Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొదటి ప్రపంచ యుద్ధాన్ని వ్యతిరేకించిన స్వేచ్ఛావాది మోలీ స్టిమేర్. ట్రేడ్ యూనియన్ నాయకురాలు. రష్యాపై అగ్రరాజ్యం సాగించిన అరాచకాలను ప్రజలకు తెలియజేస్తూ.. కరపత్రాలు పంచుతూ అనేక సార్లు సైన్యం చేత బంధించబడిన ఆమె 15 ఏండ్ల పాటు జైలుశిక్ష అనుభవించారు.
నైరుతి రష్యాలోని డనావేస్టీ గ్రామంలో జన్మించిన స్టిమేర్ ఆ తర్వాత తన కుటుంబంతో 1913 లో యునైటెడ్ స్టేట్స్కు వలసవెళ్లారు. పెద్ద కుటుంబం కావడం.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు చదవలేకపోయిన ఆమె తన 15ఏండ్ల వయసులోనే న్యూయార్క్ లోని బట్టల పరిశ్రమలో పనిచేయడం ప్రారంభించారు. సోషలిజంవైపు మొగ్గు చూపడంతో పాటు ట్రేడ్ యూనియన్లోనూ చేరారు. క్రోపోట్కిన్, గోల్డ్‌మన్ రచనలను రాడికల్ సాహిత్యాన్ని చదవడం ప్రారంభించారు. వాటి ప్రభావంతో ఆమె స్వేచ్ఛావాదిగా మారారు. రష్యన్ విప్లవం తర్వాత ఆమె ఆందోళన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1918లో బోల్షెవిక్ విప్లవానికి వ్యతిరేకంగా యుఎస్ సైనిక చర్యను నిరసిస్తూ కరపత్రాలను ప్రింట్ చేయడం, వాటిని ప్రజలకు పంపిణీ చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆమెను అరెస్టు చేసి 15ఏండ్ల జైలు శిక్ష విధించారు. 1921లో ఆమె స్థానిక రష్యాకు తరలించబడ్డారు. ఆ తర్వాత1923లో జర్మనీకి తరలించారు. జర్మనీలో హిట్లర్ అధికారంలోకి వచ్చినప్పుడు ఫ్రాన్స్‌కు వెళ్ళి ఆ తర్వాత చివరకు మెక్సికోచేరుకున్నారు. తన జీవితకాల సహచరుడైన ఫ్లెలిన్తో కలిసి చివరి వరకు మెక్సికోలోనే జీవితాన్ని గడిపారు. అక్కడ వారు ఒక ఫోటోగ్రాఫిక్ స్టూడియోను నిర్వహించారు. ప్రపంచమంతటా పనిచేస్తున్న ట్రేడ్యూనియన్లతో, కామ్రేడ్లతో కలిసి పనిచేశారు. 82 ఏండ్ల తన జీవితకాలంలో కార్మికల హక్కుల కోసం, స్వేచ్ఛకోసం జరిగిన పోరాటాల్లో ఆమె విశేష కృషి చేశారు.