Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీణ, శ్రీధర్ది ఒకే ఊరు. ఒకే వీధిలో ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. వీణకు చిన్నప్పటి నుంచే శ్రీధర్ అంటే చాలా ఇష్టం. శ్రీధర్‌కు కూడా వీణంటే ప్రాణం. అయితే వీణ వాళ్ళ ఇంట్లో వీరి ప్రేమ గురించి తెలిసింది. వీణకు ఇంట్లో వీరే సంబంధం చూశారు. దాంతో ఆమె ఇంట్లో నుంచి వచ్చేసి శ్రీధర్ దగ్గరకు వెళ్ళింది. అదే రోజు ఇద్దరూ గుళ్ళో పెండ్లి చేసుకున్నారు. పెండ్లి తర్వాత ఇద్దరూ పదిరోజులు చాలా సంతోషంగా గడిపారు.
వీణ బ్యాంక్ పోస్ట్ కోసం ప్రిపేరై పెండ్లి తర్వాత పరీక్షలు కూడా రాసింది. పరీక్షలు రాసిన తర్వాత రోజు వాళ్ళ ఇంట్లో తమ పెండ్లి గురించి చెప్పి వస్తానని శ్రీధర్‌తో అన్నది. అయితే అక్కడకు వెళ్ళడానికి అతను ముందు ఒప్పుకోలేదు. అక్కడకు వెళితే వాళ్ళు వీణను ఏం చేస్తారో అని భయపడ్డాడు. కానీ ఆమె మాత్రం నమ్మకంతో ఎలాగైనా వాళ్ళను ఒప్పిస్తానని చెప్పి శ్రీధర్‌కు ధైర్యం చెప్పి మరీ వెళ్ళింది. అయితే అక్కడకు వెళ్ళిన తర్వాత వీణ, శ్రీధర్‌తో మాట్లాడడం తగ్గించింది. ఎప్పుడు ఫోన్ చేసినా 'రెండు రోజుల్లో వస్తా' అని చెప్పేది. రోజుకో మాట చెప్పి తప్పించుకునేది.
చివరకు ఓ రోజు 'నా దగ్గరకు వస్తావా? రావా?' అని శ్రీధర్, వీణను నిలదీశాడు. ''మళ్ళీ నేను నీ దగ్గరకు వస్తే మా అమ్మానాన్న చచ్చిపోతానంటున్నారు, నాకు భయంగా ఉంది. మనిద్దరం విడిపోదాం, నీ దారి నువ్వు చూసుకో, నా బతుకు నేను బతుకుతా'' అంది. దానికి శ్రీధర్ ''వాళ్ళు అలాగే బెదిరిస్తారు. మనల్ని విడదీయటానికే అలా అంటున్నారు. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఎలాగైనా నా దగ్గరకు వచ్చేసెరు'' అంటూ వీణను బతిమలాడుకున్నాడు. దాంతో చివరకు వస్తానని చెప్పింది.
మళ్ళీ తర్వాత రోజు ఫోన్ చేసి ''నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను మా బావనే పెండ్లి చేసుకుంటాను. నన్ను మర్చిపో, నేను నీ దగ్గరకు ఇక రాను, నీ ముఖం కూడా చూడను'' అంది.
ఇలాంటి పరిస్థితుల్లో శ్రీధర్‌కు ఏం చేయాలో తోచలేదు. దాంతో తన స్నేహితుడిని తీసుకుని ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి 'మేడమ్, మా ఇద్దరికీ పెండ్లి జరిగినప్పటి ఫొటోలు నా దగ్గరే ఉన్నాయి. మీరు ఎలాగైనా వీణను పిలిపించి ఒక్కసారి మాట్లాడించండి. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మానాన్నలు భయపెట్టడం వల్లనే తను ఇలా మారిపోయింది'' అంటూ తన పెండ్లి ఫొటోలు చూపించాడు.
దానికి లీగల్‌సెల్ సభ్యులు 'మేం ముందు వీణతో మాట్లాడాలి. ఆ తర్వాతనే ఏం చేయాలో నిర్ణయించుకుంటాం' అని చెప్పి తన తల్లిదండ్రులను తీసుకురమ్మని వీణకు లెటర్ పంపారు.
