనుగొన్నారు. వీటి ఆకులు యాంటీమైక్రోబియాల్ లక్షణాలు ప్రదర్శిస్తూ.. క్యాన్సర్ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతాయి. రాబిస్, ఆటలమ్మ, పొంగు, ఉబ్బసం, చర్మరోగాల చికిత్సకు ఆయుర్వేదంలో ఈ చెట్టును ఉపయోగిస్తారు.
ఈ చెట్టు నుంచి తయారుచేసిన ఔషధాలను బ్రెజిల్లో శ్వాసకోశ సంబంధమైన అంటువ్యాధులకు విరుగుడుగా వాడవచ్చని పరిశోధనల ద్వారా స్పష్టమైంది.