Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాతావరణం చల్లగా ఉంటే వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. అది రెగ్యులర్ రెసిపీస్ కాకుండా కాస్త స్పెషల్స్ అయితే ఇంకా బాగుంటుంది. అదే చికెన్‌తో చేసినది అయితే నోరూరిపోతుంది. అలాంటి నోరూరించే చికెన్ స్పెషల్స్ ఇవి. ఓసారి ప్రయత్నించండి.
చికెన్ వడలు
కావాల్సిన పదార్థాలు: చికెన్ (బోన్‌లెస్) - అరకిలో, కొబ్బరి తురుము - అరకప్పు, ఉల్లి తరుగు - అర కప్పు, పచ్చి మిర్చి - నాలుగు, దాల్చిన చెక్క - చిన్న ముక్క, గోధుమ రవ్వ - చెంచా, లవంగాలు - రెండు, కరివేపాకు - రెండు రెబ్బలు, అల్లం తరుగు - ఒక చెంచా, నూనె - సరిపడినంత, ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం : చికెన్ శుభ్రంగా కడిగి తడి లేకుండా చేయాలి. నూనె తప్ప పైన ఉన్న మిగతా పదార్థాలన్నీ చికెన్‌తో సహా మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. మరీ గట్టిగా ఉంటే కాస్త నీళ్లు పోసి మరీ మిక్సీ వేయాలి. ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి బాగా వేడి చేయాలి. అందులో చికెన్ మిశ్రమాన్ని వడల్లా అద్ది నూనెలో వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే చికెన్ వడలు రెడీ అయినట్టే.
ఓట్ క్రస్ట్డ్ చికెన్
కావాల్సిన పదార్థాలు:
చికెన్ (ఛాతీభాగం) - 300 గ్రా., ఉప్పు - సగం చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద- రెండు చెంచాలు, పచ్చిమిర్చి ముద్ద - ఒక చెంచా, ఓట్స్ - ఒకకప్పు, ముప్పావు కప్పు - గోధుమ పిండి, పెప్పర్ - ఒక చెంచా, వెల్లుల్లి పొడి - ఒక చెంచా
తయారుచేసే విధానం :
చికెన్ మొదట పలుచని పొరల్లా కట్ చేసుకోవాలి. తరువాత దాన్ని పొడుగు ముక్కల్లా చేసుకోవాలి. ఇందులో ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా కలపాలి. ఓ అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓట్స్‌ను మిక్సీలో వేసి బరదగా పట్టుకోవాలి. ఇందులో ఉప్పు, పెప్పర్, వెల్లుల్లి పొడి వేయాలి. ఇప్పుడు చికెన్ ముక్కలను తీసుకుని.. వాటికి బ్రష్‌తో ఆయిల్ పూయాలి. తరువాత వాటిని ఓట్ మిశ్రమంలో ముంచి నూనెలో వేయించుకోవాలి. రెండువైపులా పూర్తిగా కాలేలా చూసుకోవాలి. క్రిస్పీగా ఉండే ఓట్ క్రస్టెడ్ చికెన్‌ను పిల్లలు ఇష్టంగా తింటారు.
చికెన్ డ్రమ్‌స్టిక్స్
కావాల్సిన పదార్థాలు:
చికెన్ డ్రమ్‌స్టిక్స్ - ఆరు, నూనె - రెండు చెంచాలు, కరివేపాకు - ఒక రెమ్మ, జీలకర్ర- ఒక చెంచా, కొబ్బరి తురుము- రెండు చెంచాలు, ఉల్లిగడ్డలు - రెండు, టమాటా తరుగు - ఒకటి, పచ్చిమిర్చి - 2
( తరిగినవి), వెలుల్లి - 5 (తరిగినవి), అల్లం - ఐదు ఇంచులు (తరిగినది), పసుపు - చిటికెడు, పెప్పర్ - ఒక చెంచా, ధనియాపొడి - ఒక చెంచా, కారం - ఒక చెంచా, గరం మసాలా - ఒక చెంచా, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం :
ఒక పాన్ తీసుకుని నూనె పోయాలి. అందులో జీలకర్ర వేసుకోవాలి. కొంచె వేగాక ఉల్లిగడ్డలు, అల్లం, వెల్లుల్లి తురుము, పిచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేయించాలి. ఉల్లి ముక్కలు ఉడికాక టమాట, పసుపు వేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు కారం వేసి కలపాలి. ఇందులో కొత్తిమీర, జీలకర్ర పొడి, మసాల వేసి నూనె తేలేవరకు ఉడకనివ్వాలి. దీనికి కొబ్బరి తురుము చేర్చాలి. తరువాత చికెన్ వేసి బాగా కలిపి మూతపెట్టుకోవాలి. మీడియం మంట పెట్టి రెండు చెంచాల నీటిని పోయాలి. చికెన్ బాగా ఉడికి నీరంతా ఇంకిపోతుంది. ఇప్పుడు మూత తీసి వేయించాలి. బాగా వేగిన తరువాత కొత్తిమీర వేసి దించేయాలి.
