Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్పనా చావ్లా ఆ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ధైర్యం. అంత రిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళగా ఘనత సాధించిన ఆమె... అంతరిక్షంలో చిన్న పొరపాటు జరిగినా బూడిద కూడా మిగలదని తెలిసినా... మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించి మళ్ళీ ఆకాశానికే ఎగిసింది. భౌతికంగా మరణించినా... ఎన్ని సంవత్సరాలైనా చిరస్థాయిగా నిలిచిపోయే 'కల్పనాచావ్లా' జీవితం మీకోసం..
కల్పనా చావ్లా జీవితంలోకి తొంగి చూస్తే... ధైర్యసాహసాలకు మారు పేరుగా కనిపిస్తుంది. 'ఏరోస్పేస్ ఇంజనీరింగ్' చేయాలన్న ఆశతో హైస్కూల్ నుంచే ఎన్నో కలలు కనింది. దాన్ని సాకారం చేసుకుంది కూడా. రోదసీ లోకి వెళ్ళే ముందు నాసాకి కల్పన ఇచ్చిన ఇంటర్వ్యూనే దీనికి తార్కాణం. ''మేం హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు కర్నాల్ అనే చిన్న ఊర్లో ఉండేవాళ్లం. ఆ ఊర్లో ఫ్లయింగ్ క్లబ్ ఉండటం చాలా కలిసి వచ్చింది. నేనూ, మా సోదరుడు సైకిల్ తొక్కుతూ ఊళ్ళో తిరుగుతుంటే ఆకాశంలో పుష్పక్ విమానాలు కన్పించేవి. ఇద్దరికీ వాటిల్లో ప్రయాణించాలని ఉండేది. ఒకసారి నాన్నను అడిగితే ఫ్లయింగ్ క్లబ్‌కు తీసుకువెళ్లి
ఆ విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి ఇదే నాతొలి అనుభవం. ఎదిగే కొద్దీ జె.ఆర్.డి టాటా గురించి కూడా తెలిసింది. తొలిసారి మనదేశంలో విమానాలను నడిపింది ఈయనే. ఆనాడు టాటా నడిపిన విమానాన్ని కూడా చూశాను. విమానాన్ని చూసిన రోజుల్లో ఆయనేం చేసిందీ తెలుసుకోగానే నా ఆలోచనలు అలా అలా మబ్బుల్లో తేలిపోయాయి. ఏరోస్పేస్ చదవాలన్న ఆశ ఈయన గురించి తెలుసుకోగానే బలపడింది కూడా. హైస్కూల్లో చదువుతున్నప్పుడు నువ్వు ఏం కావాలని అనుకుంటున్నావని అడిగితే టక్కున 'ఏరోస్పేస్ ఇంజనీర్' అని చెప్పేదాన్ని. అది నాకింకా గుర్తే. టెన్త్ తర్వాత ఇంటర్లో ఎం.పి.సి చేరా. ఆ తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో సీటు వచ్చింది. అప్పట్లో నా లక్ష్యం ఏరోస్పేస్ ఇంజనీర్ కావడమే. వ్యోమగామి అవుతానని కలలో కూడా ఊహించలేదు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్ కావాలని కోరుకున్నాను. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం కూడా క్లాసులో అడిగినప్పుడు 'ఫ్లైట్ ఇంజనీర్' అవుతాను అని చెప్పాను. అప్పట్లో ఫ్లైట్ ఇంజనీర్ అంటే ఏం చేస్తారో కూడా నాకు అవగాహన లేదు. నేను అనుకున్న ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్కూ, ఫ్లైట్ ఇంజనీర్‌కూ సంబంధం లేదు. వ్యోమగామిగా ఒకరకంగా నేను చేస్తుంది ఫ్లైట్ ఇంజనీర్‌గానే... ఇంజనీరింగ్ కాలేజీలో నాతో పాటు ఏడుగురు అమ్మాయిలు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసింది నేనొక్కదాన్నే. ఏరోస్పేస్ ఇంజనీర్ కావాలను కున్నప్పుడు మా ప్రిన్సిపల్ వద్దన్నారు. చాలా కష్టమని, ఎలక్ట్రికల్ గానీ, మెకానికల్ గానీ తీసుకోమన్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇవ్వండి లేదంటే ఇంటికి వెళ్ళిపోతానంటూ చెప్పాను. చివరికి ఇవ్వక తప్పిందికాదు. నీకు అందుబాటులో ఉన్నదీ లేదూ అని కాదు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ వైపు మాత్రమే ప్రయాణించాలి. అని మాత్రమే నేను యువతకు సూచించగలను''. అంటూ చెప్పారు.
ఈ మాటలు ఆమె వ్యక్తిత్వానికి ప్రతీకలు. కల్పనాచావ్లా హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో పుట్టి పెరిగింది. పంజాబ్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదివి, ఆపై ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. అక్కడే నాసా అంతరిక్ష పరిశోధన శిక్షణా కేంద్రంలో స్థానం సంపాదించుకుంది. 'నాసా' నుండి అంతరిక్షయానానికి ఎంపికయింది. మొదటిసారిగా 1997లో తొలిసారి అంతరిక్షయానం చేసి ఆసియాలో తొలి మహిళా వ్యోమగామిగా ఘనత సాధించింది. ''పరిస్థితులు ఎలాగున్నా కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం'' అన్న కల్పన తండ్రి మాటలే ఆమె జీవితంలో వ్యోమగామిగా, అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదగడానికి పునాదిగా ఉపకరించాయి. 2003లో కొలంబియా అంతరిక్ష నౌకలో రోదసిలోకి అక్కడ చేయవలసిన పరిశోధనలను దిగ్విజయంగా నిర్వహించి భూమి మీదకు తిరిగి రావటానికి సిద్ధమయింది. ఆమెను తీసుకొస్తున్న కొలంబియా వ్యోమనౌక కొన్ని క్షణాల్లో భూమి మీదకు దిగవలసిన సమయంలో పేలిపోయింది. అనుకోని ఈ దుర్ఘటనకు ప్రపంచమంతా దిగ్భ్రాంతికి లోనయింది. ఇలా అంతరిక్ష రంగంలో భారతదేశ ఖ్యాతిని తన ప్రతిభాపాటవాలతో ప్రపంచ మంతా చాటి కనుమరుగైన కల్పనా చావ్లా ధ్రువతారగా అందరి మదిలో నిలిచిపోయింది.