Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతనికి అసలు బాధ్యతలే పట్టవు. ఎప్పుడూ తాగడం, స్నేహితులతో తిరగడం తప్ప వేరే పనే లేదు. ఇంటి ఖర్చులకు భార్య డబ్బులడిగితే కొడతాడు. ఇలాంటి భర్తను పది సంవత్సరాలుగా భరిస్తోంది. ఇక భరించలేకపోయింది. దాంతో పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆడపడుచు జీవితం ఎలాగైనా నిలబెట్టాలని, వదిన ఆమెను తీసుకుని ఐద్వాలీగల్సెల్కు వచ్చింది. వదినతో కలిసి లీగల్‌సెల్‌కు వచ్చిన ఆమె మాట్లాడుతూ...
'మేడమ్, నాపేరు పద్మ. నా చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. అప్పటి నుండి బాధ్యతలన్నీ మా అన్నయ్యే చూసుకునేవాడు. నా పెండ్లి జరిగి పది సంవత్సరాలు. మా వారి పేరు శివయ్య. మాకు ఇద్దరు అబ్బాయిలు, చదువుకుంటున్నారు. ఆయన కరెంటు పని చేస్తాడు. ఇప్పుడు సమస్యంతా మా వారితోనే. ఆయన ఇంటి గురించి అస్సలు పట్టించుకోడు. పదిరూపాయలు ఇచ్చి అందులోనే అన్నీ వాడుకోమంటాడు. ఎప్పుడూ తాగుతుంటాడు. స్నేహితులను ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో కలిసి తాగుతాడు. వచ్చిన డబ్బులన్నీ ఆయన జల్సాలకే ఖర్చుచేస్తాడు.
పిల్లలను ప్రేమతో దగ్గరకు తీసుకోడు. వాళ్ళతో అస్సలు మాట్లాడనే మాట్లాడడు. నన్ను, పిల్లల్ని విపరీతంగా కొడతాడు. అసలు తాగినపుడు ఏం చేస్తాడో ఆయనకే తెలీదు. ఇంటికి ఎప్పుడో అర్ధరాత్రి వస్తాడు. ఉదయం పది గంటల వరకు నిద్ర లేవడు. ఇంటి ఖర్చులకు డబ్బులు అడిగితే బూతులు తిడతాడు. మా అన్నయ్య ఆయనకు ఓ ఆఫీస్‌లో ఉద్యోగం ఇప్పించాడు. ఆ ఉద్యోగానికి కూడా సరిగా వెళ్ళడు. రెండు రోజులు వెళితే వారం సెలవు పెడతాడు. తాగడానికి డబ్బులు లేకపోతే అప్పులు చేస్తాడు. ఇప్పుడు రెండు నెలల నుండి అసలు పనికే వెళ్ళడం లేదు. ఈయన ఇలాగే ఉంటే పిల్లల భవిష్యత్ ఏం కావాలి? మీరు ఎలాగైనా ఆయనతో మాట్లాడి తాగుడు మాన్పించండి. నాతో పిల్లలతో ప్రేమగా ఉండేలా చేయండి' అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
బాధ్యులు పక్కనే ఉన్న శివయ్యతో 'మీ ఆవిడ చెప్పింది నిజమేనా? అని అడిగారు' దానికి అతను 'స్నేహితులను రోజూ ఇంటికి తీసుకురాను. ఎప్పుడో ఓసారి మాత్రమే తీసుకొస్తా. నన్ను ఈ మధ్య ఉద్యోగం నుండి తీసేశారు. అందుకే ఇంట్లో డబ్బులు ఇవ్వలేకపోతున్నా. తెలిసిన వాళ్ళు ఆఫీస్‌లో మాట్లాడుతున్నారు. మళ్ళీ పనిలోకి వెళతాను. పద్మకు, పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా' అన్నాడు.
