Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె గొంతులో జానపదం జాలువారుతుంది. ఫాస్ట్‌బీట్ పరవళ్లు తొక్కుతుంది. మెలొడీ పాడిందంటే విన్నవాళ్లు మైమరిచిపోవాల్సిందే! ఆ గాయనీమణి ఉమానేహ. కో సింగర్స్ ముద్దుగా ఊహా అని పిలుచుకునేంత ఆత్మీయురాలు. 'టెంపర్'నుంచి 'జ్యోతిలక్ష్మి', 'పైసావసూల్'దాకా టైటిల్సాంగ్స్తో మంచి ట్రాక్ రికార్డ్ సాధించింది. ఎలాంటి సంగీత నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చినా... నేపథ్యగాయనిగా మంచి పేరు సంపాదించుకున్నది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో 200 దాకా పాటలు పాడిన ఆ యంగ్ సింగర్‌తో మానవి చిట్‌చాట్.
పాటమీద ఇష్టం ఏ వయసు లో ఏర్పడింది?
మాది కర్నూల్. నాన్నగారు కృష్ణ, బ్యాంక్ ఎంప్లారు. తరువాత బిజినెస్‌లోకి మారిపోయారు. అమ్మ దుర్గమ్మ గృహిణి. నాన్నగారు పాటలు పాడేవారు. వృత్తిరీత్యాగాయకుడు కారు. కానీ ఇంట్లో సంగీత వాతావరణం ఉండేది. నిత్యం లతామంగష్కర్, ఘంటశాల, బాలుగారి పాటలు వినిపిస్తూ ఉండేవి. రోజుకో క్యాసెట్ పెట్టి వినిపించేవారు నాన్న. అలా ఊహ తెలిసినప్పటి నుంచే సంగీతంతో సాన్నిహిత్యం ఏర్పడింది. నేను మొట్టమొదటిసారి నేర్చుకున్నపాట 'సత్యం శివం సుందరం' సినిమాలోని టైటిల్ సాంగ్. ఇక స్కూల్లో ప్రేయర్ నాతోనే పాడించేవారు టీచర్స్. 'వాయిస్ బాగుంది ఈ పాటలు నేర్చుకో' అని చెప్పి మరీ పాటలు ఇచ్చేవారు. వాళ్ల నమ్మకం, తరువాత వివిధ పోటీల్లో పాడటం బహుమతులు గెలుచుకోవడంతో నాకు తెలియకుండానే సంగీతంపై ఇష్టం పెరిగింది. కర్నూల్ దగ్గరలో ఉన్న శారద సంగీత కళాశాలలో చేరాను. నా గురువు శ్రీమతి సరస్వతిగారు. శాస్త్రీయ సంగీతం అంటే తెలిసిందక్కడే. మా ఇంటినుంచి అక్కడికి 20కి.మీటర్లకు పైగా ఉండేది. పొద్దున్నే ఆరు గంటలకు క్లాస్. నేను ఐదుగంటలకల్లా రెడీ అయి.. సైకిల్‌మీద వెళ్లి ఆరుగంటలకల్లా అక్కడికి చేరుకునేదాన్ని. ఏడున్నర, ఎనిమిదికి క్లాస్ అయిపోగానే బయలుదేరి ఇంటికొచ్చి రెడీ అయ్యి స్కూల్కువెళ్లేదాన్ని. రెండేండ్లపాటు ఇదే నా దినచర్య. అప్పటికి మ్యూజిక్ మీద నాలెడ్జ్ లేదు. ప్యాషన్ ఉంటే ఇష్టపడి చేసేదేదీ కష్టం అనిపించదు. సంగీతం మీద ఆసక్తి ఏదో నన్నలా నడిపించింది. డిగ్రీదాకా కర్నూల్లోనే చదివాను.
సంగీతమే నా కెరీర్ అని ఎప్పుడనుకున్నారు?
సంగీతాన్ని కెరీర్‌గా తీసుకుంటానని అనుకోలేదు. ముందు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం ఉండేది. కర్నూల్లో చాలా స్టేజ్ షోస్ చేశాను. అది విన్నవాళ్లు చాలా మంది 'మీరు పాడినప్పుడు విన్నాం, మా ఆర్కెస్ట్రాలో పాడతారా' అని అడిగారు. మా నాన్నగారు ఒప్పుకోలేదు. ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో... కొన్ని విషయాల్లో అంత స్ట్రిక్ట్. 'పాడగలిగిన సత్తా ఉంది. ఒకసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది?' అని బ్రతిమిలాడటంతో ఒకే చెప్పారు. కర్నూల్లో చుట్టుపక్కల ఏరియాస్‌లో వందల్లో షోస్ చేశాను. ఆ ఎక్స్‌పీరియెన్స్ తరువాత స్టేజ్ షోస్ చేయడానికి, పాడటానికి పనికొచ్చింది. కానీ ఈ ఫీల్డ్‌కు రావడం, పేరు కూడా రావడంతో ఇటువైపు వచ్చాను. 2009-10 మధ్యలో అనుకుంటా.. సూపర్ సింగర్ రియాలిటీషోలో అవకాశం వచ్చింది. దాంతో హైదరాబాద్‌కు వచ్చాను.
