Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మా అమ్మాయి చాలా పిరికి, ఎవరితోనూ సరిగా మాట్లాడదు. కొత్తవాళ్లను చూస్తే మరీనూ.. ఇరవయ్యేళ్లొచ్చినా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేదు...'' అని చెబుతుంటారు చాలామంది తల్లిదండ్రులు. నిజమే, ఇది ఒకప్పటి సంగతి. కానీ నేడు పరిస్థితులు మారాయి. కాలం మారింది. దాంతోపాటే సమాజం మారింది. కాబట్టి, ఈ కాలం అమ్మాయిలు ఇలా ఉండకూడదు. ఉంటే.. వారిని చూసి సమాజం వెక్కిరిస్తుంది. అందుకే, వారి ప్రతి కదలికలో ఆత్మవిశ్వాసం ఉరకలేసేలా పెంచాలి. చిన్నప్పట్నుంచీ తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి. వాళ్లకు చెప్పే మాటల్లో, ఇచ్చే సూచనల్లో, పెంచే విధానంలో స్పష్టత కలిగి ఉండాలి.
అమ్మాయి అనగానే అందంగా కనిపించాలి, నాజూగ్గా ఉండాలి అనుకుంటారు. డ్రస్సులు, నగలు, మెహందీ, కాళ్ల పట్టీలు, గోళ్ల రంగుల గురించే మాట్లాడుతుంటారు. బార్బీ బొమ్మలా ఉండాలని నూరిపోస్తారు. ఇలా పెరిగితే ఆరోగ్యంగా, శక్తివంతంగా ఎలా తయారవుతారు? ఆకట్టుకునే శరీరాకృతి లేకపోయినా పర్వాలేదు కానీ.. మానసికంగా బలహీనంగా ఉండే వారిలో ఆత్మవిశ్వాసం పాళ్లు తక్కువని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే అమ్మాయిలను.. ఓ పరిధి గీసి పెంచడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించుకోవాలి. తాడాట, క్యారమ్స్, చెస్... సంగీతం, డాన్స్, చిత్రలేఖనం అమ్మాయిలవి అన్నట్టూ... క్రికెట్, కార్ బొమ్మలు, వీడియోగేమ్‌లు అబ్బాయిలకి అన్నట్టు చాలామంది ప్రవర్తిస్తుంటారు. అబ్బాయి బాగా చదువుకోవాలని, విదేశాలకు వెళ్లాలనీ, అందుకోసం ఎంతయినా ఖర్చు పెట్టాలనీ చెబుతుంటారు తల్లిదండ్రులు. అమ్మాయిలకి ఓ వయసు వచ్చినప్పటి నుంచీ ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అంటుంటారు. ఎందుకిలా? ఈ విశాల ప్రపంచంలో తమ కాళ్లపై తాము నిలబడేలా.. అబ్బాయిలూ, అమ్మాయిలూ ఒకటేనన్న భావం కలిగేలా పెంచాలే కాని పిరికితనాన్ని కాదు వారికి నేర్పాల్సింది. అందుకే వారు జీవితంలో ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకుని సాధించుకునేలా వెన్నుతట్టండి.
స్పందించే తీరు నేర్పాలి
అమ్మాయిలను ఒంటరిగా.. దగ్గర్లో ఉన్న షాపుకి పంపించాలన్న భయపడుతుంటారు. పిల్లల్ని ఒంటరిగా బయటకు పంపుతున్నప్పుడు వారికి సామాజిక చొరవ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరు అలవాటు చేయాలి. అప్పుడే భద్రంగా, ధైర్యంగా ఉండగలుగుతారు. పిల్లలకు చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు చూపిస్తే ఇట్టే ఐసైపోతారు. వాటినే ఎరగా వేసి తీసుకెళ్లే దుండగులూ ఉంటారు. అందుకే నీకేం కావాలన్నా నేను కొనిపెడతా. ఎవరైనా ఇస్తానంటే తీసుకోవద్దు అని ముందుగానే చెప్పండి. అపరిచితులెవరైనా వాటిని ఇవ్వబోతుంటే తనకిష్టం ఉండదు అని చెప్పమనండి. బలవంతం చేస్తుంటే దగ్గర్లో ఉన్న పెద్ద వాళ్లకి చెప్పమనడం లేదంటే గట్టిగా అరవడం చేయమనాలి. స్కూలుకెళ్లేప్పుడయినా, బజారు కెళ్లినా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని వారికి చెప్పండి. బహిరంగ ప్రదేశాలూ, రోడ్లపై పాటించాల్సిన నియమాలను వారికి అర్థమయ్యేట్లు చూపించండి. వీలున్నప్పుడు బయటకు తీసుకెళ్లి బస్సులు ఎక్కే విధానం, టికెట్ తీసుకోవడం, గమ్యస్థానాన్ని ఎలా చేరుకోవాలో వారికి ప్రత్యక్షంగా తెలియజెప్పండి. ఎప్పుడైనా పిల్లల్ని బయటకు పంపుతున్నప్పుడు.. వారికి ఓ పాస్వర్డ్, లేదా కోడ్ చెప్పి పంపాలి. ఎవరైనా తమతో రమ్మని చెప్పినప్పుడు కోడ్ అడగమనాలి. అమ్మానాన్నలు చెప్పినదానికి అది జత కలిస్తేనే వారితో వెళ్లాలి. లేదంటే వారిని నమ్మకూడదని తెలియజెప్పాలి.
