Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండరు. ఎవరికి వారే ప్రత్యేకం. కొందరు చాలా యాక్టివ్‌గా ఉంటారు. గలగలా మాట్లాడతారు. ఇంకొందరు కామ్‌గా కూర్చుని ఉంటారు. వారిలో వారే ఆలోచించుకుంటారు. వీరినే అంతర్ముఖులు (ఇంట్రావర్ట్స్) అంటారు. అలాంటి పిల్లలను నిర్లిప్తతతో వారి మానాన వారిని వదిలేస్తారు కొందరు తల్లిదండ్రులు. వారిని మార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు మరికొందరు. కానీ ఈ రెండు పద్ధతులు మంచివి కాదంటున్నారు పిల్లల మానసిక నిపుణులు. పిల్లలను మార్చడానికి ముందు తల్లిదండ్రులు మారాలని చెబుతున్నారు.
పిల్లల్లో 30శాతం మంది పిల్లలు అంతర్ముఖులుగానే ఉంటారు. అంతర్ముఖులు అయినంతమాత్రాన వాళ్లు తెలివి తక్కువ వారు అస్సలే కాదు.. కాకపోతే వాళ్ల సామర్థ్యం బయటకి రావడానికి కొంత కాలం పడుతుందంతే! పిల్లలు ఇంట్రావర్ట్‌గా ఉండటం వారి తప్పు కాదు. అంతమాత్రాన యాక్టివ్‌గా లేని పిల్లలను తక్కువ చేసి చూడకూడదు. యాక్టివ్‌గా లేనందుకు వారిని నిందించకూడదు. పిల్లలు ఎలా ఉన్నారో అలాగే స్వీకరించండి. వచ్చినవారికల్లా 'మా పాప/బాబుకి చాలా సిగ్గు. అస్సలు మాట్లాడరు' ఇలాంటి మాటలను పదే పదే అనకండి. ఇది పిల్లల పర్సనాలిటీ డెవలప్మెంట్ను దెబ్బతీస్తుంది. ఎక్కువగా మాట్లాడనంత మాత్రాన వారికి సిగ్గని అర్థం కాదు. అర్థం లేని విషయాలు ఎందుకు మాట్లాడడం అనుకుంటారు. వారికి ఇష్టమైన పనిలో ఎంగేజ్ అయిపోతారు.
వారధిలా పనిచేయాలి...
ఏదైనా ముఖ్యమైన విషయం ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే.. దానికంటే ముందు వారితో అనుబంధం పెంచుకుంటారు అంతర్ముఖులు. ఎదుటివారిని నమ్మినప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతారు. అలాంటి అనుబంధం పెంచడానికి మీరు వారధిలా ఉపయోగపడాలి. ఇతరుల ముందు విమర్శించకూడదు. వారికి ఎంత సమయం కేటాయిస్తున్నామన్నది కాదు.. ఆ టైమ్‌లో వారితో ఎంత ఎక్కువ, ఎంత బాగా మాట్లాడుతున్నాం అన్నది చూసుకోండి. వారిలో పాజిటివ్ ఆటిట్యూడ్‌ను పెంచే మాటలనే మాట్లాడండి. మోటివేట్ చేయండి. మీ ప్రోత్సాహం వారిని బయటపడేలా చేస్తుంది. పిల్లలను వాళ్ల ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ ముందు విమర్శించకండి. ఇతర పిల్లలతో పోల్చడం అస్సలు చేయకూడదు. దీనివల్ల వాళ్లలో ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది.
బలవంతం వద్దు...
పాప బర్త్‌డే... ఫ్రెండ్స్, బంధువులు, ఇరుగుపొరుగు అంతా వచ్చారు. కానీ అమ్మాయి మాత్రం వెళ్లి... తన బెడ్రూమ్లోనే దాక్కుంది. పొద్దంతా కష్టపడి ఎంతో అరేంజ్ చేసిన తల్లిదండ్రులకు బిడ్డ తీరు కోపం తెప్పించింది. అమ్మాయి మీద అరిచారు. అంతమాత్రాన అమ్మాయిలో మార్పు రాలేదు సరికదా... పేరెంట్స్ మీద కోపం పెంచుకుంది. అందుకు కారణం తనకు పార్టీలంటే ఇష్టం లేకపోవడం కాదు.. ఎక్కువ మందిలో కలవడానికి ఇష్టం పడకపోవడం. ఎంత సేపు చదువు, మార్కులు అని మాత్రమే కాకుండా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయండి. దీనివల్ల పిల్లల సర్కిల్ పెరుగుతుంది. అయితే వెళ్లు... అందరితో మాట్లాడు అని బలవంతం చేసినట్టుగా ఉండకూడదు. వాళ్లంతట వాళ్లే సహజంగా మాట్లాడేలా ఉండాలి.
నిందించడం తగదు...
