Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతం కంటే అమ్మాయిల ఆలోచనా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. చదువు తర్వాత పెండ్లి, పిల్లలు, కుటుంబం అంటూ పరిమితులు పెట్టుకోవడం లేదు. తమ కాళ్ళపై తాము నిలబడటానికీ, ఆర్థికంగా స్థిరపడటానికి పెండ్లికి ముందు నుండే ప్లాన్ చేసుకుంటున్నారు. అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. చదువు పూర్తయిన వెంటనే మంచి జీతం ఇచ్చే పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే నిన్నమొన్నిటి వరకు తల్లిదండ్రులమీద ఆధారపడిన వారు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్య్రాన్ని పొందుతున్నారు. అయితే సంపాదించిన డబ్బులను యుక్త వయసులోనే ప్లాన్ ప్రకారం ఖర్చుపెట్టకపోతే భవిష్యత్తులో కష్టాలే...అందుకే ఉద్యోగంలో చేరిన నాటి నుండే మీ నెల జీతం నుండి కొంత మొత్తాని పొదుపు కోసం పక్కకు పెట్టండి. ఆ పొదుపు భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సమస్యలకు తోడ్పడుతుంది.
సాధారణంగా యువత తమ వ్యక్తిగత అవసరాలు, సరదాల కోసం అనవసరమయిన డబ్బులను ఖర్చు చేసిపడేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలను ఆకర్షించడానికి మార్కెట్లోకి రకరకాల ఉత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్నాయి. వాటి కోసం సంపాదించుకున్న కష్టార్జితాన్ని పార్లర్లకు, డ్రెస్సులకంటూ ఇతరులకు ధారపోస్తున్నారు. నెలకు ఒక సెల్‌ఫోన్ మారుస్తున్నవారు కూడా ఉన్నారు. అలాగే అబ్బాయిలు కూడా నలుగురిలో స్టైలిష్‌గా కనిపించడం కోసం బైక్‌లు కొనడం, ఇంకా రకరకాల విచిత్రమైన దుస్తులను ఖరీదు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇలా అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిమీద ఒకరు పోటీతో అనవసరమైన ఖర్చులను వెచ్చించుకుంటున్నారు.
ఆలోచించాల్సిందే...
అందుకే ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పటి జాగ్రత్తలు యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి... తమతమ వ్యక్తిగత సరదాలతోపాటు పొదుపు చేసుకునే విషయాలలో ఆలోచించుకోవాలి. ఇటువంటి ముందుచూపు ప్రణాళికలు లేకపోతే.. భవిష్యత్తులో వచ్చే ముప్పులను ఎదుర్కోవడం చాలా కష్టతరం అవుతుంది.
కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు
నేటిసమాజం టెక్నికల్‌గా, ఆధునిక హంగులతో ముందుకు నడుస్తోంది. ఒకదాని తర్వాత ఇంకొకటి తరచూ కొత్త కొత్త సాధనాలు, పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. అటువంటి వాటిని చూసినప్పుడు యువతీయువకులు తొందరగా ఆకర్షితులవుతారు. వాటిని ఎలాగైనా పొందాలనే పట్టుదలతో ఖర్చు చేసేస్తారు. అనవసర ఖర్చుతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఒక్కసారిగా ఖర్చుచేసుకుని కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. కాబట్టి అటువంటి సమయాల్లో మనకు ఏది అవసరం..? ఏది అనవసరం..? అనే వాటి గురించి ఒక్కసారి ఆలోచన చేసుకోవడం చాలా మంచిది. అప్పుడే మనం మన డబ్బును పొదుపు చేసుకోగలుగుతాము.
ప్రణాళిక ప్రకారం
సాధారణంగా ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరి దగ్గర క్రెడిట్ కార్డు వుండటం సహజం. కాని ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి... క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నాంటే బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నట్టే లెక్క. క్రెడిట్ కార్డు వుంది కదా అని ఎక్కడ బడితే అక్కడ దానిని వాడుకోవడం, స్థాయికి మించిన ఖర్చులు చేసుకోవడం వల్ల బ్యాంకు రుణాలు అధికంగా పెరిగిపోతాయి. ఫలితంగా సంపాదించుకునే డబ్బును మొత్తం కేవలం బ్యాంకులకే తీరుస్తూ కాలాన్ని గడపాల్సి వస్తుంది. కాబట్టి నిర్ణీత ప్రణాళికలను ఏర్పరుచుకుని క్రెడిట్ కార్డులను వాడుకోవడం చాలా మంచిది.
ఉపయోగాన్ని బట్టి కొనుగోలు
మనకు ఏదైనా ఒక వస్తువు అవసరమైనప్పుడు అది మనకు తాత్కాలికంగా కాకుండా భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుందా లేదా అన్న దాని గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలి. తాత్కాలికమైంది కేవలం ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత దానితో ఎటువంటి అవసరం వుండదు. కాబట్టి ఇటువంటి వస్తువులను ఖరీదు చేసేటప్పుడు ఎక్కువ డబ్బులు వెచ్చించకుండా తక్కువలో వుండేవిధంగా చూసుకోవాలి.
మరికొన్ని సూచనలు...
చిన్నవయసులోనే ఉద్యోగం సంపాదించుకున్నవారు డబ్బును ఎలా ఖర్చు చేసుకోవాలన్న ఆలోచన కంటే.. ఆ డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలనే దిశగా ఆలోచించుకుంటే చాలా మంచిది. మొదటి జీతం నుంచే వచ్చే డబ్బులను పొదుపు దిశగా మళ్లించుకుంటే భవిష్యత్‌లో వచ్చే కష్టాలను సులభంగా ఎదుర్కోవచ్చు. ఇటువంటి ప్రణాళికలు మొదటినుంచే మొదలుపెడితే అదొక అలవాటుగా మారిపోతుంది.
బాధ్యతలు తక్కువ కాబట్టి...
పెండ్లికి ముందు నుంచి ఉద్యోగం చేస్తున్నవారికి కొంత వరకు బాధ్యతలు చాలా తక్కువగా వుంటాయి. అంటే.. ఇంట్లో ఖర్చులు, కుటుంబ బాధ్యతల వంటి సమస్యలు వుండవు కాబట్టి ఆర్థికంగా ఎటువంటి సమస్యలూ వుండవు. అటువంటి సమయాల్లో వచ్చే జీతంలో వ్యక్తిగత ఖర్చులకు పోనూ.. మిగిలిన డబ్బులను పొదుపు చేసుకోవడం ఒక మంచి పద్ధతి.
వారికి ఆసరా...
పెట్టుబడులు పెట్టుకోకుండా ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటే నిర్భయంగా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పెండ్లి సమయంలో, తర్వాత అవసరమయ్యే ఖర్చును భరించుకోవచ్చు. తల్లిదండ్రులకు అండగా వుంటూ.. వారికి జీవిత, ఆరోగ్య బీమాలు చేయించుకోవడం చాలా మంచిది. ఇలా చేయడంవల్ల డబ్బును పొదుపు చేసుకోవడంతోపాటు వారి జీవితానికి ఒక ఆసరా కల్పించినట్టవుతుంది. ు