Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్ననాటి స్నేహితులను బతుకమ్మ కలుపుతుంది... మహిళలందరినీ ఓ చోటకు చేర్చుతుంది... అందమైన బతుమ్మ లాంటి ఆడపిల్లలు... తమ జీవితాలు చల్లంగ చూడ మంటూ కోరే ఈ బతుకమ్మ పండగ సందర్భంగా అదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ నియోజక వర్గ ఎమ్మేల్యే కోవ లక్ష్మి తన బతుకమ్మ ముచ్చట్లను మానవి పాఠకులతో ఇలా పంచుకుంటున్నారు...
వాస్తవానికి బతుకమ్మ మా గిరిజనుల సాంప్రదాయం కాదు. అందుకే మా వాళ్ళు ఎక్కువగా ఆడేవాళ్ళు కాదు. కాని నేను మాత్రం స్నేహితులందరూ బతుకమ్మ ఆడుకుంటుంటే నేను కూడా వాళ్ళతో పాటు సరదాగా వెళ్ళి బతుకమ్మ ఆడేదాన్ని. అందుకే నాకు కూడా బతుకమ్మ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. అప్పటి నుండే బతుకమ్మతో మమేకమయ్యా. బతుకమ్మ వస్తుందంటే అందరూ కొత్త బట్టలు, నగలు కొనుక్కునే హడావుడిలో ఉంటారు. ఏ పండగకు కొనకపోయినా దసరాకు మాత్రం తల్లిదండ్రులు పిల్లలకు కొత్త బట్టలు కొనిచ్చేవాళ్ళు. పండగరోజు కొత్తగా కనిపించడానికి, ఆడపిల్లలంతా అందంగా తయారు కావడానికి ఇష్టపడేవారు.
బతుకమ్మకు ప్రాధాన్యత పెరిగింది
పేదలు కూడా ఈ పండగను బాగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులు ఎంతో సరదాగా గడిచిపోయేవి. బతుకమ్మలు సాగనంపిన తర్వాత ఎంతో రుచికరమైన ఫలహారాలు కూడా పంచేవారు. చినప్పుడు పిల్లలందరం వీటి కోసం బాగా ఎదురుచూసేవాళ్ళం. అయితే తర్వాతర్వాత బతుకమ్మ ప్రాధాన్యత తగ్గిపోయింది. రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మను ప్రభుత్వం చాలా బాగా నిర్వహిస్తుంది. కేవలం మన రాష్ట్రంలోనే కాదు అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉన్న మన తెలంగాణ ప్రజలందరూ కవితమ్మ నాయకత్వంలో బతుకమ్మను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.
ఇప్పుడు పరిస్థితి మారింది
గతంలో బతుకమ్మ ఆడటానికి దళితులను రానిచ్చేవారు కాదు. అయితే ఈ పరిస్థితి ఐదారు సంవత్సరాల క్రితం వరకు ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితిలేదు. ఇప్పుడు అందరూ కలిసి బతుకమ్మ ఆడుకుంటున్నారు. అప్పట్లో ఎస్సీలపైనే ఎక్కువగా వివక్ష చూపేవాళ్ళు కాని ఎస్టీల పట్ల అంత వ్యతిరేకత ఉండేది కాదు. అందువల్ల ఇది మా సాంప్రదాయ కాకపోయినా నేను ఆడుకోగలిగాను.
నియోజక వర్గంలో ఘనంగా అప్పటి పెద్దవాళ్ళు పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చి మంచి మంచి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడేవాళ్ళు. ఆ పాటలు ఎంతో అర్థవంతగా, సామాజిక అంశాలను, ఆడపిల్లల సమస్యలను తెలియజేసేవిగా ఉండేవి. మేము కూడా ఆ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వం బతుకమ్మ సంబరాల కోసం బడ్జెట్ కూడా కేటాయించింది. దాంతో గ్రామ గ్రామంలో మహిళలందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ జరుపుకుంటున్నారు. మా నియోజక వర్గంలోని ప్రతి మండలంలో, గ్రామంలో మహిళలు ఒక చోటకు చేర్చి బతుకమ్మ సంబరాలు జరుపుతున్నాం.
