Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడ చూసినా డిస్కౌంట్లు, ఆఫర్లు. అవసరం లేకపోయినా, లేదంటే స్థాయికి మించి కొనడం సర్వసాధారణం. ఇలాంటప్పుడు ఉపయోగపడేది క్రెడిట్ కార్డే.. అయితే, ఇప్పుడు ఆ బిల్లుల చెల్లించలేక.. 'నెలసరి వాయిదా'ల్లోకి మార్చుకోవాలనుకుంటున్నారు చాలామంది. క్రెడిట్ కార్డు మీద భారీ మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు నెలసరి వాయిదాల్లో చెల్లించడం ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. తాత్కాలికంగా చేతిలో నగదు లేనప్పుడు ఈ సౌకర్యం మంచి ఉపశమనమే. ఇప్పుడు ఏది కొన్నా.. వాయిదాల్లోకి మార్చుకునే సదుపాయం ఉంటోంది. పైగా కొన్నింటికి ఎలాంటి వడ్డీ కూడా లేకుండానే ఈ సదుపాయాన్నీ ఇస్తున్నాయి. ఈఎంఐలో తీసుకుంటే.. నగదు వెనక్కి అంటూ.. 5-10 శాతం వరకూ ప్రత్యేక సదుపాయాలూ ఉంటున్నాయి. ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి.
కొనేటప్పుడే...
ఒక వస్తువును కొన్న తర్వాత బిల్లు వచ్చాక పూర్తి స్థాయిలో చెల్లిస్తారా.. ఈఎంఐలో చెల్లించాలని నిర్ణయించుకున్నారా అనేది ముందుగానే చూసుకోండి. ఎందుకంటే.. మీరు కొనేప్పుడు ఈఎంఐగా మార్చుకుంటే సున్నా శాతం వడ్డీ ఉండొచ్చు. అదే మీరు కొనుగోలు పూర్తి చేసిన తర్వాత, బిల్లు వచ్చే సమయానికి ఈఎంఐగా మార్చుకుంటే.. భారీ వడ్డీతోపాటు... ప్రాసెసింగ్ ఫీజుల్లాంటివీ ఉంటాయి. వీటికి అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. వాయిదాలకు చెల్లించే కాబట్టి, మీరు వాయిదాల్లో కొనాలనుకుంటే.. ఆ వస్తువుకు బిల్లు చెల్లించేప్పుడే నిర్ణయం తీసుకోండి.
కనిపించకుండా...
పేరుకు సున్నా శాతం వడ్డీ అయినప్పటికీ కొన్నిసార్లు అదనంగా రుసుములు వసూలు చేస్తుంటాయి బ్యాంకులు. వీటినీ చూసుకోండి. వ్యవధి తీరకముందే చెల్లించాలనుకున్నా.. బాకీ ఉన్న మొత్తంపై 3శాతం వరకూ రుసుము విధిస్తాయి. ఒకసారి ఈఎంఐగా మార్చుకున్న తర్వాత కచ్చితంగా నెలనెలా బాకీని చెల్లించండి. ఒక్కసారి చెల్లించకపోయినా.. అధిక మొత్తంలో రుసుములు విధిస్తారు. పైగా మిగతా మొత్తాన్ని సాధారణ కార్డుబాకీగా మార్చి మరుసటి నెల బిల్లులో కలిపి పంపిస్తారు.
జాప్యం వద్దు...
క్రెడిట్ కార్డు రెండువైపులా పదునున్న కత్తిలాంటిదనే సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. అత్యవసరం అనుకుంటేనే కార్డును ఉపయోగించి కొనుగోళ్లు చేయాలి. వాయిదాల్లో కట్టేందుకు అవకాశం ఉంది కదా! అని అక్కర్లేనివన్నీ కొంటే... మన ఆర్థిక ప్రణాళికే దెబ్బతింటుదన్న విషయం మర్చిపోకూడదు. కార్డుల వాడకంలో ఎంత దూకుడుగా ఉంటామో.. వాటికి బిల్లులు చెల్లించే విషయంలో అంతే క్రమశిక్షణగా ఉండాలి. లేకపోతే.. అనవసర వడ్డీలు, రుసుములు మనపై భారం మోపుతాయి. రుణ చరిత్ర, క్రెడిట్ స్కోరులాంటివి కూడా దెబ్బతింటాయి. పూర్తి బిల్లు చెల్లించకపోయినా... కనీస మొత్తం చెల్లించే విషయంలోనైనా ఎప్పుడూ జాప్యం చేయకండి.
మీరు కొనుగోలు చేసిన మొత్తాన్ని బట్టి, మీ క్రెడిట్ కార్డు మీకు కొన్ని రివార్డు పాయింట్లను కేటాయిస్తుంది. మీరు కార్డు వాడిన ప్రతిసారీ ఎన్నో కొన్ని రివార్డు పాయింట్లు మీ ఖాతాలో జమ అవుతాయి. ఇవి నిర్ణీత సంఖ్యకు చేరిన తర్వాత నగదుగా మార్చుకోవచ్చు. లేదా ఏదైనా వస్తువులు కొనుగోలు చేయవచ్చు. మీరు కార్డును ఉపయోగిస్తున్నందుకు ఏదైనా ఫీజులు చెల్లించాల్సి వచ్చినప్పుడు ఈ రివార్డు పాయింట్లను అందుకు ఉపయోగించుకొని, మీపై భారం లేకుండా చూసుకోవచ్చు.