తర్వాతి వారం వీణ, తన తల్లిదండ్రులను తీసుకుని లీగల్‌సెల్‌కు వచ్చి ''ఇప్పుడు అతనంటే నాకు అస్సలు ఇష్టం లేదు. అతనితో నేను కలిసి ఉండలేను. మా అమ్మానాన్నలు చూసిన అబ్బాయినే పెండ్లి చేసుకుంటాను'' అని చెప్పింది. దాంతో సభ్యులు 'ఇష్టం లేకపోతే పెండ్లి ఎందుకు చేసుకున్నావు. చిన్నప్పటి నుంచి ఒకరితో ఒకరికి పరిచయం ఉంది. మరి పదిరోజుల్లోనే అతనిపై ఎందుకు అంత అయిష్టం ఏర్పడింది' అని ప్రశ్నించారు.
''మేడం ఒకప్పుడు నేను అతన్ని ఇష్టపడ్డమాట వాస్తవమే. కాని అతను నన్ను కాదు, నా డబ్బును చూసి ప్రేమించాడు. నేను పెండ్లికి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించాడు. ఒక వేళ నేను పెండ్లికి ఒప్పుకోకపోతే కోపంతో నన్ను కూడా చంపుతాడేమోనని భయపడి ఒప్పుకున్నాను. అతను మోసగాడు. అందుకే పదిరోజుల తర్వాత ఎలాగోల అతని బారి నుండి తప్పించుకొని వచ్చాను. ఇష్టం లేని వాడితో జీవితాంతం ఎలా ఉండగలను. అందుకే మా అమ్మానాన్నలు చూసిన సంబంధం చేసుకోవాలని నిర్ణయించుకున్నా'' అంది.
దానికి సభ్యులు ''అతనితో నువ్వు పది రోజులు ఉన్నావు. అప్పుడు అతను నిన్ను ఎలాంటి హింసలు పెట్టలేదు. ఇప్పుడు నీ అంతట నువ్వే వెళ్ళిపోయావు. నీమీద ప్రేమలేకపోతే ఇదే అవకాశంగా తీసుకొని నిన్ను వదిలించుకునే వాడు. కాని అతను అలా చేయకుండా నీ కోసం మా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. నిన్ను మీ ఇంట్లో వాళ్ళు బెదిరిస్తే మాకు చెప్పు. మేం వాళ్ళతో మాట్లాడతాం. అంతేకాని ప్రేమించిన అబ్బాయిని అనవసరంగా వదులుకోకు. మరొక్కసారి ఆలోచించుకో' అని చెప్పి...
'మీరు పెద్దవారు ఒక్కసారి ఆలోచించండి. ప్రేమించుకున్న వారిని వేరు చేయడం మంచిది కాదు. పైగా అతనికి వీణంటే చాలా ఇష్టం. మీరు చూసిన అబ్బాయితో కంటే తను ఇష్టపడిన వాడితోనే మీ అమ్మాయి సుఖంగా ఉండగలుగుతుంది. మీరు చచ్చిపోతామని బెదిరించి ఆమెకు ఈ పెండ్లి చేస్తున్నారు. ఇది ఆమె జీవితానికి మంచిది కాదు' అని లీగల్‌సెల్ సభ్యులు వీణ తల్లిదండ్రులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు.
'మేం ఆమెను ఏమీ బెదిరించలేదు. ఆమె మా ఇంటికి వచ్చి ఇకపై అతని దగ్గరకు వెళ్ళనని ఏడ్చింది. అందుకే వేరే సంబంధం చూశాం. అయినా మా అమ్మాయి జీవితం గురించి మాకు తెలియదా? అనవసరంగా మమ్మల్ని ఇక్కడికి వరకు పిలిచారు. ఏదేమైనా అంతా మా అమ్మాయి ఇష్టప్రకారమే జరుగుతుంది. కావాలంటే ఆమెను అతనితో వెళ్ళమనండి. మేమేమీ అడ్డుచెప్పం' అన్నారు.
''మా అమ్మ వాళ్ళు నన్నేమీ బెదిరించలేదు. ఇక నేను ఆలోచించుకునేదేమీ లేదు. నాకు అతనంటే ఇష్టం లేదు. అప్పుడు నేను కేవలం భయపడే పెండ్లి చేసుకున్నా. ఇప్పుడు ఇష్టం లేదు. నేను ఇంకెక్కడికీ రాను. నన్ను వదిలేయమనండి. లేదంటే అతనిపై పోలీస్ స్టేషన్లో కేసుపెడతా'' అంది.