తొలినాళ్లలో హైదరాబాద్ ఎలా ఉంది?
ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ. కొత్త ప్లేస్. అంతా కొత్తగా ఉండేది. ఇక్కడ సెట్ అవుతానో లేదో, సెటిల్ అవుతానో లేదో తెలియదు. నా ప్రయత్నం నేను చేశాను. చాలా స్ట్రగుల్ అయ్యాను. మాది మధ్య తరగతి కుటుంబం. కర్నూల్లో ఎలాంటి సమస్యలు లేవు. తిండికి ఇబ్బంది పడ్డ రోజులు అస్సలే లేవు. కానీ ఇక్కడికొచ్చాక ఆ సమస్యలు చూశాను. టైమ్‌కు ఏదీ ఉండేది కాదు. డబ్బులు లేకపోతే నడవదు కదా. సినిమాల్లో పాడితే పేరు వస్తుంది, డబ్బులు వస్తాయన్న ఆలోచన కూడా అప్పట్లో నాకు లేదు. సూపర్‌సింగర్స్ రియాలిటీషోలో పాడిన తరువాత ఫోన్స్ వచ్చేవి 'బాగా పాడుతున్నావు' అని. అప్పుడు ఇక్కడ ఇంట్లో టీవీ కూడా లేదు. ఏం పాడుతున్నానో, ఏం టెలికాస్ట్ అయ్యిందో కూడా తెలియకపోయేది. ఇప్పటికీ నేనుపాడిన కొన్ని ఎపిసోడ్స్ చూడలేదు. సూపర్‌సింగర్స్ తరువాత నేేను మొదట 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' ఛానల్‌కు ప్రమోషనల్ సాంగ్ 'వేగుచుక్క' పాడాను. అది నా మొదటి రికార్డింగ్.
సినిమాల్లో అవకాశాలు ఎలా వచ్చాయి?
ఆ పాట విన్న చక్రిగారు పిలిచి.. కంఠీరవ (సింహాద్రి కన్నడలో రీమేక్) సినిమాలో పాట పాడమన్నారు. 'బాగుంటే ఉంచుతాను... లేకపోతే లేదు' అని చెప్పారు. కానీ మొత్తం పాడాక 'కన్నడ గాయనిలాగే పాడావు... నీకు మంచి భవిష్యత్ ఉంది' అని దీవించారు. తరువాత 2012లో ఆయనే 'నా ఇష్టం'సినిమాలో అవకాశం ఇచ్చారు. మెల్లగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. కానీ ఆ రెండేండ్లు చాలా స్ట్రగుల్ అయ్యాను. అలా అని ఖాళీగా ఉండలేదు. ఆల్బమ్స్, డివోషనల్, ఫోక్.. అన్నిరకాల సాంగ్స్ పాడేదాన్ని. ప్రతి రికార్డింగ్ ఒక లర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్. నాకు నచ్చిన సాంగ్ 'టెంపర్'సినిమాలో టైటిల్ సాంగ్. 2015లో రిలీజ్ అయ్యింది. టీవీల్లో ప్లే అవ్వడం, డ్యాన్స్ కూడా బాగుండటంతో నాకు బాగా పేరు తెచ్చింది. దాని తరువాత అవకాశాలు పెరిగాయి. తరువాత ఒక ఏడాదిలోనే 25 సినిమాలకు పాడాను. అందులో టైటిల్ సాంగ్స్ ఎక్కువ. 'జ్యోతిలక్ష్మి', 'అఖిల్', 'శంకరాభరణం', 'బెంగాల్‌టైగర్', 'బాబు బంగారం' ఇలా వరుసగా అవకాశాలు వచ్చాయి. రీసెంట్గా వచ్చిన 'పైసావసూల్' సినిమాలోలో టైటిల్సాంగ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వయసుల వాళ్లకు నచ్చింది. పైసావసూల్ టీమ్‌కి ధన్యవాదాలు. పూరీగారు, అనూప్రూబెన్స్గా, బాలయ్యగారు, ఛార్మీ అందరూ చాలా సపోర్ట్ చేశారు.
మీకు నచ్చిన గాయనీగాయకులు? సంగీత దర్శకులు?
