Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజువారీ పనులతో ఓ రకమైన ఒత్తిడికి గురవుతారు చాలామంది. ఈ రకమైన ఒత్తిడి కాస్త అభద్రత భావానికి గురిచేస్తుంది. కొత్తవారితో మాట్లాడాలన్నా, శుభాకార్యాలకు వెళ్లాలన్నా... నలుగురిలో నిలబడలేక భయంతో బిక్కు బిక్కుమని వణికిపోతుంటారు. నిరంతరం ఇలాంటి భయాలతో పోరాటం చేస్తూ కాలాన్ని వెళ్లబుచ్చుతుంటారు. భయం అనే భావన నుంచి బయటపడాలంటే కొన్ని సూచనలు పాటించాల్సిందే అంటున్నారు మానసిక నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం!
కొంతమంది చూడటానికి చాలా గభీరంగా, బలంగా కనిపించినా... అంతర్గతంగా చాలా బలహీనంగా, భయపడుతూ ఉంటారు. ఈ లక్షణాలు పుట్టి పెరిగిన వాతావరణం నుంచి లేదా జన్యుపరంగా కూడా వస్తాయని చెబుతున్నాయి కొన్ని పరిశోధనలు. అయితే ఈ విధమైన భయాలు దూరం కావాలంటే తల్లిదండ్రుల, స్నేహితుల ప్రోత్సాహం ఉంటే సరిపోతుంది.
కొన్నిసార్లు అనారోగ్య కారణాల వల్ల కూడా భయం వస్తుంది. ఇది మానసికంగా ఒక రకమైన ఒత్తిడికి గురి చేస్తుంది. ఇది అభద్రత భావాన్ని కలిగిస్తుంది. ఈ రకమైన భయాలను దూరం చేసుకోవాలంటే పోషకాహారం తీసుకోవడం లేదా మానసిక వైద్యులను సంప్రదిస్తే మంచిది.
ఎక్కువగా ఆందోళన పడేవారయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి వారు టీవీ, కంప్యూటర్, సెల్ఫోన్ కు దూరం ఉంటే మంచిది. మానసికంగా ఎదురయ్యే ఒత్తిళ్లను అధిగమించలేక మౌనంగా ఆత్మహత్యలు చేసుకుంటారు. వ్యక్తిగతంగా ఉన్న ఈ బలహీనతలను కాస్త సీరియస్గా తీసుకోవాలి.
తమ బలహీనతలను మనసులో దాచుకొని మౌనంగా కూర్చోనుంటారు చాలా మంది. ఇతరులకు చెబితే నన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తారో అని లోపలే భయపడిపోతుంటారు. కానీ మనసులో దాచుకున్న ఈ రకమైన భయాలను వదిలి పెట్టి, సహజంగా సిద్ధంగా వచ్చే భావోద్వేగాలను ఎప్పటికప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటేనే మానసికంగా ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటారు.
చిన్న చిన్న విషయాల గురించి ఎలా ఆలోచిస్తున్నారో ఓసారి నెమరు వేసుకోవడం కీలకం. ప్రతికూల, సానుకూల ఆలోచనలు సహజమే. కానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువగా వస్తుందో గమనించుకోవాలి. ఇలాంటి అంశాల పట్ల కాస్త అవగాహన కలిగి ఉండటం ముఖ్యం.