Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్పాహారం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇడ్లీ, దోశ, వడ, పూరీ. ఇంతేనా? ఇంకేం లేవా? అంటే... చాలా ఉన్నాయి. అటుకులతో అల్పాహారాన్ని అద్భుతంగా చేసుకోవచ్చు. ఆరోగ్యాన్నిచ్చే సలాడ్, బీట్రూట్ అటుకులు, పిల్లలు ఇష్టంగా తినే లడ్డూ, దోశ, ఉప్మా... టిఫిన్ ఏదైనా టకీమని చేసుకోవచ్చు. అవేంటో మీరూ ప్రయత్నించి చూడండి.
కావల్సిన పదార్థాలు:
అటుకులు - రెండు కప్పులు, పుట్నాల పప్పు - కప్పు, చక్కెర - ఒకటిన్నర కప్పు, నెయ్యి - అరకప్పు, జీడిపప్పు పలుకులు - కొన్ని, పాలు - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి - అరచెంచా.
తయారుచేసే విధానం:
బాణలిని పొయ్యిమీద పెట్టి సగం నెయ్యి వేయాలి. అది కరిగాక అటుకులు వేసి దోరగా వేయించి తీసుకోవాలి. అవి చల్లారాక పొడిలా చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదే మిక్సీలో పుట్నాలపప్పూ, చక్కెరా, యాలకులపొడీ వేసి మళ్లీ పొడిలా చేసుకుని అటుకుల మిశ్రమంలో వేయాలి. బాణలిని మరోసారి పొయ్యిమీద పెట్టి మిగిలిన నెయ్యి కరిగించి జీడిపప్పు పలుకులు వేయించి అటుకుల పొడిలో వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు పాలు చల్లుకుంటూ లడ్డూల్లా చుట్టుకుంటే సరిపోతుంది. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు.
అటుకులు- పెరుగు సలాడ్
కావలసిన పదార్థాలు:
మందపాటి అటుకులు- కప్పు, పాలు- ఒకటిన్నర కప్పులు, అరటిపండు- ఒకటి, మామిడిపండు- ఒకటి, యాలకులపొడి- పావుటీస్పూను, తేనె- 2 టేబుల్‌స్పూన్లు, పంచదార- అరకప్పు, పెరుగు- కప్పు, ఎండుద్రాక్ష- పావుకప్పు
తయారుచేసే విధానం:
అటుకులను చల్లని నీళ్లతో కడిగి నీళ్లు వంపేయాలి. అరటిపండు, మామిడిపండు తొక్క తీసి ముక్కలుగా కోయాలి. గిన్నెలో అటుకులు వేసి తీసుకున్నవన్నీ వేసి కాసేపు నానిన తరవాత ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా అందించాలి. ఇందులో కేవలం అరటి, మామిడే కాదు, మిగిలిన అన్ని రకాల తాజాపండ్లూ డ్రైఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు.
అటుకుల ఉప్మా
కావలసిన పదార్థాలు: అటుకులు- 1 కప్పు, పచ్చిమిర్చి- 3, పెద్ద ఉల్లిపాయ- 1/2, పల్లీలు- 2 టేబుల్ స్పూన్స్ , పచ్చి బఠాణి -3 టేబుల్ స్పూన్స్, ఉప్పు-తగినంత, జీలకర్ర- 1/2 టీస్పూన్, వెల్లుల్లి ముక్కలు- 1/2 టీస్పూన్, పసుపు- 1/4 టీస్పూన్, కొత్తిమీర - కొద్దిగా, కరివేపాకు- 2 రెమ్మలు, నిమ్మరసం -2 టేబుల్ స్పూన్స్
తయారుచేసే విధానం :
అటుకులను ముందుగా నీళ్లతో శుభ్రం చేసి, నీరు లేకుండా పిండి పక్కన పెట్టాలి. స్టవ్‌పై పెనం పెట్టి, తగినంత నూనె వేసి వేడిచేయాలి. తర్వాత జీలకర్ర, పల్లీలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఉలిపాయ ముక్కలు, పచ్చి బఠాణి వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత అటుకులు వేసి బాగా కలపాలి. చివరిగా ఉప్పు, నిమ్మరసం వేసి మరోసారి కలపాలి. అంతే ఘుమఘుమలాడే.. అటుకుల ఉప్మా రెడీ! దీన్ని కూరగాయలతో కూడా తయారు చేసుకోవచ్చు.
బీట్రూట్ అటుకులు
కావలసిన పదార్థాలు:
బీట్రూట్ కోరు - 1 కప్పు, అటుకులు - 1 కప్పు, నూనె - 2 టీస్పూన్లు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు - 1టీస్పూను, అల్లం కోరు - 1 టీస్పూను, ఎండుమిర్చి - 4, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు - రుచికి సరిపడా, కొబ్బరి కోరు - అర కప్పు
తయారుచేసే విధానం:
అటుకులు నానబెట్టి వడగట్టి బట్ట మీద ఆరబెట్టాలి. బాండీలో నూనె పోసి కాగాక ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, బీట్రూట్, అల్లం కోరు వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించుకోవాలి.
తర్వాత అటుకులు, ఉప్పు వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత కొబ్బరి కోరు, వేసి కలిపి దింపాలి. అంతే బీట్రూట్ అటుకులు రెడీ!
పోహా దోశ
కావాలసిన పదార్థాలు:
బియ్యం- రెండు కప్పులు, అటుకులు - సగం కప్పు, పెరుగు - మూడున్నర కప్పులు, మెంతులు - ఒక చెంచా, వంటసోడా - చిటికెడు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె- తగినంత,
తయారుచేసే విధానం:
ముందుగా అటుకులు, బియ్యం, మెంతులు చిక్కటి పుల్లగా ఉన్న పెరుగులో ఓరాత్రంతా నానబెట్టుకోవాలి. మర్నాడు నానబెట్టుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఈ పిండిలో ఉప్పు, వంటసోడా కలిపి ఒక రెండు గంటలు పక్కన వుంచాలి. తరువాత పాన్ పొయ్యి మీద పెట్టి వేడి అయ్యాక నీళ్లు జల్లి ఆ పైన ముందుగా రడీగా వుంచుకున్న పిండిని కొంచెం మందంగా వుండేలా పోయాలి. దోశ ఒక వైపు కాలాక రెండో వైపు కూడా తిప్పి కాలాక తీసెయ్యాలి. అంతే వేడి వేడి అటుకుల దోశ రెడీ! ఈ దోశ కొబ్బరి చట్నీ, వేరుసెనగ పప్పుచట్నీ, టమాటా చట్నీలతోబాగుంటుంది.