Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొదుపు చేయాలని అందరికీ ఉంటుంది. దీనికోసం పాలసీలు కట్టడం, బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. కేవలం ఇవి మాత్రమే పొదుపు అనుకుంటే పొరపాటు. మన రోజు వారి చేసే ఖర్చులు తగ్గించుకున్నా పొదుపు చేసినట్టే. ఇంటిని అలంకరించుకోవాలన్నా, పిల్లలకు ఏదైనా కొనివ్వాలన్నా ఇలా ప్రతి దానికీ ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది. అయితే ఉపయోగించకుండా మూలనపడేసిన వస్తువులు ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉంటాయి. అలా పడేసిన వాటిని మళ్ళీ మన అవసరాలకు ఉపయోగించుకుంటే కొత్త ఖర్చులు తగ్గించి ఆవారా పొదుపు చేసినట్టే. మరి అలా మూలనపడ్డ వస్తువులు ఎలా ఉపయోగపడతాయో చూద్దామా..!
మీ పాత చీర ఏదైనా బోర్డర్ పాతబడి వాడకుండా పక్కన పెట్టినట్టయితే బోర్డర్ కత్తిరించి ఏదైనా లేస్, బర్దోసి, మిర్రర్ బోర్డర్ వేసి కొత్త చీరలా వాడుకుంటే సరి.
పాతకాలం నాటి చీర బోర్డర్‌ను కొత్త ప్లెయిన్ చీరలకు వేసి వాడుకోవచ్చు.
మీ పాత పట్టు, హెవీ వర్క్ చీరలతో చక్కగా అనార్కలి టైపు సూట్లు, కుర్తీలు కుట్టించుకోవచ్చు.
రెండు పాత పట్టు, మంచి చీరలు కలిపి ఈ రోజుల్లో వస్తున్న హాఫ్ అండ్ హాఫ్ చీరలాగా కుట్టి వాడుకోవచ్చు.
పాత పట్టు చీరలతో పిల్లలకు డాన్సు డ్రెస్సులు, ఫ్రాకులు, లంగాలు కుట్టించవచ్చు.
పాత పట్టు, బనారస్, డ్యామేజి అయిన చీరలను చున్నీలలా కత్తిరించి ప్లెయిన్ డ్రెస్సుల మీద వాడొచ్చు.
పాత బనారస్ చీరలతో కుషన్ కవర్లు కుట్టించవచ్చు.
మిగిలిన ఇడ్లీలను నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో దోరగా వేయించుకుంటే సాయంత్రం స్నాక్స్‌లా తినొచ్చు.
అన్నం మిగిలితే అందులో కొద్దిగా శెనగ పిండి, కారం, ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, కొత్తిమీర, గరం మసాలా పొడి కొద్దిగా వేసి పకోడీలు చేసుకోవచ్చు.
ఎండిపోయిన పచ్చి మిరపకాయలు పారేయకుండా ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసి చట్నీ చేసి వాడుకోవచ్చు.
అల్లంపొట్టు, యాలకుల పొట్టు పారేయకుండా టీలో వేస్తే మంచి రుచిగా ఉంటుంది.
కూరగాయలు తెచ్చుకున్నాక ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు పాతవి ముందుకు జరిపి పెడితే అవి పాడవకముందే ఉపయోగించవచ్చు.
కూరగాయలు వడలిపోతే పారేయకుండా నిమ్మరసం కలిపిన నీటిలో పది నిమిషాలు ఉంచితే మరల తాజాగా అవుతాయి.
వాడిన టూత్ బ్రష్‌లను పారేయకుండా వాటిని సింక్ మూలలు కడగటానికి ఉపయోగించవచ్చు.
మిగిలిపోయిన చాక్‌పీస్ ముక్కలు మెటల్ వస్తువులపైన రుద్ది కడిగితే మంచి మెరుపునిస్తాయి. అలాగే గోడలపైన ఉండే రంధ్రాలు పూరించేందుకు కూడా వాడవచ్చు.
పాత క్యాలెంటర్ పారేసే ముందు వాటిలో మీకు నచ్చిన చిత్రాలను కట్ చేసి ఫ్రేమ్ చేసుకోవచ్చు.
పిల్లలు క్రాప్ట్ చేయగా మిగిలిన ఐస్ క్రీమ్ పుల్లలు పారేయకుండా వాటిని కడిగి మొక్కలకు లేబుల్ లా ఉపయోగించవచ్చు.
ఖాళీ అయిన లిప్‌స్టిక్ కేసు పారేయకుండ వాటిలో సూదులు భద్రపరచవచ్చు.
హ్యాండిల్ విరిగిన సూట్ కేసు పారేయకుండా పాత బట్టలు, శీతాకాలానికి పనికి వచ్చే స్వెటర్లు, జాకెట్లను వాటిలో వేసి బెడ్ కింద భద్రపరచుకోవచ్చు.
పాత పిక్చర్ ఫ్రేమ్‌లను పారేయకుండా ట్రేలా వాడుకోవచ్చు.
ఖాళీ అయిన కేట్చర్ బాటిల్ కడిగి జిలేబీలు వేయడానికి వాడుకోవచ్చు.
క్లీనెక్స్ బాక్సులు ఖాళీ అయ్యాక ప్లాస్టిక్ బ్యాగుల హోల్డర్లా ఉపయోగించవచ్చు.
పాత క్యాసెట్ బాక్సులను అలంకరించి గిఫ్ట్ కేస్లా ఉపయోగించవచ్చు.
పాత సీడీ కేసులలో వైర్లను భద్రపరచవచ్చు.
స్లీవ్లేస్స్ టీ షర్ట్స్ అంచులను కుట్టి కిరాణా సంచుల్లా వాడుకోవచ్చు.