'పద్మను, పిల్లల్ని బాగా చూసుకుంటానంటున్నావు. మంచి విషయమే. మరి తాగుడు సంగతేంటి. నువ్వు రోజూ తాగుతూ ఉంటే మీ పిల్లల జీవితం ఏం కావాలి. వాళ్ళను చదివించి మంచి భవిష్యత్ చూపాల్సిన బాధ్యత తండ్రిగా నీకుంది. కాని నువ్వు ఇలా రోజూ తాగుతూ, గొడవ చేస్తుంటే రేపు నీ పిల్లలు ఎలా తయారవుతారు? తాగి పిల్లలు నిద్ర పోయిన తర్వాత వస్తావు, మళ్ళీ వాళ్లు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత లేస్తావు. ఇలా చేస్తే నీ పిల్లలు నిన్ను మర్చిపోతారు. తాగుడు వల్ల నీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఇలాగే చేస్తుంటే నీ భార్యకు కూడా నీపై ప్రేమ ఉండదు. నీకేమైనా అయితే పట్టించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి నువ్వు ముందు తాగుడు మానుకో. అప్పుడే నీ భార్యా పిల్లలు సంతోషంగా ఉండేది. నీ స్నేహితులను కూడా ఇంటికి రానీయకు. ఇలాంటి స్నేహాల వల్ల నీ జీవితమే పాడైపోతుంది. అందుకే నువ్వు మారాలి. ఇప్పటికైనా మారకపోతే మీ ఆవిడ పోలీస్ స్టేషన్లో కేసుపెడతానంటోంది. ఆ కేసు మీ అమ్మ వరకు వెళుతుంది. అప్పుడు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడాలి. కాబట్టి చెప్పింది అర్ధం చేసుకుని తాగుడుమానుకో, బుద్ధిగా ఉద్యోగం చేసుకో. పిల్లల్ని బాగా చదివించు' అన్నారు.
'మీరు చెప్పినట్టే తాగుడు మానుకుంటా, స్నేహితులను కూడా ఇంటికి రానీయను. నా ఉద్యోగం విషయంలో పద్మ వాళ్ళ అన్నయ్యను కాస్త సాయం చేయమనండి. ఆయన చెబితే పోయిన ఉద్యోగం కచ్చితంగా వస్తుంది' అని బతిమలాడుకున్నారు. 'నువ్వు మారావని నమ్మకం వస్తే నీ బావ నీకు కచ్చితంగా సాయం చేస్తాడు. నీ వల్ల చెల్లెలు కష్టాలు పడుతుందని అతనికి నీపై కోపం. నీకు ఉద్యోగం ఇప్పింది అతనే. చెల్లెలి కాపురం బాగుండాలనే కదా, నీకు ఉద్యోగం ఇప్పించింది. నువ్వు మంచిగా ఉంటావనే నమ్మకం వస్తే అతను నీకు కచ్చితంగా సాయం చేస్తాడు' అని శివయ్యకు లీగల్‌సెల్ సభ్యులు సమాధానం చెప్పి మళ్ళీ వచ్చే వారం వాళ్ళ అమ్మను తీసుకురమ్మని చెప్పి పంపించారు.
తర్వాతి వారం శివయ్య తల్లి వచ్చి 'మా శివ చాలా మంచోడు. వాడికి తాగుడు ఒక్కటే చెడ్డ అలవాటు. దాని వల్ల వాడి ఆరోగ్యం పాడైపోతుంది. ఈ మధ్యే లివర్ పాడై కామెర్లు అయితే లక్షరూపాయలు ఖర్చు అయింది. అంతా నేనే చూసుకున్నా. వాడి భార్య ఎప్పుడూ అలిగి వెళ్ళి అన్న దగ్గర కూర్చుంటుంది. పిల్లల్ని నాదగ్గరకు రానీయదు. వాళ్ళకు స్థలం కూడా మేమే కొనిచ్చాం. అందులోనే ఇళ్ళు కట్టుకొని ఉంటున్నారు. నా వల్ల వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుడప్పుడు నా మనవళ్ళను నా దగ్గరకు పంపమని చెప్పండి చాలు' అంటూ శివయ్య తల్లి ఏడ్చేసింది.