ఎందుకు అందరితో కలిసిమెలసి వుండవు అంటూ నిందించడం చేయకూడదు. ఒంటరిగా వుండే స్వేఛ్ఛ కోరుకుంటున్నారేమో ఆలోచించండి. కుచించుకుపోతున్నారని ఆందోళన పడవద్దు. ఇంట్లో స్వేఛ్చ లేదని ఫీలయ్యే అవకాశం ఉంటుంది. వారు ఒంటరిగా ఉండాలనుకున్నప్పుడు అలాగే వదిలేయండి. అనవసరమైన ఆందోళన పెట్టుకోవద్దు. ఇంట్రావర్ట్ నుంచి బయటపడి.. పిల్లలు ఎక్స్ట్రావర్ట్ అయ్యేందుకు స్కూల్లో టీచర్స్‌తో కూడా మాట్లాడండి.
నిర్ణయాధికారం ఇవ్వండి...
కొందరు తల్లిదండ్రులు పిల్లల ఆలోచనలనే పట్టించుకోరు... తాము చేయాలనుకున్నది చేస్తారు. ఇది మంచిపద్ధతి కాదు. పిల్లల భావాలను, ఎమోషన్స్‌ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తను ఆశిస్తున్నది ఒంటరిగా, ప్రశాంతంగా, తనలోకంలో తాను వుండే స్వేఛ్ఛ అని గుర్తించాలి. మీ నిర్ణయాలు వారిపై రుద్దడం చేయకండి. ఇది వారిలో నాయకత్వ లక్షణాలు పెరగకుండా చేస్తుంది. కొన్ని విషయాల్లో వారినే నిర్ణయాలు తీసుకోనివ్వండి. తల్లిదండ్రులకు ఇష్టమైనవాటిని రుద్దకుండా.. వారి ఆసక్తులేంటి, వారి బలాబలాలేంటో గుర్తించి ఆ వైపుగా సాయం చేయాలి. దానివల్ల వారు భయం లేకుండా పెరుగుతారు. ఇండిపెండెంట్‌గా తయారవుతారు.
సృజనాత్మకతవైపు మళ్లించండి...
పిల్లలను డైరీ రాయమని, బొమ్మలు గీయమని, లేదా కవిత్వం రాయమని ప్రోత్సహించండి. వాళ్లు చెప్పింది జాగ్రత్తగా వినండి. దానివల్ల పిల్లలకు మీకు మధ్య అనుబంధం ఏర్పడుతుంది. రాత్రిపూట పడుకునేముందు ప్రతిరోజూ వారితో మాట్లాడండి. ఆ రోజు ఎలా గడిచింది... పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు... వాళ్ల ఇష్టాయిష్టా లేంటి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ మాటలు మంత్రాల్లా పనిచేస్తాయి. వారితో కలిసి నవ్వండి, దగ్గరికి తీసుకుని కౌగిలించుకోండి. ఇవన్నీ పిల్లల వ్యక్తిత్వ ఎదుగుదలకు తోడ్పడతాయి.
స్పోర్ట్స్ వైపు ప్రోత్సహించండి...
ఇంట్రావర్ట్ కిడ్స్‌ని క్రీడల వైపు ప్రోత్సహించాలి. స్విమ్మింగ్, కరాటే లాంటి ఇండివిడ్యువల్ గేమ్స్ కాకుండా... ఎక్కువమంది ఆడే బాస్కెట్‌బాల్, ఫుడ్‌బాల్ వంటివాటిని ఆడిపించాలి. అందరితో కలిసి బాల్ కోసం అరవడం, పరుగెత్తడం వల్ల వారి మనసులో ఉన్న అనేక అడ్డంకులు తొలగిపోతాయి. అయితే ఆటల కోసం వారికి అంతగా పరిచయం లేని వాళ్ల ఫ్రెండ్స్ ఇంటికి పంపడానికి బదులు గా... వాళ్ల ఫ్రెండ్స్‌నే మీ ఇంటికే ఆహ్వానించండి. కొన్నిరోజులు ఇంట్లో ఆడుకున్న తరువాత లొకేషన్ ఏ పార్క్కో మార్చండి. ఆ తరువాత ఇతర పిల్లల ఇళ్లలోకి పంపండి. పరిస్థితిలో మార్పు వస్తుంది. అంతేకాదు... వాళ్లకంటే చిన్నపిల్లలతో ఆడుకునే అవకాశం ఇవ్వండి. దీనివల్ల వాళ్లు లీడర్‌గా ఫీలవుతారు. నెమ్మదిగా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
నైపుణ్యాన్ని గుర్తించండి...
సాధారణంగా ఇతర పిల్లలకంటే ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటారు ఇంట్రావర్డ్ పిల్లలు. సమస్యలను పరిష్కరించడంలో వీరిని మంచిన వాళ్లుండరు. వీరికి జీవితాంతం నేర్చుకోవాలన్న తపన ఉంటుంది. క్రియేటివ్‌గా ఉంటారు. చాలా దయార్ధ్ర హృదయులై ఉంటారు. ఎక్కువగా ఆలోచిస్తారు. చేసే పనిమీద ఫోకస్ చేయగలుగుతారు. గొప్ప అభిరుచులుంటాయి. పిల్లలు ఇంట్రావర్ట్ అని కంగారు పడకుండా వారిలో ఏ నైపుణ్యం ఉందో గుర్తించి దాన్ని పెంచేందుకు ప్రయత్నించండి. ఆత్మవిశ్వాసం దానంతట అదే వస్తుంది!