Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేడీ జోన్ బెక్సెట్ లిండ్సే (16 నవంబరు 1896 - 23 డిసెంబరు 1984)
జోన్ బెక్సెట్ లిండ్సే ఆస్ట్రేలియన్ నవలా రచయిత.సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో ఆమెకు ప్రావీణ్యం ఉన్నా.. వ్యంగ్యధోరణి ఎక్కువ కనిపిస్తుందని చరిత్రకారులు అంటారు. ఆమె రాసిన ' పిక్నిక్ ఎట్ హ్యాంగింగ్ రాక్' హిస్టారిక్ గోథిక్ నవల ఆస్ట్రేలియన్ నవలల్లో ఆల్‌టైమ్ రికార్డు సాధించింది. 1975లో ఇదే పేరుతో సినిమాగా కూడా వచ్చింది.
ఆస్ట్రేలియాలోని సెయింట్ కిల్డా ఈస్ట్‌లో ని సంపన్న కుటుంబంలో లిండ్సే జన్మించారు. క్లైడే గర్ల్స్ గ్రామర్ స్కూల్లో ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. 13ఏండ్ల వయసులో స్థానిక బోర్డింగ్ స్కూల్లో చేరారు. అక్కడ ఆమె స్కూల్ మ్యాగజైన్‌ను నిర్వహించడంతో పాటు లోగో కూడా తానే రూపొందించారు. ఆర్టిటెక్ట్ కావాలన్న ఆశయం ఆమెలో ఉండేది. మెల్బోర్న్లోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ విక్టోరియా ఆర్ట్ స్కూల్లో చేరి పెయింటింగ్ నేర్చుకున్నారు. ఆ తర్వాత స్టూడియోను ఏర్పాటుచేసి వాటర్ కలర్స్‌తో వేసిన తన పెయింటింగ్స్‌తో 1920లో మొదటిసారి ప్రదర్శన నిర్వహించారు.
మెల్బోర్న్ నుంచి లండన్‌కు వచ్చిన తర్వాత సర్ ఎర్నెస్ట్ డారిల్ లిండ్సేను ఆమె పెండ్లి చేసుకున్నారు. 1924 లో తిరిగి వారి కుటుంబం మెల్బోర్న్ వెళ్లింది. మరో చిత్రకారుడు డామే నెల్లీ మెల్బాతో కలిసి జాయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఫైన్ ఆర్టిస్ట్‌గా పేరుగాంచిన లిండ్సే ఆ తర్వాత చిత్రాలతో పాటు రచనల వైపు దృష్టి సారించారు. ఒకవైపు చిత్రాలు వేస్తూ.. మరో వైపు రచనావ్యాసంగాన్ని కొనసాగించారు. అయితే ఆమె రాసిన ఎన్నో నాటకాలు ప్రచురణకు నోచుకోలేదు. అనేక పత్రికల్లో, జర్నల్స్‌లో ఆమె రాసిన వ్యాసాలు ప్రచురించబడ్డాయి. ఆమె చిన్నారుల కోసం ప్రత్యేకంగా సాహిత్యాన్ని తీసుకువచ్చారు. ఆమె రాసిన చిన్న కథలు, కథనాలు వర్తమాన కళాకారులకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆమె యువతకు చిత్రకళలో శిక్షణ కూడా ఇచ్చారు.
లిండ్సే తన తొలి సాహిత్య రచన నలభై ఏడు సంవత్సరాల వయసులో మారుపేరుతో ప్రచురించారు. ఆ తర్వాత 'డార్కెస్ట్ పాండేలా' అనే పేరుతో ఒక వ్యంగ్య నవల రచించారు. ఆమె రచించిన రెండో నవల ' టైం వితౌట్ క్లాక్స్' దాదాపు 30ఏండ్ల తర్వాత ప్రచురించబడింది.
లిండ్సే 'నేషనల్ గ్యాలరీ ఆఫ్ విక్టోరియా' డైరెక్టర్‌గా(1941-56) బాధ్యతలు నిర్వహించారు.ఆ తర్వాత 'ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ ఆఫ్ విక్టోరియా' ప్రెసిడెంట్‌గా (1958-64) పనిచేశారు.
1969 లో ఒక కారు ప్రమాదంలో లిండ్సే తీవ్రంగా గాయపడి దీర్ఘకాలిక అస్వస్థతకు లోనయ్యారు. ఆమె తన ఇంటిని ' నేషనల్ ట్రస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా' కు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఆమె నివాసం మ్యూజియంగా సందర్శకులకు అందుబాటులో ఉంది. ు