Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల ప్రభావం వల్ల కొన్నిసార్లు నోటి తడి ఆరుతుంది... శరీరంలో నీటి శాతం తగ్గినా... నోరంతా పొడి బారి బాగా ఇబ్బంది పెడుతుంది. అలాంటి సమయంలో కొన్ని చిట్కాలను పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు.
నీటి శాతం తగ్గితే సహజంగా శరీరం డిహైడ్రేట్ అవుతుంది. ఇక దేహం మొత్తం పొడిబారటం, అలసట, ఆందోళన, తల నొప్పి వంటివి మొదలవుతాయి. ఈ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగితే మంచిది. నీరు తాగలేని వారు కొబ్బరి నీళ్ళు, సూప్స్, హెర్బల్ టీ వంటివి తాగితే డ్రైనెస్ నుంచి త్వరగా కోలుకుంటారు.
దంత సమస్యలు ఉన్నవారు ఏం తీసుకోవాలన్న భయపడిపోతారు. అలాంటప్పుడు ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో ఒక చెంచా కొబ్బరి నూనె, ఆవనూనె, నువ్వుల నూనె, పొద్దుతిరుగుడు నూనె కలపాలి. ఈ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలిస్తే సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత యదావిధిగా బ్రష్ చేస్తే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నోటి దుర్వాసన, దంత సమస్యలు, పొడిబారడం వంటి సమస్యలు దూరం అవుతాయి.
ప్రతిరోజు ఉదయం, రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి నీటిలో కలబంద రసాన్ని కలిపి నోటిని పుక్కిలించడం వల్ల నోరు తడి ఆరకుండా ఉంటుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్.
సోపు గింజలు అజీర్తి, నోటి దుర్వాసనను, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నోరు బాగా పొడిబారినట్టు ఉంటే రోజుకు మూడు సార్లు ఒక చెంచా సోపు గింజలను నోట్లో వేసుకొని నములితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల నోటి తడి ఆరకుండా ఉంటుంది.
నిమ్మరసం లాలాజల గ్రంధులను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఆమ్లాలను, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో ఒక చెంచా తేనె, మూడు చెంచాల నిమ్మరసాన్ని కలుపుకొని తాగితే నోటి సమస్యలతో పాటు శరీర బరువు కూడా తగ్గుతారు. ఇలా ఉదయం పూట చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
యాలకులు, అల్లం ముక్కలు లాలాజల గ్రంధులను ఉత్పత్తి చేస్తాయి. నోరు బాగా పొడిబారినప్పుడు చిన్న అల్లం ముక్కను, ఒక యాలకును నోట్లో వేసుకుంటే త్వరగా ఉపశమనం పొందుతారు.