Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విపరీతమైన పని ఒత్తిడి అలసటకు గురి చేస్తుంది. ఇది తరచూ వేధిస్తుంటే మాత్రం... వెంటనే నివారణ చర్యలు ప్రారంభించాలి. నిత్యం కూర్చుని చేసే ఉద్యోగాలు తీవ్రమైన ఒత్తిడి ఇతర అనారోగ్యకరమైన జీవితన విధానాలు.. దీనికి కారణమై ఉంటాయి. మీ శక్తి పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే..
బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయొద్దు..
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఉదయం కూడా ఆరోగ్యంగా ప్రారంభం కావాలి. దానికోసం రోజూ ఓట్స్ లేదా గోదుమరొట్టె, కోడిగుడ్లను బ్రేక్ఫాస్టుగా చేసుకోండి. కావాలంటే దానికి పీనట్ బటర్ యాడ్ చేసుకోండి. ఇది శరీరానికి మంచి కేలరీస్‌ను అందిస్తుంది. తక్షణ శక్తినిస్తుంది.
శరీరానికి తేమనివ్వండి...
నిత్యం నీరసంగా అనిపిస్తుంటే డీహైడ్రేషన్ కారణం కావచ్చు. ద్రవపదార్థాలు తీసుకోవడాన్ని పెంచండి. నీళ్లు ఎక్కువగా తాగండి. దానికి తోడుగా రోజూ గ్లాసు బీట్రూట్ జ్యూస్‌ను తీసుకోండి. అందులో ఉన్న నైట్రేట్స్ మీ శక్తిని పెంచడానికి తోడ్పడతాయి.
మెగ్నీషియం తప్పనిసరి...
మీరు స్పోర్ట్స్ పర్సన్, లేదంటే శారీరక శ్రమ అధికంగా ఉండే వ్యక్తి అయితే గనుక.. మీ రోజువారీ ఆహారంలో మెగ్నీషియంను చేర్చండి. అది గ్లూకోజ్‌ను శక్తిగా మార్చేస్తుంది. తక్షణ శక్తినిస్తుంది. ఆకుకూరలు, బాదం, జీడిపప్పు, ఇతర గింజలు, చేపలు, సోయాబీన్నస, అరటిపండ్లు, డార్క్చాక్లెట్స్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
కార్బ్స్‌ను చేర్చండి...
మొరంగడ్డలు, బ్రౌన్‌బ్రెడ్ వంటివాటిలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పిండిపదార్థాలను, చక్కెరలను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి.
వ్యాయామం చేయండి...
రోజువారీ వ్యాయామం చేయడం వల్ల మీ శరీరానికి నిరోధక శక్తి పెరుగుతుంది. మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతుంది. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్వాంటివాటిని రోజుకు కొన్ని నిమిషాలపాటు చేస్తే... మీరు బలంగా తయారవుతారు.
మంచి నిద్రతో...
రోజంతా కష్టపడిన శరీరానికి విశ్రాంతి కావాలి. మరునాడు మళ్లీ ఉత్సాహంగా రోజును ప్రారంభించాలన్నా... కచ్చితంగా నిద్ర 7నుంచి 8గంటలపాటు పోవాలి. నిద్రలేమి సమస్య అయితే... మెడిటేషన్, లేదా యోగా వంటివిచేయండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి తొందరగా నిద్రపట్టేలా చేస్తుంది.
మంచి ఆహారం..
శక్తి రావాలంటే కచ్చితంగా ఆహారం తీసుకోవాల్సిందే. కానీ ఏది పడితే అది కాకుండా తీసుకునే ఆహారంపై శ్రద్ద పెట్టండి. మీరు తీసుకునే ఆహారం శరీరానికి మంచి చేసేదా, చెడు చేసేదా అని ఆలోచించండి. విటమిన్ 'సి', ప్రోటీన్స్, ఐరన్ శక్తిని పెంచుతాయి. రోగనిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి. శరీర కండరాలను రిపేర్ చేస్తాయి. శరీరానికి శక్తి సరిగ్గా అందాలంటే... తక్కువ తక్కువ ఆహారం ఎక్కువసార్లు తీసుకోవాలి.
కావలసినంత ఉప్పు...
శారీరక శ్రమ పెరిగితే.. చెమట రూపంలో శరీరంలో ఉన్న ఉప్పు పోతుంది. తక్కువ ఉప్పు శరీరంలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది. శక్తిని తగ్గిస్తుంది. రోజువారీ శరీరానికి కావాల్సిన సోడియం 2,300 మిల్లీగ్రాముల నుంచి 2,400 మిల్లీగ్రాములు. కాబట్టి కావలసినంత ఉప్పును తీసుకోండి.