Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రియాంక చోప్రా... దేశంలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో జేజేలు అందుకుంటున్న అందాల తార. అంతర్జాతీయ యవనికపై వెలుగులు విరజిమ్ముతున్న ప్రియాంక అనేక సవాళ్లు ఎదుర్కొన్నది. 'నా కూతురు కొన్నింటిని ఒప్పుకోనందుకు సినిమా అవకాశాలను పోగొట్టుకుంది' అని ప్రియాంక తల్లి డాక్టర్ మధుచోప్రా ఇటీవల చెప్పిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. సినిమా ఇండిస్టీలో ప్రియాంక ప్రయాణం గురించి తల్లి పంచుకున్న కొన్ని ముచ్చట్లు.
''బాలీవుడ్లో ప్రవేశించినప్పుడు ప్రియాంక వయసు 17 ఏండ్లు మాత్రమే. మూడేండ్ల కిందటిదాకా ప్రతి నిమిషం నేను తనను అంటిపెట్టుకునే ఉన్నాను. తనకు అసౌకర్యం అనిపించిన, ఇష్టంలేని ప్రాజెక్టులనుంచి నిరభ్యంతరంగా బయటికి వచ్చేది ప్రియాంక. ఆమెను కలిసిన కొందరు పెద్దలు 'మీకు కథ చెబుతున్నప్పుడు మీ అమ్మగారు మీతోపాటే ఉంటారా?' అని అడిగేవారు. దానికి ప్రియాంక 'మా అమ్మ వినగూడని స్క్రిప్ట్ అయితే నేను కూడా వినలేను' అని చెప్పి ఆ ప్రాజెక్ట్ వదిలేసేది. ఒక్కసారైతే ఓ డైరెక్టర్ ప్రియాంకను 'ఈ బట్టలు (టు పీస్) వేసుకొని కెమెరా ముందు అందంగా చూపించుకోలేనప్పుడు.. ప్రపంచ సుందరి అయితేనేం? మరోటి అయితేనేం?' అని నిర్లక్ష్యంగా మాట్లాడాడు. వెంటనే ఆ ప్రాజెక్టునుంచి బయటికి వచ్చేసింది ప్రియాంక. అట్లా పది హిట్ సినిమాలు పోగొట్టుకుంది. అయినా తనెప్పుడూ బాధపడలేదు. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే... మనకంటూ టైమ్ వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలి''
'నో' చెప్పేయండి...
''హాలీవుడ్లో ప్రవేశించేనాటికి ప్రియాంక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అయినా హాలీవుడ్లో ఆమెకు మంచి గౌరవం దొరికింది. నీవు నమ్మినదానికోసం జీవిస్తే... పెద్ద సమస్యలు ఎదురు కావచ్చు. కానీ ఫలితం బాగుంటుంది. కాబట్టి ప్రతి అమ్మాయికి చెప్పేది ఒక్కటే రాజీ పడుతూ బతకకండి. కష్టపడితే మంచి జీవితం ముందుంటుంది. ప్రపంచ సుందరిగా ఎంపికైంది కాబట్టే.. సినిమా పరిశ్రమలో కొన్నింటిని నో చెప్పగలిగింది. అయితే మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే... 'నో' చెప్పాలనుకున్న కచ్చితంగా నో చెప్పేయండి. అదికాకపోతే మరోటి బోలెడన్నీ అవకాశాలు ముందుంటాయి'' అని ప్రియాంక జీవితాన్ని స్ఫూర్తి కథగా చెబుతోంది మధుచోప్రా. నిజమే కూతురుకు సహకారమందించే తల్లి... తన కలలు నిజం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తున్న కూతురు... ఈ ఇద్దరూ నేటి మహిళలకు ప్రేరణనిచ్చేవారే. మహిళల మధ్య సహకార అవశ్యకతను బోధిస్తున్నారు.
తెలుగులోనే తొలి సినిమా...
'మేరీ కోమ్' సినిమాలో ప్రియాంక చోప్రా ఎంతలా కష్టపడిందో, చిత్రసీమలో నిలదొక్కుకోవడానికి ఆమె అదే స్థాయిలో శ్రమించిందనే చెప్పాలి. నిజానికి ప్రియాంక తొలి చిత్రం 'అపురూపం' అనే తెలుగు సినిమా. ఇది ఇప్పటికీ వెలుగు చూడలేదు. తరువాత 'తమిళన్' అనే తమిళ చిత్రంతో తొలిసారి వెండితెరపై తళుక్కుమంది ప్రియాంక. అప్పట్లో ఎవరూ ప్రియాంక ఈ స్థాయికి చేరుకుంటుందని ఊహించలేదు. అవమానాలు ఎదురైనా పట్టుదలతో ముందడుగు వేసిన ప్రియాంకను ఇప్పుడు అనూహ్యమైన విజయాలు వరించాయి... 'ఫ్యాషన్'తో ఉత్తమనటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది. 'బేవాచ్' మూవీతో హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ప్రియాంక తొలి తెలుగు చిత్రం వెలుగు చూడకపోయినా, మన తెలుగు హీరో రామ్ చరణ్ సరసన 'జంజీర్' రీమేక్‌లో నటించి అలరించింది. ు