Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరిత ఆఫీస్‌కు వెళ్ళడానికి ఓ గంటమాత్రమే ఉంది. ఇంటి పనులు ఇంకా పూర్తి కాలేదు. పాప నిద్ర లేవలేదు. ఆమెను లేపి, తయారు చేసి టిఫిన్పెట్టి, లంచ్‌బాక్స్ సిద్దం చేసి తన పనులు ముగించుకుని బయటపడేసరికి ఉన్న సమయం కాస్త అయిపోతుంది. పాప ఓ పట్టాన నిద్ర లేవదు. ఆమెను లేపేసరికే సరిత ఓపిక అయిపోతుంది. ఇలాంటి సమస్య ఒక్క సరితకు మాత్రమే కాదు. పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఉండే సాధారణమైన సమస్యే. పిల్లల్ని ఉదయం నిద్రలేపడమంటే తల్లిదండ్రులకు ఓ పోరాటమే. అయితే ఎలాంటి పోరాటం చేయకుండానే పిల్లల్ని నిద్రలేపడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...
తొందరగా పడుకోబెట్టాలి
ప్రస్తుతం పిల్లలు టీవీలు, స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిపోయారు. దీని వల్ల గంటల కొద్ది వాటితో గడిపి రాత్రి ఆలస్యంగా నిద్ర పోతారు. అలాగే తల్లిదండ్రులు కూడా రాత్రి డ్యూటీలు లేదా ఆలస్యంగా ఇంటికి రావడం లాంటివి చేయడం వల్ల పిల్లలు ఎదురు చూస్తూ అలాగే కూర్చుంటారు. దాంతో ఆలస్యంగా నిద్రపోతారు. దాంతో ఉదయం మేల్కోవడం కష్టమవుతుంది. అందుకే మీరు త్వరగా నిద్రకు ఉపక్రమించి పిల్లలను కూడా నిద్రపుచ్చాలి. సరిపడినంత నిద్రపోయినప్పుడు మాత్రమే ఉదయం పిల్లలు ఉత్సాహంగా మేల్కొంటారు.
మంచి సంగీతాన్ని సెట్ చేయండి
పిల్లల్ని నిద్రలేపడానికి అలారం పెట్టండి. అందులో మీకు నచ్చిన పాటలకు బదులు పిల్లలను ఉత్సాహపరిచే ట్యూన్స్ సెట్ చేయండి. ఇలా చేయడం వల్ల పిల్లలు అలారం మోగిన వెంటనే నిద్రలేస్తారు. వారికి ఇష్టమైన ట్యూన్ కాబట్టి ఉత్సాహంగా కూడా ఉంటారు.
ఉదయం కొంత సేపు ఆడండి
నిద్ర లేచిన దగ్గర నుంచి ఆఫీస్‌కు వెళ్ళే హడావుడిలో గడుపుతుంటాం. దాంతో ఎప్పుడూ బిజీ. పిల్లలతో ఆడుకునే సమయం అరుదుగా ఉంటుంది. అందుకే ఉదయం సమయంలో మీ పిల్లలు మంచం మీద ఉన్నప్పుడే కొంతసేపు వారితో ఆడండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లలను బలవంతంగా నిద్రలేపడానికి ప్రయత్నించకూడదు.ఉదయాన్నే వారితో కాసేపు ఆడటం వలన మీరు పిల్లలతో కొంత సమయాన్ని గడుపుతారు.
ప్రారంభ రైజింగ్ కోసం రివార్డ్స్ ఇవ్వండి
పిల్లలు తొందరగా నిద్రలేవడం లేదని చాలామంది తల్లిదండ్రులు కోప్పడుతుంటారు. అయితే పనిష్మెంట్ అనేది పిల్లలకు మంచి అలవాట్లను నేర్పటానికి సరైన మార్గం కాదని గుర్తించాలి. దీనికి బదులుగా మీరు బహుమతులతో మంచి అలవాట్లు నేర్పడానికి ప్రయత్నించండి. చాక్లెట్ సాస్ వంటి చిన్న బహుమతులను సెట్ చెయ్యండి. త్వరగా నిద్రలేచి స్కూల్‌కు రడీ అయితే ఇలాంటి చిన్న బహుమతి ఇస్తానని చెప్పండి.
ముద్దు పెట్టి లేపండి
ఉదయాన్నే మీ పిల్లలను లేపినప్పుడు వారి నుదుటిపై ముద్దు పెట్టి ప్రేమను చూపించండి. ముద్దు పెట్టటం అనేది మీ పిల్లలను మేల్కొలపడానికి ఉత్తమ మార్గం. అయితే మొదటి ముద్దుకే మేల్కొనకపోవచ్చు. కానీ మీరు నవ్వుతూ వారిని నవ్విస్తూ మేల్కొలపడానికి మరిన్ని ముద్దులను వారి బుగ్గల మీద పెట్టండి. అప్పుడు అది వారికి ఓ అందమైన మేల్కొలుపుగా ఉంటుంది.