Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో వృథాగా ఉండే పాత దుపట్టాలతో అందమైన వస్తువులను తయారు చేసుకోవచ్చు. దుపట్టాలతో తయారు చేసిన వస్తువులను ఇంట్లో అలంకరించుకున్న అద్భుతంగా కనిపిస్తాయి. కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిస్తే చాలు ఎన్నో ఆకర్షణీయమైన వస్తువులను స్వయంగా తయారు చేసుకోవచ్చు. అలాంటి అందంమైన వస్తువులు ఈ వారం మీ కోసం...
టేబుల్ క్లాత్ : దీన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. నెట్ మాదిరి ఉండే పాత దుప్పట్టాను టేబుల్ పరిమాణానికి అనుగుణంగా కుచ్చులు వచ్చేలా కుట్టుకోవాలి. బొమ్మలో చూపిన విధంగా కుట్టుకుంటే బాగా కనిపిస్తుంది. ఇలా తయారు చేసుకునే టేబుల్ క్లాత్ చాలా పలుచగా నేట్ మాదిరి ఉంటేనే అందంగా కనిపిస్తుంది. టేబుల్ క్లాత్ కుట్టుకున్న తర్వాత దానిపై చిన్న చిన్న పువ్వులను, గుండీలను గమ్ సహాయంతో అతికించుకుంటే మరింత అందంగా కనిపిస్తుంది.
డోర్ కర్టెన్ : దీన్ని తయారు చేసుకోవడానికి పలుచగా, పొడవుగా ఉండే పాత దుపట్టా అయితే సరిపోతుంది. ముందుగా తలుపుల పొడవు క్లాత్‌ను కట్ చేసుకొని దాని చివర్లను కుట్టుకుంటే సరిపోతుంది. మరింత అందంగా కనిపించాలంటే కర్టెన్ చివర్లకు లేస్ లేదా పట్టును అతికించుకొని కుట్టుకుంటే అద్భుతంగా కనిపిస్తుంది.
దిండు కవర్లు : దిండు కవర్లను చాలా సులభంగా, త్వరగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం కాటన్ దుపట్టాలైతే మంచిది. కాటన్ దుప్పట్టాలను చతురస్రాకారంలో లేదా గుండ్రంగా కత్తిరించుకోవాలి. ఇలా కత్తిరించుకున్న తర్వాత ఒక బ్యాగు మాదిరి కుట్టుకోవాలి. అలా బ్యాగు మాదిరి కుట్టుకున్న తర్వాత దాంట్లో వృథాగా ఉన్న చిన్న చిన్న బట్ట ముక్కలు పెట్టి చివరి భాగాన్ని గట్టిగా కుట్టుకుంటే సరిపోతుంది.
డిజైన్డ్ హ్యాంగర్ : కాస్త మందంగా ఉన్న కాటన్ దుపట్టాతో అందమైన హ్యాంగర్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకోవడానికి దుప్పట్టా, కత్తెర, గమ్, కుందన్స్, చిన్న చిన్న అద్దాలు ఉంటే సరిపోతుంది. ముందుగా దుప్పట్టాను చిన్నగా బొమ్మలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని చివర్ల ను కుట్టుకోవాలి. కుందన్స్‌ను, అద్దాలను గమ్ సహాయంతో అందంగా అలకరించుకుంటే సరిపోతుంది. ఇది చాలా అందంగా, డిఫరెంట్‌గా కనిపిస్తుంది.
బ్యాగు: పట్టు మాదిరి ఉండే పాత దుపట్టాను ఎంతో అందమైన బ్యాగులా తయారు చేసుకోవచ్చు. దుపట్టాను చతురస్రాకారంలో కత్తిరించుకొని బ్యాగు మాదిరి కుట్టుకోవాలి. బొమ్మలో చూపిన విధంగా బ్యాగును కాస్త డిఫరెంట్‌గా కుట్టుకుంటే సరిపోతుంది.
స్కాట్స్ : దుపట్టా కాస్త చిరిగినా... పాత పడినా... రంగు మారినా... అలాగే దాచిపెడతారు. కానీ ఆ దుపట్టాతో ఎంతో అందమైన చిన్న చిన్న స్కాట్స్ను కుట్టించుకోవచ్చు. ఇవి చూడటానికి అందంగా, అద్భుతంగా కనిపిస్తాయి. మరీ ఇకెందుకు ఆలస్యం ఓ సారి ప్రయత్నించి చూడండి !