Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వచ్చిన జీతమంతా ఖర్చైపోతున్నదని, ఏమాత్రం లెక్క తెలియడం లేదని అనేకమంది బాధపడుతూ ఉంటారు. కొద్దిమంది మాత్రం ఇంటిఅద్దె, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, కిరాణాషాపులో కట్టిన డబ్బు లాంటి కొన్ని అతి ముఖ్యమైన ఖర్చులను మాత్రమే రాసుకుంటూ ఉంటారు. రోజువారీగా చిల్లరగా ఖర్చయ్యే వాటికి లెక్కలు ఉండవు. దాంతో డబ్బులు ఎలా, ఎందుకు ఖర్చవుతున్నయో లెక్కుండదు. ఇక ఆదా చేసుకోవడానికి అసలేమైనా మిగిలితే కదా!
రోజువారీగా ఎక్కడెక్కడ ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారనే విషయాలను తప్పకుండా లెక్క రాసుకోవాలి. లెక్కలు రాసుకోవడానికి సమయం దొరకడం లేదని అనుకోనవసరం లేదు. సాంకేతికాభివృద్ధి కారణంగా అందరూ మొబైల్‌లను వాడుతున్నారు. వాటిలో లెక్కలు రాసుకోవడానికి అవసరమైన యాప్‌లున్నాయి. బట్టలు కొన్నారా? ఇంటి సామాను కొన్నారా? హోటళ్ళలో ఖర్చు, బ్యూటీ పార్లర్ల ఖర్చు... ఇలాంటివన్నీ లెక్క రాసుకోవాలి. ఎంత ఖర్చవుతుందో గమనించాలి. తదనుగుణంగా మార్పులు చేసుకుంటే ఖర్చులు తగ్గించుకోవచ్చు.
నగదుతోనే కొనండి
నేడు క్రెడిట్ కార్డులు వాడటం స్టేటస్‌కు చిహ్నంగా భావిస్తున్నారు చాలా మంది. కానీ, దీని వల్ల నష్టాలున్నాయనే విషయాన్ని గుర్తించాలి. కొన్ని సార్లు బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్డుల మీద మనీబ్యాక్ని ప్రకటిస్తూ ఉంటాయి అలాంటి సమయాల్లో మాత్రమే కార్డులను ఉపయోగించడం ఉత్తమం. మామూలు సమయాల్లో ఏదైనా కొనాలనుకుంటే నగదును మాత్రమే ఇవ్వాలి. కానీ ఏదైనా వస్తువు కొనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొనాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇంట్లోనే వంట
రోజువారీ పనులతో ఒత్తిడికి లోనవుతూ ఈ రోజు బయట తినేద్దాం అనుకుంటున్నారు. అయితే మీ ఆరోగ్యం గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఎన్ని పనులతో సతమతమవుతున్నా సరే ఇంట్లోనే వంట చేసుకొని తినాలనే నియమం పెట్టుకోండి. సరదాగా ఎప్పుడైనా ఒకసారి హోటల్‌కు వెళ్లి భోజనం చేసినా, తెప్పించుకున్నా పర్వాలేదు కానీ దానినే ఒక అలవాటుగా మార్చుకోరాదు.
ఒత్తిడిలో షాపింగ్ వద్దు
మనం అనేక సందర్భాలలో రకరకాల ఖర్చులు చేస్తుంటాం. అవి ఎందుకు చేస్తామో మనకే అర్థం కాదు. ఆనందంగా ఉన్నప్పుడే కాదు, బాధగా ఉన్నప్పుడూ, ఏదైనా కారణం చేత మూడ్ పాడైనప్పుడూ కూడా అర్థం లేకుండా ఖర్చు పెడుతుంటారు చాలా మంది. ఇలాంటి వాటి వల్ల పర్సు ఖాళీ కావడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. నిజానికి ఇలాంటి సమయాల్లో వాకింగ్‌కు వెళ్లడమో, చక్కని సంగీతం వినడమో చేయవచ్చు. దానితో మళ్లీ మూడ్ ఫ్రెష్‌గా తయారవుతాం.
కొనేముందు ఆలోచించండి
ఏదైనా ఒక వస్తువును కొనాలనుకునే ముందు ఆలోచించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంతేకాదు,
కొనే వస్తువుల రేట్లను పరిశీలించండి. తక్కువకు వస్తున్నాయని అవసరం లేకపోయినా కొనడం వృథా ఖర్చే కదా! పప్పులు, బియ్యం వంటి నిలువ ఉండే వస్తువుల ధర తక్కువగా ఉన్నప్పుడే కొని నిలువ చేసుకోవడం మంచిది. ఏదైనా కొత్త వస్తువు కొనాలనుకునే ముందు ఒకటి రెండు రోజుల సమయం తీసుకోవాలి. అప్పుడు ఆ వస్తువు అవసరం లేదనిపిస్తే... మీ డబ్బులు మిగిలిపోయినట్లే కదా!
మీ అల్మారాలోకి చూడండి
కొంతమంది ప్రతి చిన్న ఫంక్షన్లకు కొత్త బట్టలు కట్టుకుని వెళ్లాలనుకుంటారు. వెంటనే షాపింగ్ చేసేస్తారు. ఇటువంటి సమయాల్లో ముందు మీ అల్మారాలోకి ఒకసారి తొంగి చూడండి. రకరకాల దుస్తులు మిమ్మల్ని అలరిస్తూ కనిపిస్తాయి. వాటిలోనుంచి ఎంపిక చేసుకోండి. వృథా ఖర్చు తగ్గిందని మీరే ఆనందపడతారు.
చిల్లర దాచుకోండి
కిడ్డీ బ్యాంకులో చిల్లర దాచుకున్న రోజులను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇదే పద్ధతిని మీ దగ్గర జమ అయ్యే చిల్లరను దాచుకోవడానికి ఉపయోగించండి. అలా దాచుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. ఏడాది తిరిగే సరికి ఎంత మొత్తమవుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు కొనుక్కోవాలనుకున్న వస్తువును హాయిగా కొనుక్కోవచ్చు.