కేరళ చికెన్ రోస్ట్
కావాల్సిన పదార్థాలు : చికెన్ - 1 కిలో, మారినేషన్ కోసం పసుపు - పావు చెంచా, కారం- పావుచెంచా, ధనియా పొడి - పావుచెంచా, నిమ్మరసం - ఒక చెంచా, వెల్లుల్లిపాయలు - ఐదు, పచ్చిమిర్చి-మూడునుంచి ఐదు, ఉప్పు- సరిపడినంత ఫ్రై చేయడానికి : ఉల్లిగడ్డలు - మూడు, టమాటా ప్యూరీ- 1 టమాట , పచ్చిమిర్చి-రెండు, కరివేపాకు - రెండు ఆకులు, గరంమసాలా పొడి - పావు చెంచా, పెప్పర్ పౌడర్- పావుచెంచా, నిమ్మరసం - ఒక నిమ్మకాయ, నూనె - సరిపడా
తయారుచేసే విధానం :
చికెన్‌ను శుభ్రంగా కడగాలి. మారినేషన్‌కోసం తీసుకున్న పదార్థాలన్నీ మిక్సీలో వేసి పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలను పట్టించి ఓ గంటపాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు మరోపాన్ తీసుకుని నూనె పోసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసి కొంచెం వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో చికెన్ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసి, పక్కన పెట్టుకోవాలి. మరో పాన్ తీసుకుని అందులో రెండు చెంచాల నూనె వేసి... పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇందులో టమాటా ప్యూరీని చేర్చాలి. ఒక నిమిషం ఉడికాక... అందులో పక్కకు పెట్టుకున్న చికెన్‌ను వేసి వేగనివ్వాలి. టమాటా పేస్టు అన్ని ముక్కలకు పట్టిన తరువాత గరం మసాలా పొడి, పెప్పర్ పౌడర్ వేసి బాగా కలపాలి. కొద్దిగా నిమ్మరసం చేర్చాలి. ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తరువాత ఇప్పుడు వేయించి పక్కకు పెట్టిన ఉల్లి ముక్కలను పైన చల్లి దించేయాలి. అంతే కేరళ చికెన్ రోస్ట్ రెడీ!
చికెన్ పోపెర్స్
కావాల్సిన పదార్థాలు: చికెన్-1/4 కిలో, ఉప్పు-తగినంత, మిరియాలపొడి- 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టేబుల్ స్పూన్, గుడ్లు- 3, గోధుమ పిండి-1 కప్పు, నూనె- డీప్ ఫ్రైకి సరిపడా, వెన్న -5 టేబుల్ స్పూన్లు, సోయా సాస్- 2 టేబుల్ స్పూన్లు, టమాటా-1(మెత్తని గుజ్జు), నిమ్మరసం-3 టేబుల్ స్పూన్లు, తేనె -ముప్పావు కప్పు
తయారుచేసే విధానం :
చికెన్ ముక్కల్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెండు చిన్నచిన్న బౌల్స్ తీసుకుని ఒకదానిలో గుడ్డుసొన మరో దానిలో గోధుమ పిండి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్‌లో నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఈ లోపు చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా గోధుమ పిండిలో అద్ది తర్వాత ఎగ్ బౌల్లో ముంచాలి. మళ్ళీ గోధుమ పిండిలో ముంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని చికెన్ ముక్కల్నీ డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్ తీసుకుని వెన్న, సోయా సాస్, నిమ్మరసం, తేనె ఒకదాని తర్వాత ఒకటి వేసి వేడి చేసుకోవాలి. అందులో డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసి కలుపుకోవాలి. కాస్త దగ్గర పడిన తరువాత దింపేసుకోవాలి. వీటిని చెట్నీలో నంజుకుని తింటే టేస్టీగా వుంటాయి.