Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతిరోజూ మీరు ఎంతో కొంత సంగీతాన్ని వినవల్సి వస్తుంది. సంగీతం అనేది ఎదో ఒక రకంగా మన చుట్టూ ఎంతో కొంత ఎప్పుడూ వినపడుతూనే ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా దుకాణానికి వెళ్లినా, పనిచేసే ప్రదేశంలో, జిమ్లో లేదా ఇంటికి వెళ్తే టి.వి నుండి ఇలా ఎదో ఒక రకంగా ఎక్కడో ఒక దగ్గర నుండి సంగీతం మనం వింటూనే ఉంటాం. మీకు తెలియకుండానే మీరు వింటున్న సంగీతం అనేక విధాలుగా మీ పై ప్రభావం చూపుతుంది. అవేంటో తెలుసుకుందాం....
హావభావాల్లోను...
ఆనందం లేదా దు:ఖంతో కూడిన సంగీతం, ఎదుటి వ్యక్తుల హావభావాలను అంచనా వేసే ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. మీరు వినే సంగీతం ఆనందం చేకూర్చేదైనా లేదా బాధను కలిగించేదైనా, ఏదైనా సరే మీ ఆలోచనా ధోరణి, మానసిక స్థితిపై నేరుగా ప్రభావం చూపుతుంది. ద్ణుఖాన్ని కలిగించే సంగీతాన్ని అలానే కొద్దిసేపు కనుక విన్నట్లైతే, ఆ తర్వాత సాధారణ మనిషి ముఖంలో ఏవైనా మాములు హావభావాలను చూసినా మీరు వాటిని దు:ఖమైన భావాలుగానే భావిస్తారు. మీరు ఆనందమైన సంగీతం విన్న తర్వాత కూడా ఇలాంటి అనుభవమే కలుగుతుంది. ఇలా ఏ సంగీతాన్ని అయితే వింటారో అదేవిధంగా ఆలోచించడం అనేది సాధారణమైన హావభావాల్లోనే కాదు, ఇతర హావభావాల సమయంలో కూడా ఇదే వర్తిస్తుంది. కాకపోతే సాధారణ హావభావాలను చూసినప్పుడు వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
రచయితలపై ఎక్కువ ప్రభావం...
పరిసర ప్రాంతాల నుంచి వచ్చే సంగీతం సృజనాత్మకతను పెంచుతుంది. సాధారణంగా మీ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో సహజంగా వినిపించే సంగీతాన్ని ఆస్వాదించడం వల్ల సృజనాత్మకత పెరుగుతుందట. ముఖ్యంగా ఈ ప్రభావం రచయితలలో ఎక్కువగా ఉంటుందట. సైన్స్ ప్రకారం మధ్యస్థంగా ఉన్న సంగీతాన్ని వినడం ద్వారా వ్యక్తిలో సృజనాత్మకత పెరుగుతుందని చెబుతున్నారు. ఇందుకు గల కారణం ఏమిటంటే, ఇలాంటి సంగీతాన్ని వినేటప్పుడు మన మెదడు ఆ సంగీతాన్ని లోతుగా అర్ధం చేసుకోవడానికి ఎంతో తపన పడుతుంది. అయితే మీరు గనుక సంగీతాన్ని శృతి మించిన శబ్దంతో వింటే మీ మెదడు అర్ధం చేసుకొనే శక్తిని కోల్పోయే అవకాశం ఉంది.
డ్రైవింగ్ సమయంలో...
డ్రైవింగ్ చేసేటప్పుడు సంగీతం వినడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ముఖ్యంగా యువత ఎక్కువగా తమకు నచ్చిన సంగీతాన్ని వింటూ డ్రైవ్ చేస్తున్నప్పుడు మరీ ఎక్కువ తప్పులు చేస్తున్నారని తేలింది. డ్రైవింగ్ చేసే సమయంలో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారట. ఏ సంగీతం అయితే మిమ్మల్ని తక్కువగా ఉత్తేజపరుస్తుందో అటువంటి సంగీతం డ్రైవింగ్ చేసే సమయంలో వింటే సరిపోతుంది.