Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య కాలంలో షాపింగ్ కోసం క్రెడిట్ కార్డు వాడకం ఎక్కువయింది. క్రెడిట్ కార్డుతో షాపింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే విషయం రివార్డు పాయింట్లు. కంపెనీని బట్టి రివార్డు పాయింట్స్ సౌలభ్యాలు మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో రివార్డు పాయింట్ల వల్ల కలిగే ప్రయోజనం, సకాలంలో వీటిని ఎలా ఉపయోగించాలి, అలా వాడుకోకపోతే ఏమవుతోందో తెలుసుకుందాం.
- రివార్డు పాయింట్స్ కోసమే చూడకూడదు. ఎందుకంటే రివార్డు కార్డులకు సాధారణ కార్డుల కన్నా అధిక వడ్డీ వసూలు చేస్తారు. అన్ని కార్డులు, లావాదేవీలకు రివార్డు పాయింట్లు ఒకేలా ఉండవు. సాధారణంగా వినియోగించే ప్రతి 100 నుంచి 150 రూపాయలకు ఒకటి లేదా రెండు పాయింట్లు వస్తాయి. ఇలా ఆర్జించిన రివార్డు పాయింట్లన్నంటినీ ఉపయోగిం చుకుని కంపెనీ అందించే వివిధ వస్తువులు లేదా సేవలను పొందవచ్చు.
- కొన్ని కంపెనీలు రిడీమ్ చేసేందుకు సైతం రుసుములను విధిస్తున్నాయి. ఇందుకోసం క్రెడిట్ కార్డు నియమనిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఏదైనా సందేహం వస్తే కస్టమర్ కేర్‌ను సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవాలి.
- చాలా మంది ఎక్కువ పాయింట్ల కోసం ఎక్కువ కొనాలనుకుంటారు. అలా కాకుండా తెలివిగా కార్డును వాడుకోవడం ద్వారా ఎక్కువ పాయింట్లను సంపాదించవచ్చు.
- పండుగల సమయాల్లో బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు వివిధ ఆఫర్ల మెయిల్స్ పంపుతుంటాయి. వాటన్నింటినీ అలా వదిలేయకూడదు. అప్పుడప్పుడు అవసరాలకు తగిన వాటిపై ఆఫర్లు ఏమైనా ఉంటే గమనిస్తూ ఉండాలి.
- క్రెడిట్ కార్డు కంపెనీలు ట్రావెల్ కంపెనీలతోను, రెస్టారెంట్లతోనూ, వస్త్ర దుకాణాలతో కలిపి క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటిస్తాయి. కొన్ని కంపెనీలు గిఫ్ట్వోచర్లను ప్రకటిస్తాయి. వాటితో ట్రావెల్ కంపెనీల టికెట్లను, రెస్టారెంట్లలో డిస్కౌంట్లకు వాడుకోవచ్చు.
- కొన్ని కార్డులు పెట్రోల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని, పెట్రోలు, డీజిల్ కొన్న ప్రతిసారీ కొంత శాతం ధర తగ్గించి ఇస్తున్నాయి. తరుచూ విమాన ప్రయాణాలు చేసేవారికి, విమాన టికెట్లలో రాయితీలను పొందేందుకు కొన్ని కార్డులు అవకాశం కల్పిస్తున్నాయి.
- గోల్డ్ క్రెడిట్ కార్డులు కలిగిన వారికి క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో పాటు రివార్డు పాయింట్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని కంపెనీలు రివార్డు పాయింట్లను నగదుగా మార్చుకునేందుకు సైతం వీలు కల్పిస్తున్నాయి.
పాయింట్ల ద్వారా ప్రయోజనం
పాయింట్లను ఎలా రిడీమ్ చేసుకోవాలో బ్యాంక్ వెబ్సైట్లలో పొందుపరుస్తారు. రిడీమ్ చేసుకున్న పాయింట్లతో వచ్చే సదుపాయాలు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి.
1. రివార్డు పాయింట్లతో ఎంపిక చేసిన బట్టల, గోల్డ్, చెప్పుల, ఎలక్ట్రానిక్ కంపెనీల వంటి వాటిలో ఏవైనా వస్తువులు కొనేందుకు ఉపయోగించవచ్చు.
2. ఎక్కువ కంపెనీలు కస్టమర్ కేర్ ప్రతినిధులకు ఫోన్‌చేసి మీకు వర్తించే ఆఫర్లను తెలుసుకుని వెంటనే ఆర్డర్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. తర్వాత మీకు దగ్గరగా ఉండే చోట ఆ వస్తువులను పొందవచ్చు.
3. కంపెనీ వెబ్సైట్లలో రిడెంప్షన్ ఫామ్ లభిస్తుంది. దాన్ని పూర్తిచేసి అక్కడ తెలియపరిచిన చిరునామాకు దాన్ని పోస్ట్ చేయాలి.
4.కంపెనీ వెబ్సైట్లలో నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అవ్వాలి. క్రెడిట్ కార్డు నెంబరును పొందుపరచాలి. పాయింట్స్ రిడీమ్ ఆప్షన్ ఎంచుకోవాలి. రిడెంప్షన్‌ను ఎంచుకున్న తర్వాత సబ్మిట్ నొక్కాలి. రిడీమ్ చేసిన తర్వాత రిడెంప్షన్ ఆర్డర్ నంబరు వస్తుంది. ఏదైనా సమస్య వస్తే చెక్ చేసుకోడానికి వీలుగా దాన్ని రాసి ఉంచుకోవాలి.
5. కొంత శాతం నగదు చెల్లించడం, మిగిలిన ధరకు రిడీమ్ చేసిన పాయింట్లను వాడుకునే సౌలభ్యాన్ని కల్పిస్తూ కొన్ని కంపెనీలు వస్తుసేవలను అందిస్తున్నాయి.
6. సాధారణంగా కంపెనీ వెబ్సైట్లో లాగిన్ అవ్వగానే రిడీమ్ చేసే వస్తువులు, సేవలకు సంబంధించిన కేటలాగ్ ఉంటుంది. దాని ఆధారంగా మనకు ఉత్తమమైన దానిని ఎంచుకోవచ్చు. కొన్ని వెబ్సైట్లలో రివార్డు పాయింట్ల సంఖ్య, వస్తువుల కేటగిరీలను బట్టి ఆ పరిధిలోకి వచ్చే వస్తువులను అందుబాటులో ఉంచుతాయి. మనకు నచ్చిన దానిని ఎంపిక చేసుకుని ఆర్డర్ చేయవచ్చు.
ఇలా క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడుతూ రివార్డు పాయింట్లను సకాలంలో వినియోగించుకుంటే కార్డు వల్ల మేలు కలుగుతుంది.