మంచి మిత్రుల్ని అందించాలి
ఇరుగుపొరుగు వారితో కలిసి ఆడుకోవడం పిల్లలకు మానసికంగా, శారీరకంగా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు.. అయితే వాళ్లతో మీ పిల్లలు ఎలా మెలుగుతున్నారన్నది గమనిస్తూ ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేయాలి. ఆటలాడేటప్పుడు ఇతర పిల్లలతో ఏదైనా సమస్య వస్తే.. పెద్దల దృష్టికి తీసుకురావాలని చెప్పాలి. స్నేహితులతో మన పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందనేది ముఖ్యమే. దాంతోపాటూ మన పిల్లలతో వారి ప్రవర్తన ఎలా ఉంటుందన్నదీ గమనించాలి. కొందరు ఏడిపించడం, మాటలతో రెచ్చగొట్టడం చేస్తుంటారు. ఇలాంటప్పుడు ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అందుకే వాటిని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి. అంతేకాదు, మౌనంగా ఉండి, ఎవరితో కలవని వారిని పిల్లలు వారి ఆటల్లో చేర్చుకోరు. దీనివల్ల పిల్లల్లో ఆత్మన్యూనత ఆవరిస్తుంది. 'నేను దేనికీ పనికిరాను' అన్న భావన ఏర్పడుతుంది. కాబట్టి తోటి వారితో కలిసిపోయి సరదాగా, ఉత్సాహంగా ఉండటం, కబుర్లు చెప్పడం, ఇంటికి పిలవడం వంటివి మీ పిల్లలకు నేర్పించాలి. అప్పుడు ఆటనూ.. తోటివారి సాహచర్యాన్నీ ఆనందించగలుగుతారు. మంచి మిత్రులను పొందగలుగుతారు.
శారీరక మార్పుల గురించి వివరించాలి..
పిల్లలు.. చూస్తూ చూస్తూనే పెరిగిపోతారు. అందుకే వయసుతో పాటు శారీరకంగా వచ్చే మార్పులను వివరించాలి. ముఖ్యంగా అమ్మాయిల్లో శారీరకంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి మీ అమ్మాయికి మార్గదర్శకురాలైన అమ్మగా ఆ బాధ్యత మీదే. మానసికంగా వారికి దగ్గరవ్వాలి. అప్పుడే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారు ఆనందంగా, ఆరోగ్యంగా పెరుగుతారు. ముఖ్యంగా టీనేజ్‌లో అమ్మాయిలు మానసికంగా ఎంతో ఆందోళన చెందుతుంటారు. కొంతమంది లోలోపల భయపడుతూ.. చదువుమీద దృష్టిపెట్టలేకపోతారు. కాబట్టి, అత్యంత సహజమైన ఆ మార్పుల గురించి ముందే తల్లిదండ్రులు వివరించి చెప్తే.. ఎలాంటి సంకోచాలు, సందేహాలు లేకుండా అమ్మాయిలు తమ చదువు, ఆటపాటలను ఆనందంగా కొనసాగించగలుగుతారు.
ఇద్దరి మధ్య చక్కటి సయోధ్య
ఈ తరం పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ప్రతి విషయంలో జనరేషన్ గ్యాప్ అడ్డం వస్తోంది. ఒకరితో మరొకరు నిస్సంకోచంగా, స్నేహంగా ఉండలేకపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు పెరిగే పిల్లల్తో ఎక్కువగా గొడవపడుతూ ఉంటారు. వాళ్ల అల్లరితోపాటు ఆలోచనల్నీ కంట్రోలు చేయాలనుకుంటారు. పిల్లలు ఎక్కడ తప్పుదోవపడ్తారోనని కాపలాకాయడం, అనుమానంగా చూడడం, వాళ్లు చేసే ప్రతి పనిలో తప్పులెన్నడం లాంటివి చేస్తుంటారు. ఇది పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య అంతరాన్ని పెంచుతుంది. దాంతో పిల్లలెప్పుడూ తమ భావాలను మనసు విప్పి చెప్పుకోలేకపోతారు. తమ మీద తాము నమ్మకాన్ని కోల్పోతారు. ఈ తరహా పెంపకం పిల్లల జీవన దృక్పథాన్నే మార్చేస్తుంది. అందుకే, పిల్లల పాలిట శాసకులుగా కాక స్నేహితులుగా మారండి. వారిపై అధికారం చలాయించే వారుగా కాక అనునయంతో పలకరించే ఆత్మీయులుగా మెలగండి.
తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ప్రతిరోజు కొంత సమయం సరదాగా గడపడం మంచి అలవాటు. ఇప్పటివరకు మీకాలవాటు లేకపోతే వెంటనే మొదలుపెట్టండి. వారితో చదువు గురించే కాక ఇతర విషయాల గురించీ చర్చిస్తూ ఉండండి. పెరిగే పిల్లల్లో రకరకాల భావాలు కలుగుతుంటాయి. కుటుంబంలో చక్కటి సయోధ్య ఉండి తల్లిదండ్రులు, పిల్లలు సరదాగా గడుపుతున్నట్లైతే.. ఎంతటి సున్నిత అంశాలనైనా మీతో చర్చిస్తారు. ఈ మార్పు కొత్తగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి చక్కని వేదికలా ఉపయోగపడుతుంది. సాధ్యమైనంతగా ఆమె సందేహాలు తీర్చడానికి ప్రయత్నించండి. ఆమె కోసం ఏం చేయడానికైనా మీరు సిద్ధంగానే ఉన్న విషయం తెలిసేలా ప్రవర్తించండి. ఇది ఆమెలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
ఆశా భారతి