గాయనీగాయకుల్లో ఒక్కొక్కరిలో ఒక్కో శైలి ఉంటుంది. చిత్రగారు, బాలుగారు, జానకిగారు, లతా అమ్మ.. అందరి పాటలు ఇష్టం. ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్‌ది ఒక్కో ప్రత్యేకత. కీరవాణిగారు, మణిశర్మ, అనూప్‌రూబెన్స్, థమన్, శేఖర్‌చంద్ర, సునీల్ కశ్యప్ అందరి దగ్గరా పాడాను. అందరికీ థ్యాంక్స్. దేవిశ్రీగారు నాకు ఇన్సిపిరేషన్. ఆయన స్టేజ్ ఫర్మాఫర్మెన్స్ బాగుంటుంది. ఇళయరాజాగారి దగ్గర పాడాలని ప్రతి ఒక్కరి కల. అలాంటిది నాకు తొలినాళ్లలోనే ఆయన దగ్గర పాడే అవకాశం వచ్చింది 'ధనం' అనే డబ్బింగ్ మూవీలో. వీటన్నింటితోపాటు ఈటీవీ సూపర్సమస్తీ కార్యక్రమం కోసం నెలరోజులపాటు గాయనీగాయకులందరితో కలిసి టూర్ చేశాం. సీనియర్లతో కలిసి అలా ఉండటం, పాడటం వల్ల చాలా నేర్చుకున్నాను.
పాడటానికైనా, వినడానికైనాఏ జోనర్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారు?
నాకు అన్ని జోనర్స్ ఇష్టం. చిన్నప్పటినుంచి అన్ని పాటలు విన్నాను, అన్ని రకాల పాటలు పాడాను. 'ఇది పాడాలి. అది పాడకూడదు' అని ఏమీ లేదు. మాస్, క్లాస్, మెలొడీ, ఫోక్, వెస్ట్రన్.. అన్నీ ఇష్టం. అన్ని జోనర్స్ పాడుతూ ఉంటాను. రెండేండ్లుగా హిందుస్తానీ నేర్చుకుంటున్నాను. నా వరకు పాడటం అనేది ఓ డివైన్ ఫీలింగ్. పాటలో ఫీల్ బాగుంటే.. పాటకు శ్రోతలు కనెక్ట్ అవుతారు.
ఇన్నేళ్లలో ప్రయాణంలో మీ అనుభవాలు? కష్టసుఖాలు?
తొలినాళ్లలో నేను అందరితో ఓపెన్‌గా మాట్లాడేదాన్ని. మొదట నా సమస్యలను కూడా కొంత షేర్ చేసుకున్నాను. కానీ అది చాలా మందికి క్యాజువల్ టాక్లాగా, చర్చలాగా అయిపోయింది. నేనేమీ విక్టిమ్ కాదు. లైఫ్‌ను ఛాలెంజ్‌లా తీసుకుని వెళ్తున్నాను. నేను వచ్చింది ఎందుకు? ఈ చర్చ ఎందుకు? టైమ్ వేస్ట్ అని.. ఎవ్వరితో ఏదీ షేర్ చేసుకోవడం మానేశాను. అయినా అందరితో హార్ట్‌ఫుల్‌గా ఉంటాను. నా వర్క్ నేను చేసుకుంటూ పోతాను. ఇక్కడ హార్డ్‌వర్క్ ఒక్కటే సరిపోదు, టాలెంట్, డెడికేషన్, ఆటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. అందమైన గులాబీకి ముళ్లు ఎలా ఉంటాయో... అలాగే నాకు హర్డిల్స్ వచ్చాయి. అంతే బ్యూటిఫుల్ మెమరీస్ కూడా ఉన్నాయి. ఇండిస్టీకి వచ్చిన కొత్తలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నానో.. ఇప్పుడు అలాగే ఉన్నాను. కాకపోతే అప్పుడు ఏమీ తెలియని ఓ బ్లైండ్నెస్ ఉండేది. కానీ పరిస్థితులు మనకు అన్ని నేర్పిస్తాయి కదా!
గ్రేట్ ఫీలింగ్....
రామ్‌గోపాల్‌వర్మగారు అంత సులభంగా ఎవ్వరినీ మెచ్చుకోరు. అట్లాంటిది ఓ ఇంటర్వ్యూలో 'మీకు నచ్చిన సింగర్స్ ఎవరు' అని యాంకర్ అడిగినప్పుడు.. 'శ్రేయాఘోషల్, ఉమా నేహ' అని చెప్పడం గ్రేట్ ఫీలింగ్. నేను లోలో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేసినవాళ్లందరికీ థ్యాంక్స్. నా ఫస్ట్ గురు సరస్వతిగారు, ఇక్కడికొచ్చాక రమాప్రభగారు, రామాచారిగారు, లలితా కురోల్కర్గారు.. మ్యూజిక్ డైరెక్టర్స్.. వీళ్లందరి దగ్గరా ఎంతో నేర్చుకున్నాను. అందరికీి రుణపడి ఉంటాను. మనలను మనం జడ్జ్ చేసుకున్నంత ఎవ్వరూ జడ్జ్ చేయలేరు. కాబట్టి 'బీ యువర్ సెల్ఫ్, బీ కాన్ఫిడెంట్, బీ పేషెంట్' అనుకుంటాను.
- కట్ట కవిత