ఆమె చెప్పింది విన్న సభ్యులు 'తాగుడు తప్ప మీ వాడు మంచి వాడని మీరంటున్నారు. తాగుడే ఈ సమస్యలకు అసలు కారణం. ఎప్పుడూ తాగుతూ, స్నేహితులను ఇంటికి తీసుకొస్తూ అల్లరి చిల్లరిగా ఉండే భర్తను ఏ భార్యాయినా ఎలా భరిస్తుంది? మీరు మీ అబ్బాయికి గట్టిగా చెప్పడం లేదని ఆమెకు మీపై కోపంగా ఉండొచ్చు. పద్మతో మేం మాట్లాడతాం. మీరు బాధపడకండి. అలాగే మీరు శివయ్యను ప్రతి విషయాల్లో వెనకేసుకు రాకండి. మీ అండ చూసుకొని అతను ఇంకా రెచ్చిపోతాడు. బాధ్యత తెలియకుండా తయారవుతాడు. మేము మీ అబ్బాయితో మాట్లాడాం. తాగుడు మానేస్తానన్నాడు. భార్యా పిల్లల్ని ప్రేమగా చూసుకుంటానన్నాడు. వాళ్ళు సంతోషంగా ఉండటానికి మీరు కూడా మీ వంతు సాయం చేయండి' అని ఆమెకు నచ్చజెప్పారు.
తర్వాత సభ్యులు పద్మను లోపలికి పిలిచి 'నీ భర్త ఇక నుండి నీతో పిల్లలతో ప్రేమగా ఉంటానని నీ ముందే చెప్పాడు. తాగుడు కూడా మానేస్తానన్నాడు. రోజూ పనికి వెళతానన్నాడు. ఈ విషయాలన్నీ రాసి అతనితో సంతకం చేయిస్తాం. ఇకమీదట నీకేమైనా సమస్య వస్తే మా దగ్గరకు వచ్చి చెప్పు. నువ్వు మాత్రం గొడవలు పెట్టుకోవద్దు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లల్ని వాళ్ళ నాయనమ్మ దగ్గరకు పంపాలి. నీకు కష్టం వస్తే నువ్వు నీ వదిన దగ్గరకు వెళ్ళావు. ఆమె మంచిది కాబట్టి నిన్నూ, నీ పిల్లల్ని చూసుకుంది. నీ వదిన నీ విషయంలో ఎంత బాధ్యతగా ఉందో, నువ్వు కూడా నీ అత్తగారి కుటుంబం పట్ల అంతే బాధ్యతగా ఉండాలి. అప్పుడే సంబంధాలు నిలబడతాయి. ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అంతేగాని ప్రతిదానికి అలిగి అన్న దగ్గరకు వెళ్లడం మంచిది కాదు' అని చెప్పారు.
చెప్పిందంతా విన్న పద్మ 'ఇకపై మీరు చెప్పినట్లే చేస్తాను. ఆయన మంచిగా చూసుకుంటే చాలు' అని చెప్పి భర్తతో కలిసి వెళ్ళిపోయింది. మళ్ళీ పదిహేను రోజుల తర్వాత పద్మ లీగల్‌సెల్‌కు వచ్చి 'మేడమ్ ఇప్పుడు మా ఆయన ఉద్యోగంలో చేరాడు. తాగుడు కూడా చాలా వరకు తగ్గించాడు. స్నేహితులను మాత్రం ఇంటికి తీసుకురావడం లేదు. పిల్లలతో కూడా మంచిగానే ఉంటున్నాడు. వాళ్ళను స్కూల్‌కి ఆయనే తీసుకెళుతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీ వల్లనే జరిగింది. మళ్ళీ ఏదైనా సమస్య వస్తే మీ దగ్గరకే వస్తాను. నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన మా వదినకు, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోయింది.
- సలీమ