ఆమె మాటలన్నీ విన్న సభ్యులు శ్రీధర్‌తో ''నీతో కలిసి ఉండటం ఇష్టం లేదని ఆమె కచ్చితంగా చెబుతుంది. ఇక నువ్వు ఆ అమ్మాయి గురించి ఆలోచించడం తప్పు. తన మనసు ఎందుకు మార్చుకుందో స్పష్టంగా చెప్పడం లేదు. ఆమె మాటలు వింటుంటే మరెప్పుడూ నిన్ను కలిసే విధంగా అనిపించడం లేదు. వాళ్ళ అమ్మనాన్నలకు భయపడి ఇలా చెప్పినా ప్రస్తుతం మనం ఏమీ చేయలేం. ఏదైనా నిర్ణయం ఆమె చేతిలోనే ఉంది. కనీసం ఆమెకు ఆలోచించుకునే సమయం కూడా లేదు. వాళ్ళ అమ్మవాళ్ళు పెండ్లి కూడా నిర్ణయించారు. నిజంగా నువ్వు ఆమెను ప్రేమించినట్లయితే తను తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా గౌరవించు. ఆమెను ఇబ్బంది పెట్టకు. నీకూ ఓ కుటుంబం ఉంది. మీ అమ్మా, నాన్న, చెల్లి నీకోసం చాలా బాధపడుతున్నారని నువ్వే చెప్పావు. ఇకపై వాళ్ళకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకో. నీ జీవితం సంతోషంగా ఉంటుంది. అసలు ఇంట్లో ఉన్న నీ చెల్లికి పెండ్లి చేయకుండా, ఓ జీవితం చూపించకుండా ప్రేమిస్తున్నానంటూ ఓ అమ్మాయి ఇల్లు వదిలి రాగానే వెనకా ముందు చూడకుండా పెండ్లి చేసుకున్నావు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇలాంటి సమస్యలే వస్తాయి. కాబట్టి ఇక నువ్వు నీ కుటుంబం గురించి ఆలోచించుకుంటే మంచిది'' అన్నారు.
''లేదు మేడమ్, నేనంటే వీణకు ప్రాణం. నేను ఎన్ని రోజులైనా ఆమె కోసం ఎదురుచూస్తాను. ఆమె లేకుండా నేను ఉండలేను'' అని చెప్పి వెళ్ళిన శ్రీధర్ మళ్ళీ రెండు వారాల తర్వాత గాయాలతో వచ్చాడు. ఏం జరిగిందని సభ్యులు అడిగారు.
''వీణ నాపైన పోలీస్ స్టేషన్లో కేసుపెట్టింది. పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ వస్తే వెళ్ళాను. వాళ్ళు నాతో మాట్లాడాలని పిలిచి చంపేస్తానని బెదిరించి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. స్టేషన్‌కు వీణ కూడా వచ్చింది. ఆమె ముందే పోలీసులు నన్ను కొడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇన్ని రోజులు వీణకు నేనంటే ఇష్టమనుకున్నా. కాని తను నన్ను ఇలా మోసం చేస్తుందనుకోలేదు. ఇక ఆమె గురించి ఆలోచించను. అసలు తను ఎందుకు ఇలా చేస్తుందో కూడా అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఇక నేను నా జీవితం గురించి, నా కుటుంబం గురించే ఆలోచిస్తాను. ఈ విషయాలు మీరు నాకు ముందే చెప్పారు. కానీ నేనే ఆమెపై ఉన్న గుడ్డి ప్రేమతో ఆలోచించలేకపోయాను. ఈ విషయాలే మీకు చెబుదామని వచ్చాను. అప్పుడు మీరు చెప్పినట్టు చేసినట్టయితే ఇప్పుడు నాకు ఈ సమస్య వచ్చేది కాదు. మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి'' అన్నాడు.
'ఆ సమయంలో నీ మనసు మేం చెప్పిన దానికి అంగీకరించలేదు. ఆమెపై నీకున్న ప్రేమ అలాంటింది. అందుకే ఆలోచించలేదు. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు. మీ కుటుంబంతో సంతోషంగా ఉండు. ఇంట్లో వాళ్ళకు ఎలాంటి కష్టం కలగకుండా మంచిగా చూసుకో' అని చెప్పి సభ్యులు శ్రీధర్‌ను పంపించారు.
- సలీమ