Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంకాయ కూరంటే బోరా..! కానీ 'ఆహా ఏమి రుచీ.. అనరా మైమరిచి.. రోజూ తిన్నా మరీ.. మోజే తీరనిదీ.. తాజా కూరలలో రాజా ఎవరంటే... ఇంకా చెప్పాలా వంకాయేనండీ' అంటూ ఎగిరే పావురమా సినిమాలో వంకాయపై పాడే పాట వింటే ఎవరికైనా వంకాయ కూరమై మోజు పుట్టాల్సిందే. అలాంటి వంకాయలతో చేసిన కొన్ని వెరైటీ వంటకాలు ఈ వారం మీ కోసం...
వంకాయ కుర్మా
కావలసిన పదార్ధాలు: చిన్నవి, గుండ్రని వంకాయలు- పావుకిలో, ఉల్లిపాయలు- రెండు, అల్లం, వెల్లుల్లి- టీస్ఫూన్లు, పెరుగు- అరకప్పు, కొబ్బరిపొడి- రెండు టేబుల్ స్ఫూన్లు, జీలకర్ర పొడి - అరటీస్ఫూను, మెంతిపొడి - పావుటీ స్పూను, దనియాల పొడి- టేబుల్ స్పూను, పల్లీలు- మూడు టేబుల్‌స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, కారం - టేబుల్ స్పూను, జీలకర్ర- పావుటీ స్పూను, మెంతులు - చిటికెడు, కరివేపాకు- రెండు రెబ్బలు, ఉప్పు - తగినంత, కొత్తిమీర- కొద్దిగా, నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం: వంకాయలను విడిపోకుండా నాలుగు ముక్కలుగా గుత్తివంకాయ మాదిరిగానే చీల్చి ఉప్పునీళ్లలో వేసి ఉంచాలి. తర్వాత బాణలిలో ఓ స్పూను నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మెత్తబడే వరకూ వేయించి తీసి పక్కన పెట్టాలి. తర్వాత పల్లీలు, నువ్వులు కొద్దిగా వేయించి పొడి చేయాలి. కొబ్బరి పొడి, దనియాల పొడి, జీలకర్రపొడి, మెంతిపొడి, పల్లీ పొడి అన్నీ కలపాలి. అందులో వేయించిన ఉల్లిపాయలు, పసుపు, కారం, అల్లంవెల్లుల్లిముద్ద, పెరుగు, కొత్తిమీర కలిపి మెత్తగా రుబ్బాలి. నీళ్ళలో వేసిన వంకాయలను తీసి నూరిన ముద్దను కొంచెంకొంచెంగా కూరి మిగిలినది పక్కన ఉంచాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించిన బాణలిలోనే మిగిలిన నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. తరువాత కూరిన వంకాయలు వేసి వెంటనే మూతపెట్టాలి. తక్కువ మంటమీద ఉడికించాలి. వంకాయలు మెత్తబడ్డ తరువాత మిగిలిన ముద్దలో కాసిని నీళ్లు కలిపి పలుచగా చేసి కూరలో పోసి నూనె తేలేవరకూ ఉడికించాలి. అంతే పసందైన వంకాయ కుర్మా రెడీ.
వంకాయ శనగపప్పు కూర
కావాలసిన పదార్ధాలు: వంకాయలు- పావుకిలో, శనగపప్పు- అరకప్పు, ఉల్లిపాయ- ఒకటి, కరివేపాకు- రెండు రెబ్బలు, అల్లంవెల్లులి- టీ స్పూను, పసుపు- పావు టీ స్పూను, కారం- టీ స్పూను, ఉప్పు - టీ స్పూను, గరంమసాలా- పావు టీ స్పూను, నూనె- మూడు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం: శనగపప్పును కడిగి నానబెట్టాలి. వంకాయలను ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలి. ఉల్లిపాయలను సన్నగా తరగాలి. పాన్ తీసుకుని నూనె వేసి కాగాక ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, శనగపప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత వంకాయ ముక్కలు, ఉప్పువేసి కలిపి మూతపెట్టి సన్నని మంటమీద ఉడికించాలి. ముక్క మెత్తబడిన తరువాత కప్పు నీళ్ళు పోసి మూతపెట్టి ఉడికించాలి. వంకాయలు, పప్పు బాగా ఉడికిన తరువాత గరంమసాలా చల్లి దించితే కూర రెడీ. ఇది చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది.
వంకాయ బజ్జీ
కావలసిన పదార్ధాలు: వంకాయలు- పావుకిలో, శనగపిండి- పెద్ద కప్పు, ఉప్పు- అర టీస్పూను, కారం- టీ స్పూను, దనియాలపొడి- రెండు టీ స్పూన్లు, గరంమసాలా- టీ స్పూను, వంట సోడా- చిటికెడు, నూనె- వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: పొడవాటి వంకాయలను నిలువు ముక్కలుగా కోయాలి. పొట్టి వంకాయలైతే గుండ్రని స్లైసుల్లా అంటే చిప్స్‌లా కోసి ఉప్పునీళ్ళలో వేయాలి. ఓ గిన్నెలో శనగపిండి, ఉప్పు, కారం, దనియాలపొడి, గరంమసాలపొడి, వంటసోడా వేసి జారుగా కలిపి పదినిమిషాలు ఉంచాలి.ఇప్పుడు వంకాయ ముక్కలు నీళ్ళలో నుంచి తీసి కాస్త ఆరనిచ్చి రెండు వైపులా ఉప్పు, కారం చల్లాలి. ఇలా చేయడం వల్ల బజ్జీలు చప్పగా ఉండకుండా ఉంటాయి. తర్వాత బాణలిలో నూనె వేసి కాగాక వంకాయ ముక్కలను ఒక్కొక్కటిగా సెనగపిండిలో ముంచి వేయాలి. కరకరలాడేవరకూ ఎర్రగా వేయించి తీసి టిష్యూపేపర్ మీద వేస్తే ఎక్కువగా ఉన్న నూనెను పీల్చేసుకుంటాయి. వీటిని టొమాటో సాస్‌తో వడ్డిస్తే భలే రుచిగా ఉంటాయి. వంకాయ ముక్కలను ముందుగానే కరకరలాడేలా వేయించి తీసి అప్పుడు పిండిలో ముంచి కూడ బజ్జీలు వేసుకోవచ్చు.
గుత్తి వంకాయ వేపుడు
కావలసిన పదార్థాలు: గుండ్రని వంకాయలు- పావుకిలో, సెనగపిండి - అరకప్పు, పసుపు- చిటికెడు, కారం- టీస్పూను, దనియాల పొడి- టేబుల్‌స్పూను, ఉప్పు- అరటీస్పూను, కొత్తిమీర తురుము- టేబుల్‌స్పూను, నూనె- ఆరు టుబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం:
గుత్తివంకాయని కోసినట్టే ముక్కలుగా విడిపోకుండా వంకాయలు కోసుకుని ఉప్పు నీళ్లలో వేయాలి. విడిగా ఓ గిన్నెలో సెనగపిండి, ఉప్పు, కారం, కొత్తిమీర, దనియాలపొడి, పసుపు, రెండు టీ స్పూన్ల నూనె బాగా కలపాలి. ఈ ముద్దను వంకాయల్లో కూరాలి. వెడల్పాటి పాన్ తీసుకుని నూనె వేసి కాగాక మసాలా కూరిన వంకాయలను వేసి విడిపోకుండా నిదానంగా వేయించాలి. మూత పెట్టకుండా సిమ్‌లోనే వేయించి దించాలి.