ఆడపిల్ల రక్షణకే ప్రాధాన్యం
బతుకమ్మను మనం ఎందుకు ఆడుకుంటున్నామో తెలియజేయటానికి అనేక చారిత్రాత్మక కథలు ఉన్నాయి. ఇవి శాస్త్రీయమైన కథలు కూడా. ఆడపిల్లలపై నేడు జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా, ఆడపిల్లలను గౌరవించాలనే ఉద్దేశంతో బతుకమ్మ పండగ జరుపుకుంటున్నాం. అయితే గతంలో ఆడపిల్లలపై దాడులు ఎక్కువగా జరిగేవి. కాలేజీ అమ్మాయిలపై యాసిడ్ దాడులు జరిగేయి. మహిళలు గృహహింసకు గురయ్యేవారు. అయితే షీ టీమ్స్ ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న దాడులు కొంత వరకు తగ్గిపోయాయి. అందుకే అన్ని రాష్ట్రాల్లో కూడా ఆడపిల్లకు రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. మన దగ్గర సిటీ బస్సుల్లో కూడా ఆడవాళ్ళకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం జాలీలు ఏర్పాటు చేసింది. ఇలాంటివి మహిళల రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
చైతన్యం కల్పిస్తున్నాం
మహిళలపై జరుగుతున్న గృహహింసను ఇంకా నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మేము మా నియోజక వర్గంలో గ్రామ జ్యోతి లాంటి కార్యక్రమాలు నిర్వహించేటపుడు హింసను ఎలా ఎదుర్కోవాలో మహిళలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే మన పక్కన ఎవరైనా మహిళ హింసకు గురవుతుంటే చూస్తూ ఊరుకోకుండా అందరూ కలిసి ఆ మహిళకు తోడుగా నిలబడాలని చెబుతున్నాం. అప్పుడే మహిళలపై జరుగుతున్న హింస తగ్గుతుంది. ఈ బతుకమ్మ సందర్భంగా కూడా మహిళలందరికి ఇలాంటి చైతన్యం కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం.
బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దు
ఈ మధ్య కాలంలో అమ్మాయిలు సినిమాలు, సెల్ ఫోన్లు, ఫేస్‌బుక్‌ల వంటి వాటి వల్ల వాళ్ళకు తెలియ కుండానే ఎన్నో సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తల్లిదండ్రులు అప్పులు చేసి, పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తుంటారు. కాని అమ్మాయిలు కొందరు రకరకాల సమస్యల్లో చిక్కుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందుకే ఇప్పటి అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే. బాగా చదువుకోండి. మీ తల్లిదండ్రుల ఆశలు తీర్చండి. మన బంగారు తెలంగాణలో యువతకు కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. లేనిపోని ఆలోచనలతో బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దు. ఈ విషయాలను నేను పాల్గొనే ప్రతి మీటింగ్‌లోనూ చెబుతుంటా.
ఇలాంటి భావాలు అవసరం
మా అమ్మాయి అరుణ కూడా నాతోపాటు రాజకీయాల్లోకి వచ్చింది. అయితే తను రావాలని నేనైతే కోరుకోలేదు. నేను మా నాన్న కోట్నాక భీంరావ్గారు ప్రజల కోసం చేస్తున్న మంచి పనులను చూస్తూ పెరిగాను. దాంతో నాక్కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చా. ఇప్పుడు మా అమ్మాయి సర్పంచ్‌గా చేస్తుంది. ఇది అనుకోకుండా వచ్చిన అవకాశం. తను కూడా చిన్నప్పటి నుండి ఇంట్లో వాతావరణాన్ని చూస్తూ పెరిగింది. ప్రజలు, మహిళలు ఎప్పుడూ సమస్యలు చెప్పుకోవడానికి ఇంటికి వచ్చేవాళ్ళు. ఒక్కోసారి నేను లేకపోతే అరుణనే మహిళలతో మాట్లాడేది. తను చేయగలిగిన సాయం చేసేది. ఎవరైనా కష్టాల్లో ఉంటే తట్టుకోలేదు. పేదల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటుంది. మెడికల్ క్యాంప్స్ ఎక్కువగా నిర్వహిస్తుంటుంది. తనకు తానే గ్రామాలకు వెళ్ళి ప్రజలను కలిసి వస్తుంటుంది. మా అబ్బాయి కూడా కెసిఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో గ్రామాల్లో పేద ప్రజలకు బట్టలు పంచడం లాంటి కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇలా పిల్లలు కూడా ఇలాంటి భావాలతో పెరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆలోచనలు నేటి యువతలో వస్తే మన సమాజం ఇంకా అభివృద్ది చెందుతుంది.
- సలీమ