Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నారులకి ఏ పనులు చెప్పకుండా, అసలు కష్టం తెలియకుండా పెంచుతున్నారు ఈ తరం. దీనివల్ల పిల్లలు పెరుగుతున్న పనులు బాధ్యత తెలియకుండా పోతోంది. పనుల్లో భాగస్వాముల్ని చేయడం వల్ల మీ కష్టం అర్థం కావడం మాత్రమే కాదు.... వ్యక్తిత్వ పాఠాలు నేర్చుకుంటారు.
పిల్లల్ని ఒక్కసారిగా 'నువ్వు ఈ పని చెరు.. ఆ పని చెరు' అని ఆర్డర్లు వేయకూడదు. వారికి అసలు అమ్మగా మీ దిన చర్య ఏంటో తెలియజేయాలి. చిన్నారులకి అన్నీ అమర్చి.. సమయానికి బడికి పంపుతున్నారంటే దాని వెనక పడే కష్టం వారికి అర్థమయ్యేలా చూడాలి. అలా వివరించే క్రమంలో చిన్నారులు అడిగే సందేహాలను తప్పకుండా తీర్చాలి. అంతేకాదు ఇంటి పనుల కోసం ఎలాంటి ప్రణాళిక వేసుకుంటారు. అందుకోసం అన్నీ ఎలా సమన్వయం చేసుకుంటారనేది వాళ్లకి అర్థమయ్యేలా చూడాలి.
ఎలాంటి పనులు చిన్నారులు చేయొచ్చో వారికి తెలియజెప్పాలి. తమ గది తాము సర్దుకోవడం, దుస్తులు మడత పెట్టుకోవడం... దగ్గర్లో ఉన్న దుకాణానికి వెళ్లి కావల్సినవి కొనుక్కురావడం, కూరగాయలు కడగడం, కోసివ్వడం.. పుస్తకాలూ, పత్రికలూ ఒక క్రమ పద్ధతిలో సర్దడం, మొక్కలకు నీళ్లుపోయడం.. వంటివి చేయొచ్చని వివరించాలి.
ముఖ్యంగా పిల్లలకు పోటీలూ, బహుమతులూ అంటే చాలా ఇష్టపడతారు. మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే గనుక మీలో ఎవరు ఫలానా పని త్వరగా చేస్తారో చూద్దాం అంటూ చిన్న పోటీ పెట్టండి. 'నేను చేస్తా.. నేను చేస్తా' అంటూ పనిలో నిమగమవుతారు. అలా చిన్నారులు ఏ పనిచేసినా వెంటనే 'ఎంత బాగా చేశావో..' అంటూ పొగిడినా, చిన్న బహుమతి ఇచ్చినా.. వారిలో ఉత్సాహం మరింత రెట్టింపవుతుంది.
పిల్లలకు ఏదైనా పని అప్పగించినప్పుడు... ఒక్కోసారి పొరబాటు చేయొచ్చు. అలాంటప్పుడు వారి మీద అరిచి కోప్పడితే పనుల్లో భాగస్వాములు కావడానికి ఆసక్తి చూపరు. పొరబాటుకి కారణం అడిగి ఎంత జాగ్రత్తగా చేయాలో వివరించాలి.
మీ చిన్నారికి బ్రెడ్ శాండ్విచ్, పండ్లతో సలాడ్స్ వంటి సాయంకాలపు అల్పాహారం తయారుచేసేటప్పుడు అదెలా చేస్తున్నారో చూపించండి. అలాగే పండ్ల రసం తయారీలో కూడా పండ్లను శుభ్రపరచడం వంటి చిన్నచిన్న పనులు వాళ్లతో చేయించాలి. దీని ద్వారా శుభ్రతతో పాటు పనిని పంచుకోవడం కూడా అలవడుతుంది.
టిఫిన్ లేదా భోజనం ముగించిన తరువాత వారి పళ్లాలను వారే సింకులో పెట్టడం నేర్పించాలి. అలాగే భోజనబల్లపై మంచినీళ్లు, పళ్లాలు సర్దడం వంటి చిన్నచిన్న పనులను వారికి అలవాటు చేయాలి.
మీరు పెంచే మొక్కలకు సాయంత్రం పూట నీళ్లు పోయమని చెప్పండి. అలాగే వాటికి పూలు, కాయలు వస్తే, వారి వల్లే ఆ మొక్క ఆరోగ్యంగా ఉందని ప్రశంసించండి. వారి మనసుల్లో మొక్కలపై ప్రేమ మొదలవుతుంది. ఆ తరువాత మరిన్ని రకాల మొక్కలను పెంచుదామని వారే మిమ్మల్ని అడుగుతారు.
పాఠశాల నుంచి వచ్చిన వెంటనే విడిచిన దుస్తులు, పుస్తకాల సంచీ, బూట్లూ వంటివాటిని ఎక్కడపడితే అక్కడ కాకుండా, ఓ చోట సర్దేలా అలవాటు చేయండి. భవిష్యత్తులో వారికి ఇదొక క్రమశిక్షణ అవుతుంది. మీకు పని తగ్గుతుంది, వారి పుస్తకాల బీరువాను నెలకొకసారి సర్దుకోవడం వారికి నేర్పించండి. అలాగే ఇంట్లో ఎక్కడ్కెనా చెత్త ఉంటే తీసి చెత్తబుట్టలో వేయించండి. ఇవి వారిని ఓ క్రమశిక్షణ ఉన్న వ్యక్తిగా తీర్చి దిద్దుతాయి.